• గ్రీన్ ఎనర్జీ పాలసీతో రాష్ట్రంలో ఇతోధికంగా సోలార్, విండ్ ఎనర్జీ లో పెట్టుబడులు
-విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్
విజయవాడ: నోవాటెల్ లో నిర్వహించిన గ్రీన్ ఎనర్జీ కాన్ఫరెన్స్ లో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పాల్గొని మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ తీసుకురావడానికి కారణం అప్పట్లో సౌర, గాలి విద్యుత్ పరిశ్రమల్లో పెట్టుబడులు పెట్టడానికి రాష్ట్రానికి ఎవ్వరూ ముందుకు రాకపోవడమేనన్నారు. దానికి కారణం గత ప్రభుత్వ అనుభవాల కారణం కావొచ్చన్నారు.
అందుకే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముందు చూపుతో రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీ పాలసీ తీసుకొచ్చారన్నారు. గుజరాత్ లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో జరిగిన గ్లోబల్ రెన్యువబుల్ ఎనర్జీ ఇన్వెస్టర్స్ మీట్ కు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారధ్యంలో టీమ్ హాజరయ్యామన్నారు. ఆ మీట్ లో రెన్యువబుల్ ఎనర్జీ పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చింది ముఖ్యమంత్రి ఒక్కరేనన్నారు.
ఆ తర్వాత రాష్ట్రంలో 160 గిగా వాట్స్ రెన్యువబుల్ ఎనర్జీ స్థాపక లక్ష్యంతో ప్రభుత్వం సంకల్పించిందన్నారు. ముఖ్యమంత్రి మీద నమ్మకంతో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి పెద్ద ఎత్తున ఎంవోయూలు చేసుకున్నామన్నారు. పెట్టుబడులు పెట్టడానికి పెట్టుబడుదారులు ముందుకొస్తున్నారన్నారని, పెట్టుబడులను గ్రౌండింగ్ చేసే కార్యక్రమానికి వెళ్లాలన్నారు.
స్కిల్ లేని యువతకు స్కిల్స్ లో శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు కల్పించే దిశగా పనిచేస్తున్నామన్నారు. వలస ప్రాంతమైన ప్రకాశం జిల్లా కనిగిరి ప్రాంతంలో సైతం కొత్త పరిశ్రమలు గ్రౌండింగ్ చేసే పనిలో ఉన్నామన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్ బూరుగుపల్లి శేషారావు, నెడ్ క్యాప్ వైస్ చైర్మన్ మరియు ఎండీ ఎం. కమాలాకర్ బాబు ప్రసంగించారు.