– మోదీ ని రేవంత్ రెడ్డి విమర్శిస్తే అది ఆకాశం మీద ఉమ్మేయడమే
– బీసీల సంక్షేమానికి ఐదేళ్లలో లక్షకోట్లు ఇస్తామని చెప్పారు
– దీని ప్రకారం ఇప్పటికే కనీసం 40వేల కోట్లు ఇవ్వాలి
– కానీ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు.
– బట్టకాల్చి బీజేపీ మీద వేస్తానంటే చూస్తూ ఊరుకోం
కాంగ్రెస్ జంతర్ మంతర్ సభపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
న్యూఢిల్లీ: జంతర్‌మంతర్ లో కాంగ్రెస్ పార్టీ పెట్టుకున్న సభ గాంధీ కుటుంబాన్ని పొగడటానికే సరిపోయింది. రాష్ట్రంలో రాజకీయంగా ఎదురవుతున్న ఒత్తిడిని తట్టుకునేందుకు, గాంధీ కుటుంబం అనుగ్రహం పొందాలన్న లక్ష్యంతో రేవంత్ రెడ్డి.. ఢిల్లీ సభ పెట్టుకున్నారనేది స్పష్టంగా అర్థమవుతోంది. 31 నిమిషాల రేవంత్ రెడ్డి ప్రసంగంలో, 50 శాతానికంటే ఎక్కువ సమయం, రాహుల్, సోనియా జపం చేయడానికే సరిపోయింది.
బీసీ రిజర్వేషన్లు ఇస్తామని తెలంగాణ ప్రజలకు హామీ ఇచ్చారు. దాన్ని పూర్తిచేసుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ దే. అందుకోసం న్యాయపరమైన, చట్టపరమైన అంశాలపై దృష్టిసారించి, చిత్తశుద్ధితో పనిచేయాలి తప్ప.. అది చేయలేక, బట్టకాల్చి బీజేపీ మీద వేస్తానంటే చూస్తూ ఊరుకోం.
చట్టపరమైన, న్యాయపరమైన ప్రణాళిక లేకుండా, కామారెడ్డి డిక్లరేషన్ ను ప్రకటించిన రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి.. 18 నెలలుగా ఆ డిక్లరేషన్ లో పేర్కొన్న అంశాల అమలు ఊసెత్తడం లేదు. బీసీల సంక్షేమానికి ఐదేళ్లలో లక్షకోట్లు ఇస్తామని చెప్పారు. దీని ప్రకారం ఇప్పటికే కనీసం 40వేల కోట్లు ఇవ్వాలి. కానీ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు.
వివిధ కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటుచేయాలి. కానీ ఈ దిశగా ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. రజకులు, గౌడ్లు.. ఇలా ఏ ఒక్క బీసీ వర్గాన్ని వదలకుండా అందరినీ నిట్టనిలువునా మోసం చేశారు.
అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర అవుతోంది. స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టాలి. కానీ ఎన్నికలు నిర్వహిస్తే ప్రజాక్షేత్రంలో వ్యతిరేకత బయటపడుతుందని గ్రహించి.. రిజర్వేషన్ల పేరుతో డ్రామాలు ఆడుతున్నారు తప్ప.. మీకు బీసీలకు సాధికారత కల్పించే విషయంలో చిత్తశుద్ధి లేదనేది తెలంగాణ బీసీ సమాజానికి అర్థమైంది. అక్కడ ధర్నా చేస్తే.. ఎవరూ పట్టించుకోరని.. ఢిల్లీకి వచ్చి పగటివేషాలు వేస్తున్నారు.
పాలనలో వైఫల్యం, రాజకీయంగా వైఫల్యం, ఆర్థిక పరంగా వైఫల్యం ఇలా వరుసగా మీ చేతకాని తనం బయటపడుతుండటంతోనే.. ఢిల్లీలో ధర్నా చేసి.. వాటినుంచి దృష్టి మరల్చే ప్రయత్నం చేస్తున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల్ సీట్లలో ముస్లింలు పోటీ చేసి, 50 రిజర్వ్డ్ సీట్లలో 31 చోట్ల గెలిచారు.
బీఆర్ఎస్, కాంగ్రెస్ ఎవరు అధికారంలో ఉన్నా మజ్లిస్ పార్టీ చెప్పినట్లు పనిచేస్తున్నారు. ఇప్పుడు అధికారికంగా 10% ముస్లింలను బీసీల్లో చేర్చి 42% రిజర్వేషన్ అమలు చేస్తే.. బీసీలకు రాజ్యాధికారం కష్టమేననేది తెలంగాణ సమాజానికి అర్థమైంది.
ముందుగా.. అశాస్త్రీయమైన సర్వే చేసి, బీసీల సంఖ్యను తగ్గించారు. ఆ తర్వాత దీనికి 10% ముస్లింలను చేర్చి.. బీసీలను మోసం చేస్తున్నారు. నాడు బీఆర్ఎస్ చేసిన తప్పులనే, నేడు కాంగ్రెస్ కొనసాగిస్తోంది. రాజ్యాంగ విరుద్ధంగా చేపట్టే మతపరమైన రిజర్వేషన్లను బీజేపీ అడ్డుకుని తీరుతుంది. ఎట్టిపరిస్థితుల్లోనూ ముస్లింలతో కూడిన బీసీ రిజర్వేషన్లను బీజేపీ అంగీకరించదు.
1955లో బీసీలకు రిజర్వేషన్లకు కల్పించాలన్న కాకా కాలేల్కర్ కమిషన్ రిపోర్టును నెహ్రూ పక్కన పెట్టారు. ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ కలసి మండల్ కమిషన్ రిపోర్టును ఉద్దేశపూర్వకంగానే విస్మరించారు. ఇలా ప్రతి సందర్భంలోనూ నెహ్రూ కుటుంబం బీసీలకు అన్యాయం చేసింది.
వరుసగా మూడు ఎన్నికల్లో దారుణ ఓటమి. కనీసం వంద సీట్లు కూడా దాటని పరిస్థితి. రోజురోజుకూ ప్రజల్లో కాంగ్రెస్ పట్ల పెరుగుతున్న వ్యతిరేకత, మధ్య అధికారం గురించి కాంగ్రెస్ పగటి కలలు కంటోంది. నరేంద్రమోదీ ని రేవంత్ రెడ్డి విమర్శిస్తే, అది ఆకాశం మీద ఉమ్మేయడమే. మోదీ నేతృత్వంలో సుస్థిరమైన పాలన అందుతోంది. అందుకే కనీసం వచ్చే 30 ఏళ్ల వరకు కాంగ్రెస్ కేంద్రంలో అధికారం గురించి ఆలోచించడం మానుకోవడమే ఉత్తమం.