-కేంద్రంతో జరిపిన ఉత్తర ప్రత్యుతత్తరాలను బహిర్గతం చేయాలి
-శాసనమండలి ప్రతిపక్షనేత యనమల రామకృష్ణుడు
రాష్ట్రంలో వాస్తవ ఆర్థిక పరిస్థితిని మరుగుపెట్టి తప్పుడు లెక్కలతో అటు కేంద్రప్రభుత్వాన్ని, ఇటు రాష్ట్రప్రజలను రాష్ట్ర ప్రభుత్వం తప్పుదోవ పట్టిస్తోంది. రాష్ట్ర రెవెన్యూ ఆదాయాలతో సంబంధం లేకుండా విచ్చలవిడిగా అధికవడ్డీలకు అప్పులు తెస్తూ రాజ్యాంగ ఉల్లంఘనలు పాల్పడుతోంది. ఒక తప్పును సరిద్దిడానికి తప్పుమీద తప్పు చేస్తూ రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టింది. అప్పులున్న వాడివెంట నడవరాదని పెద్దలు చెబుతూ ఉంటారు. రాష్ట్రంలోని పరిస్థితి చూసి పెట్టుబడులు పెట్టడానికి, అప్పులివ్వడానికి ఎవరూ ముందుకు రావడం లేదు.
అర్హతకు మించి రుణాలు తీసుకోవడం, కేంద్రం ఇచ్చిన నిధులను ఇష్టానుసారంగా బదిలీ చేసి ప్రజా ప్రయోజనాలను రాష్ట్ర ప్రభుత్వం దెబ్బతీస్తోంది. రాష్ట్రంలో ఆర్థిక క్రమశిక్షణ లోపించడంతో వేజ్ అండ్ మీన్స్ అడ్వాన్స్ పరిమితులపై కూడా రిజర్వ్ బ్యాంక్ ఆంక్షలు విధించడం జరిగింది. కేంద్ర ప్రాయోజిత పథకాలైన ఉపాధి హామీ, రాష్ట్రీయ ఉచ్చతర్ శిక్షా అభియాన్ (రూసా), వ్యవసాయ యాంత్రీకరణ సబ్‌మిషన్, సుస్థిర వ్యవసాయ కమిషన్, ఆయిల్ పామ్ మిషన్, జాతీయ ఆహార భద్రత మిషన్, రోజ్‌గార్ యోజన, సడక్ యోజన, జల్‌జీవన్ వంటి పథకాల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎంత వ్యయం చేస్తుంది? ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికి ఇచ్చే ప్రత్యేక నిధులను సైతం రాష్ట్ర వాటా జోడించి ఖర్చు చేయడంలో విఫలం కావడంతో ఆ నిధులు సైతం వెనక్కివెళ్లాయి. 14,15 ఆర్థిక సంఘం నుంచి రాష్ట్రంలో గ్రామాల అభివృద్ధికి ఇచ్చిన రూ.6వేల కోట్లు ఏమయ్యాయి? జల జీవన్ మిషన్ కింద రాష్ట్రానికి వచ్చిన రూ.7 వేల కోట్లు ఏం చేశారు..ఎక్కడ ఖర్చు పెట్టారు.? కేంద్రం ఎంత ఇస్తుందో వివరాలు తెలియజేయాలి.
కేంద్ర పథకాల కింద వచ్చే ప్రయోజనాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు సక్రమంగా అందించేలా చర్యలు తీసుకోవడం లేదు. వచ్చిన నిధులను దారి మళ్లిస్తూ అభివృద్ధి, సంక్షేమ పథకాలను అడ్డుకుంటున్నారు. ఉన్నత విద్యా సంస్థల్లో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు రూసా పథకం కింద కేంద్రం ఇస్తున్న నిధులను రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించడంతో గత ఏడాది నుంచి నిధుల విడుదల కూడా నిలిపివేశారు. రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా ఇవ్వాల్సిన నిధులు చెల్లించకపోవడంతో రైల్వే పనులు నిలిచిపోయిన విషయం వాస్తవం కాదా? నడికుడి`శ్రీకాళహస్తి, నరసాపురం`కోటిపల్లి రైల్వే ప్రాజెక్టులు జాప్యం కావడానికి జగన్‌రెడ్డి రాష్ట్ర నిధులు చెల్లించకపోవడం వల్లనే అటకెక్కిన విషయం వాస్తవం కాదా? రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తున్న రుణాలు, ఉపయోగిస్తున్న నిధులపై కేంద్ర ప్రభుత్వం, నీతిఆయోగ్, రిజర్వ్ బ్యాంక్‌తో జరిపిన ఉత్తర ప్రత్యుత్తరాలు, అందించిన నివేదికలు, ఆ సంస్థలు ఇచ్చిన ఆదేశాలు, అందులో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసినవి, అమలు చేయని వివరాలను బట్టబయలు చేయాలి.