– ఐఎంఈసిఇ ఇండియా–2025 సదస్సులో మంత్రి కొండపల్లి శ్రీనివాస్
– 2047 నాటికి సువర్ణ ఆంధ్ర నిర్మాణం
– ఎంఎస్ఎంఈ పాలసీ 4.0లో పెట్టుబడి సబ్సిడీలు
హైదరాబాద్: ఒక కుటుంబం – ఒక వ్యాపారవేత్త లక్ష్యంతో 2027 నాటికి ప్రతి నియోజకవర్గంలో ఎంఎస్ఎంఈ పార్కులు నెలకొల్పుతున్నామని ఎంఎస్ఎంఈ, ఎస్ఈఆర్పీ, ఎన్ఆర్ఐ వ్యవహారాల మంత్రి కొండపల్లి శ్రీనివాస్ చెప్పారు.
హైదరాబాద్లో ఏఎస్ఎంఈ ఇండియా ఆధ్వర్యంలో జరిగిన అంతర్జాతీయ మెకానికల్ ఇంజినీరింగ్ కాంగ్రెస్ & ఎక్స్పోసిషన్ 2025లో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రణాళికను వివరించారు. శ్రీనివాస్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ 166 బిలియన్ అమెరికన్ డాలర్ల జీఎస్డీపీ, ఆరు పోర్టులు, మూడు అంతర్జాతీయ విమానాశ్రయాలతో తూర్పు దేశాలకు గేట్వేగా ఎదుగుతోందని తెలిపారు.
ఎంఎస్ఎంఈ పాలసీ 4.0లో పెట్టుబడి సబ్సిడీలు, టెక్నాలజీ అప్గ్రేడేషన్, పన్ను రాయితీలు వంటి అనేక ప్రోత్సాహాలు ఉన్నాయని వివరించారు. అమరావతిలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్, అలాగే విశాఖ, రాజమహేంద్రవరం, తిరుపతి, ఎన్టీఆర్ జిల్లా, అనంతపురంలో ప్రాంతీయ కేంద్రాలు ప్రారంభమవుతున్నాయని తెలిపారు.
గ్రీన్ ఎనర్జీ రంగంలో 9.2 లక్షల కోట్ల రూపాయల ప్రాజెక్టులు ఆమోదమయ్యాయని, సెమీ కండక్టర్, ఐటి, క్వాంటం టెక్నాలజీలలో రాష్ట్రం ముందడుగు వేసిందని పేర్కొన్నారు. 2047 నాటికి సువర్ణ ఆంధ్ర నిర్మాణం లక్ష్యమని, నవంబర్ 14–15న విశాఖపట్నంలో జరిగే పార్ట్నర్షిప్ సమ్మిట్–2025కు పెట్టుబడిదారులను ఆహ్వానించారు.
ఆంధ్రప్రదేశ్ ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ తమ్మిరెడ్డి శివశంకరరావు, ఎంఎస్ఎంఈల వృద్ధి, క్లస్టర్ అభివృద్ధి, మార్కెట్ లింకేజీలపై ప్రభుత్వ ప్రయత్నాలను వివరించారు. చంద్రబాబు నాయుడు నేతృత్వం వల్ల హైదరాబాదు టెక్హబ్గా ఎదిగిందని, అదే దిశలో నూతన ఆంధ్రప్రదేశ్ కూడా బలమైన తయారీ కేంద్రంగా రూపుదిద్దుకుంటోందని అన్నారు.