Suryaa.co.in

Andhra Pradesh

ఆర్థిక, ఆరోగ్య రంగాల్లో అగ్రస్థానంలో ఆంధ్రప్రదేశ్‌

– తెలుగు రాష్ట్రం ప్రగతిని ధ్రువీకరిస్తున్న అనేక తాజా సర్వేలు
(వేణుంబాక విజయసాయిరెడ్డి, రాజ్యసభ సభ్యుడు)

భారత ఆర్థిక వ్యవస్థను ముందుకు దూకిస్తున్నది దక్షిణాది రాష్ట్రాలేనని నీతి ఆయోగ్‌ మాజీ సీఈఓ అమితాబ్‌ కాంత్‌ శుక్రవారం ఓ కార్యక్రమంలో చెప్పడం పాత వాస్తవాన్ని మరోసారి ధ్రువీకరించినట్టయింది. ‘ఇండియాలో 7 నుంచి 10 శాతం వృద్ధి సాధించాలంటే దక్షిణాది రాష్ట్రాలు ఇంకా మెరుగైన ప్రగతి సాధించాలి. ఇప్పటికే దక్షిణాది రాష్ట్రాలు దేశ ఆర్థిక వ్యవస్థను శరవేగంతో పరిగెత్తిస్తున్నాయి.
ప్రధానంగా పది పన్నెండు రాష్ట్రాలు 10% వృద్ధి రేటుతో ముందుకు పోవాలి. ఇతర రాష్ట్రాలూ వాటితో పాటు ప్రగతిపథంలో పయనిస్తే భారత ఆర్థిక వ్యవస్థలో అభివృద్ధి నిరంతరాయంగా కొనసాగుతుంది,’ అని ఆయన చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఇంకా ఇతర దక్షిణాది రాష్ట్రాలకున్న ప్రాధాన్యాన్ని చెప్పకనే చెబుతున్నాయి. కొత్త పరిశ్రమలు స్థాపన సహా అన్ని రకాల వ్యాపార, వాణిజ్య రంగాలకు దక్షిణాదిన ఆంధ్రప్రదేశ్‌ అన్ని విధాలా అనువైన రాష్ట్రమని అనేక సర్వేలు ఇటీవల వెల్లడించాయి.

కొత్త పెట్టుబడులకు, పోర్టు ఆధారిత పరిశ్రమలు, వ్యాపారాలకు ఏపీ అత్యంత ప్రయోజనకరమైన రాష్ట్రమని కూడా ఈ అధ్యయనాలు వివరిస్తున్నాయి. ఈ పెద్ద తెలుగు రాష్ట్రంలో గత నాలుగేళ్లుగా కొనసాగుతున్న రాజకీయ, వ్యాపార సుస్థిరత నూతన పెట్టుబడులను ఆకర్షిస్తున్నదని కూడా వార్తలొస్తున్నాయి.

ఆరోగ్యరంగంలోనూ ఆంధ్రప్రదేశ్‌ ముందంజ

ప్రజారోగ్యంతోపాటు ప్రజల సర్వోతోముఖాభివృద్ధికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి గారి నేతృత్వంలోని వైఎస్సార్సీపీ ప్రభుత్వం విశేష కృషి చేస్తోంది. ఆంధ్రుల సామాజిక ప్రగతికి పెద్ద పీటవేస్తోంది. వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ మొదలు అనేక ఆరోగ్య పరిరక్షణ కార్యక్రమాల వల్ల ఆర్థికశక్తి లేని పేద ప్రజలు సైతం ఏపీలో మెరుగైన వైద్యం చేయించుకోగలుగుతున్నారు. ప్రభుత్వ పథకాల వల్ల లభించే కొనుగోలు శక్తితో పోషకాహారం తీసుకునే స్థితిలో ఉన్నారు. సకాలంలో చికిత్స ద్వారా రాష్ట్ర ఆర్థిక ప్రగతికి జనం దోహదం చేస్తున్నారు.

జననేత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర రెడ్డి 2004–2009 మధ్య కాలంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ లో ప్రజారోగ్య పరిరక్షణకు తీసుకున్న అనేక చర్యలు, ప్రవేశపెట్టిన అనేక చికిత్సా కార్యక్రమాల ఫలితంగా నేడు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆరోగ్యం విషయంలో దేశంలో మెరుగైన స్థితిలో ఉన్నారు. పేద ప్రజలకు ఏపీ ప్రభుత్వం అందజేస్తున్న ఆహార ధాన్యాలు, ఇతర పోషక పదర్ధాల వల్ల వారు ఆరోగ్యకర జీవనం గడుపుతున్నారు.

దేశంలో మధుమేహంతో ఇబ్బందిపడుతున్న ప్రజలకు సంబంధించి వచ్చిన తాజా నివేదికలోని అంశాలు ఈ విషయం రుజువుచేస్తున్నాయి. భారతదేశంలో అసాంక్రమిక వ్యాధులకు సంబంధించి ఐసీఎంఆర్‌ రూపొందించిన తాజా నివేదికను విడుదల చేశారు. దేశ ప్రజల ఆరోగ్య స్థితిగతులు వివరించే ఈ నివేదిక ప్రకారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మధుమేహుల సంఖ్య ఇతర రాష్ట్రాలతో పోల్చితే బాగా తక్కువ. డయాబెటిస్‌ విషయంలో దేశంలోని మొత్తం 28 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాల జాబితాలో ఆంధ్రా 19వ స్థానంలో ఉంది.

అంటే 18 రాష్ట్రాల కన్నా ఏపీలో మధుమేహుల సంఖ్య తక్కువ. అలాగే తెలంగాణ ఈ జాబితాలో 17వ స్థానంలో ఉంది. అనేక అననుకూల పరిస్థితులను అధిగమించి గత 4 ఏళ్లుగా ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక, ఆరోగ్య రంగాల్లో మిగిలిన అనేక రాష్ట్రాలతో పోల్చితే చాలా మెరుగైన స్థితిలో ఉందని తాజా వార్తలు, అధ్యయనాలు సూచిస్తున్నాయి.

 

LEAVE A RESPONSE