— ఇక కఠిన సంస్కరణలే మార్గం
ఆంధ్రప్రదేశ్ రైతు సంక్షోభం అనేది ఒక్కసారిగా పుట్టిన విపత్తు కాదు. అది సంవత్సరాలుగా పెరిగిన రాజకీయ నిర్లక్ష్యం, అవినీతి, మరియు ఒకే పంటపై ఆధారపడిన ప్రమాదకర వ్యవసాయ నిర్మాణం కలిపి తీసుకొచ్చిన దుస్థితి. ఈ పరిస్థితి అలాగే కొనసాగితే, రైతు జీవితం ప్రతి ఏడాది కొత్త విపత్తుల బారిన పడుతూనే ఉంటుంది—ఒకసారి West Asiaలో యుద్ధం, మరోసారి El Niño వంటి వాతావరణ దుస్థితులు.
ఈ సంక్షోభానికి మూల కారణం వరి ఆధిపత్యం
వరి ఇప్పుడు వ్యవసాయ పంట కంటే ఎక్కువగా రాజకీయ పంటగా మారింది. ప్రకృతి పరిస్థితులు, నీటి వనరులు, భూసార సామర్థ్యం ఏమి చెబుతున్నాయన్నది పక్కన పెట్టి, సబ్సిడీలు, కొనుగోలు హామీలు, రాజకీయ లాభాల కోసం వరిని ఒకే మార్గంగా నెట్టారు.
ఇప్పుడు చెప్పాల్సిన కఠిన సత్యం ఒక్కటే — వరి సాగును క్రమంగా నిరుత్సాహపరచాలి.
దానికి బదులుగా ప్రభుత్వ సబ్సిడీలు, ప్రోత్సాహాలు పప్పుదినుసులు, చిరుధాన్యాలు, నూనెగింజలు, కూరగాయలు, పండ్లు, తోటపంటలు వంటి ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లాలి. ఇవి నీరు తక్కువగా వినియోగిస్తాయి, ప్రకృతి మార్పులను తట్టుకుంటాయి, రైతుకు స్థిరమైన ఆదాయాన్ని అందిస్తాయి.
తీర ప్రాంత ఆంధ్రలో వర్షాల అనిశ్చితి కొత్త విషయం కాదు. చరిత్రంతా ఇదే సత్యం చెబుతోంది. తుపాన్లు, వరదలు, ఎండలు ఈ భూభాగానికి సహజమైన చక్రం. ఈ వాస్తవాన్ని అంగీకరించని వ్యవసాయ విధానం రైతును ప్రతి ఏడాది సంక్షోభంలోకి నెడుతుంది.
ఇక్కడ కేరళ ఉదాహరణ మనకు పాఠం చెబుతోంది. అక్కడ కొబ్బరి ఒక సాధారణ పంట కాదు. అది ఆర్థిక వ్యవస్థకు అస్తం అది ఆర్థిక వ్యవస్థకు అస్తంభం. కొబ్బరి ఆధారంగా ఎగుమతుల వ్యూహం, విలువ ఆధారిత ఉత్పత్తులు, అంతర్జాతీయ మార్కెట్ అనుసంధానం ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతాలకు కూడా అలాంటి అవకాశాలు ఉన్నప్పటికీ, వాటిని సమగ్రంగా అధ్యయనం చేసి అమలు చేయడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయి.
రాజకీయ పరంగా కూడా ఒక అవకాశ ద్వారం తెరచి ఉంది. రాష్ట్రంలో అధికార కూటమి, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో భాగస్వామిగా ఉంది. ఈ పరిస్థితిలో రైతు సమస్యలను కేంద్రం ముందు బలంగా ఉంచి పరిష్కారాలను సాధించాలి.
సబ్సిడీలు దారి మళ్లడం, విధానాలు మలుపు తిరగడం, వ్యవస్థలు బలహీనపడడం — ఇవన్నీ రాజకీయ అవినీతి వల్లే. రైతును రక్షించాలంటే వ్యవసాయ విధానాలను మాత్రమే కాదు, రాజకీయ వ్యవస్థను కూడా శుద్ధి చేయాలి.
అప్పుడు మాత్రమే ఆంధ్రప్రదేశ్ రైతు నిజంగా నిలబడగలడు. ప్రకృతి విపత్తుల ముందూ, ప్రపంచ రాజకీయాల ముందూ, వ్యవస్థ వైఫల్యాల ముందూ.
వరి ఆధిపత్యం తగ్గాలి.
పంట వైవిధ్యం పెరగాలి.
మార్కెట్లు విస్తరించాలి.
రైతు బలపడాలి.
రాజకీయ అవినీతి నిర్మూలన చెందాలి.
అప్పుడే ఆంధ్రప్రదేశ్ రైతు భవిష్యత్తు పునరుజ్జీవిస్తుంది.
తీర ప్రాంతానికి తుపాన్లు సహజం. కాబట్టి శాశ్వత చర్యలు అవసరం. తుపాను ఆశ్రయ కేంద్రాలు, బలమైన నీటి పారుదల వ్యవస్థలు, శాస్త్రీయ పంట సూచనలు, సమర్థమైన పంట బీమా వ్యవస్థ.
అయితే ఒక కఠిన సత్యాన్ని కూడా చెప్పక తప్పదు.
అతిగా పెరిగిన ఉచితాల రాజకీయాలు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను కుంగదీస్తున్నాయి. “మూడో సంతానానికి నగదు ప్రోత్సాహం” వంటి పథకాలు రాజకీయంగా ఆకర్షణీయంగా కనిపించవచ్చు. కానీ పేదరికం, నిరుద్యోగం, నైపుణ్యం లేని యువత సముదాయం పెరుగుతున్న రాష్ట్రంలో ఇటువంటి జనాభా ప్రోత్సాహాలు భవిష్యత్తులో భారమవుతాయి. జనాభా పెరుగుదలే అభివృద్ధి కాదు. నైపుణ్యం, ఉపాధి, ఉత్పాదకతే నిజమైన జనాభా లాభం.
తక్షణ చర్యగా కేంద్ర ప్రభుత్వం అధిక ఉత్పత్తిని కొనుగోలు చేసి రైతును రక్షించాలి. మార్కెట్లో ధరలు కూలిపోకుండా ముందస్తు ప్రణాళికతో కొనుగోలు విధానం ఉండాలి. అప్పుడు మాత్రమే ఆంధ్రప్రదేశ్ రైతు నిజంగా నిలబడగలడు.
ప్రత్యామ్నాయ పంటలకు విస్తృత సబ్సిడీలు, మార్కెట్ హామీలు, నిల్వ సదుపాయాలు, ప్రాసెసింగ్ పరిశ్రమలు ఏర్పాటు చేయాలి. రైతు కేవలం పంట పండించే వ్యక్తి మాత్రమే కాదు. మార్కెట్‌తో అనుసంధానమైన ఆర్థిక వ్యవస్థలో భాగం.
విదేశాంగ దౌత్యం కూడా వ్యవసాయానికి ఉపయోగపడాలి. రాష్ట్రం ఇతర దేశాలతో వ్యాపార ఒప్పందాల కోసం ముందడుగు వేస్తే, అదే ఉత్సాహంతో Middle East మార్కెట్లలో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ ఉత్పత్తులకు మార్గాలు వెతకాలి.
ఇంకో కీలక అంశం — రైతు అవగాహన
ఒకే పంటపై ఆధారపడటం ఎంత ప్రమాదకరమో రైతులకు స్పష్టంగా చెప్పాలి. ముందస్తు చర్యలు తీసుకోకుండా ప్రతి ఏడాది విపత్తుల తర్వాత పరిహారం ప్రకటించడం పరిష్కారం కాదు
అప్పుడే ఆంధ్రప్రదేశ్ రైతు భవిష్యత్తు పునర్జీవిస్తుంది.
-మండగిరి శివప్రసాద్
(రిటైర్డు ఐపిఎస్)