Suryaa.co.in

Andhra Pradesh

నాగలక్ష్మిది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే

– ముఖ్యమంత్రికి తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు లేఖ

19.03.2022
బహిరంగ లేఖ
గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిగారికి నమస్కారములు
విషయము: రాష్ట్రంలో మహిళలపై వరుస అత్యాచారాలు, లైంగిక దాడులు, వైసీపీ నేత వేధింపులు తట్టుకోలేక మచిలీపట్నంలో వీఓఏ నాగలక్ష్మి ఆత్మహత్య, మహిళలపై అఘాయిత్యాలు అరికట్టేందుకు ప్రభుత్వం తీసుకున్న చర్యల గురించి…

అర్ధరాత్రి ఆడబిడ్డ స్వేచ్ఛగా తిరిగినప్పుడే నిజమైన స్వాతంత్ర్యం అని మహాత్ముడు చెప్పారు. కానీ… మీ పాలనలో ఆ పరిస్థితులు ఉన్నాయా అని ఒక్కసారి గుండెమీద చేయివేసుకుని చెప్పండి. ఒక మహిళగా ఎంతో వేదనతో నేను మీకు ఈ లేఖ రాస్తున్నాను. బహుశా మీరు ఎప్పటిలాగే ఈ లేఖనూ తేలిగ్గా తీసుకుంటారనుకుంటా! అయినప్పటికీ మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, వేధింపుల పర్వం గురించి మీ దృష్టికి తీసుకురావాలని ప్రయత్నిస్తూనే ఉన్నాను.

కృష్ణా జిల్లా మచిలీపట్నంలో నాగలక్ష్మి అనే విలేజ్ ఆర్గనైజింగ్ అసిస్టెంట్ బలవన్మరణం నా మనసును కలిచివేసింది. వైసీపీ నేత గరికపాటి నరసింహారావు వేధిస్తున్నాడని, నీచంగా మాట్లాడుతున్నాడని, తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నాడని బాధితురాలు ఫిర్యాదు చేసినా పోలీసులు చర్యలు తీసుకోకపోవడం మీ అసమర్థ పాలనకు నిదర్శనం కాదా?

నాగలక్ష్మిది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే. తప్పు చేసిన వారిని కఠినంగా శిక్షించి ఉంటే ఇలాంటి ఘటనలు జరిగేవా? మహిళలకు రక్షణగా నిలవాల్సిన అధికార వైసీపీ నేతలే కాలకేయుల మాదిరి అఘాయిత్యాలకు తెగబడుతుంటే మీకు సిగ్గుగా అనిపించడం లేదా? వారిపై మీరేం చర్యలు తీసుకున్నారు?

రాష్ట్రంలో యథా లీడర్ తథా క్యాడర్ అన్నట్టు పరిస్థితి తయారైంది. మహిళలపై అఘాయిత్యాలు నిత్యకృత్యమవడానికి ప్రభుత్వ బాధ్యతారాహిత్యమే కారణం. మీ సొంత జిల్లా కడపలో ఇంటర్ విద్యార్థినిని ఓ కిరాతకుడు అత్యాచారం చేస్తే వాడిని శిక్షించకపోవడం దేనికి సంకేతం? అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున నెల్లూరు జిల్లాలో వైసీపీ నాయకుడు విదేశీ వనితను చెరపట్టబోయాడు.

ఆ నీచుడు రాష్ట్ర పరువు తీసి దర్జాగా కాలర్ ఎగరేసుకుంటూ బయట తిరుగుతున్నాడంటే మీది నేరస్థుల ఫ్లెండ్లీ గవర్నమెంట్ కాదా? గుంటూరు జిల్లాలో వైసీపీ ఎంపీటీసీ కుమారుడు సహకరిస్తావా లేక ఉద్యోగం ఊడకొట్టమంటావా అంటూ అంగన్ వాడీ ఆయాను బెదిరించాడంటే రాష్ట్రంలో ప్రభుత్వం, పోలీస్ వ్యవస్థ ఎలా పనిచేస్తున్నాయో అర్ధమవుతోంది.

మీ ఇంటి సమీపంలో గ్యాంగ్ రేప్ జరిగిన ఏడాది దాటినా నేటికీ నిందితుడు వెంకట్ రెడ్డిపై చర్యల్లేవు. నేరం చేసిన వాడిని వెంటనే కఠినంగా శిక్షిస్తే మరో తప్పు చేసేందుకు భయపడతారు. కానీ మీ చర్యలే నేరస్థులను ప్రోత్సహించేలా ఉంటే మహిళలకు దిక్కెవరు? దేశవ్యాప్తంగా మహిళలపై జరిగే నేరాల్లో 3వ వంతు ఏపీలోనే జరుగుతున్నాయి. మహిళలపై జరుగుతున్న భౌతిక దాడుల్లో మొదటి స్థానం, మానవ అక్రమ రవాణాలో 2వ స్థానం, ఎస్సీలపై జరుగుతున్న దాడుల్లో 5వ స్థానం, పని ప్రదేశాల్లో మహిళలపై జరగుతున్న లైంగిక వేధింపు ఘటనల్లో 2వ స్థానంలో రాష్ట్రాన్ని నిలిపారు.

మహిళలకు రక్షణగా నిలిచే చట్టాలను కూడా చిల్లర రాజకీయాలకు వాడుకోవడం మీ దిగజారుడుతనానికి నిదర్శనం కాదా? దిశా పేరుతో ఫేక్ చట్టం తెచ్చి ఇన్నాళ్లుగా మహిళలను మోసం చేయడం మీకు సిగ్గుగా అనిపించడం లేదా? మృగాళ్ల చేతిలో మహిళలు బలైపోతుంటే వైసీపీ మహిళా ఎమ్మెల్యేలు, మంత్రులు ఏం చేస్తున్నట్టు? మహిళా హోంమంత్రి వల్ల ఎవరికి లాభం?

రాష్ట్రంలో మహిళా కమిషన్ పనిచేస్తోందా? కల్తీ మద్యం, మాదక ద్రవ్యాల సరఫరా, జే ట్యాక్స్ వసూళ్లు పక్కనపెట్టి ఆడబిడ్డల రక్షణపై దృష్టి పెట్టండి. ఇకపై ఏ ఆడపిల్లా కిరాతకుల చేతిలో అత్యాచారానికి గురి కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోండి.

– వంగలపూడి అనిత
తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు

LEAVE A RESPONSE