మంగళగిరి: అన్న క్యాంటీన్లపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 15న పట్టణ ప్రాంతాల్లో వంద అన్న క్యాంటీన్లు ప్రారంభించాలని నిర్ణయించింది. సెప్టెంబరు నెలాఖరుకు మిగిలిన 83 క్యాంటీన్లను అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది.
ఆగస్టు 15 రోజునే 183 క్యాంటీన్లను ప్రారంభించాలని మొదట భావించినా కొన్నిచోట్ల భవన నిర్మాణ పనుల్లో ఆలస్యం అయ్యే అవకాశం ఉందని అధికారులు ప్రభుత్వానికి తెలిపారు. ఈ కారణంగానే రెండు విడతల్లో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
2014-19లో తెలుగు దేశం పార్టీ హయాంలో రూ.5కే పేదలకు భోజనం అందించడానికి అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. గత ప్రభుత్వం ఈ క్యాంటీన్లను మూసివేసింది.. ఈ భవనాలను వార్డు సచివాలయాలు, మున్సిపల్ కార్యాలయాలకు కేటాయించింది.
మళ్లీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో వీటిని తిరిగి తెరవడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. క్యాంటీన్ల భవనాలకు మరమ్మతులు చేసి, వాటిలో సౌకర్యాలు కల్పించేందుకు ఇప్పటికే ప్రభుత్వం నిధులు విడుదల చేసింది.