– వైయస్సార్సీపీ ఆధ్వర్యంలో శాంతియతంగా ర్యాలీలు
– పోలీసుల ఆంక్షలను లెక్కచేయకుండా పాల్గొన్న రైతులు
– ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి వెల్లడి
తాడేపల్లి: రైతాంగ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా వైయస్సార్సీపీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆర్డీఓ కార్యాలయాల వద్ద నిర్వహించిన నిరసన కార్యక్రమం విజయవంతం అయిందని ఎమ్మెల్సీ, వైయస్సార్సీపీ కేంద్ర కార్యాలయ ఇన్చార్జి లేళ్ల అప్పిరెడ్డి వివరించారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పోలీసుల ఆంక్షలను సైతం లెక్కచేయకుండా ఈ నిరసన కార్యక్రమంలో రైతులు వేలాదిగా పాల్గొన్నారని అన్నారు. కూటమి ప్రభుత్వం అన్నదాత పోరును అడ్డుకునేందుకు హౌస్ అరెస్టులు, ముందస్తు నోటీసులతో విఫలయత్నం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు నేతృత్వంలోని ఈ కూటమి ప్రభుత్వాన్ని సాగనంపే రోజులు త్వరలోనే రానున్నాయని లేళ్ల అప్పిరెడ్డి అన్నారు.
ఆయన ఇంకా ఏమన్నారంటే…
పంటలకు గిట్టుబాటు ధర, యూరియా కొరత, ఉచిత పంటల బీమా అమలు, ఇన్పుట్ సబ్సిడీ వంటి రైతాంగ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అన్నదాత పోరు పేరుతో రాష్ట్రవ్యాప్తంగా 74 చోట్ల ఆర్డీఓ కార్యాలయాలతోపాటు సబ్ కలెక్టర్ కార్యాలయాల వద్ద వైయస్సార్సీపీ ఆధ్వర్యంలో రైతుల పక్షాన శాంతియుతంగా నిరసన కార్యక్రమాలు విజయవంతం అయ్యాయి. మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకులు వైయస్ జగన్ ఆదేశాల మేరకు ఆర్డీఓలకు వినతిపత్రాలు అందజేశాం.
వైయస్సార్సీపీ నిరసన కార్యక్రమానికి పిలుపునిస్తే ఈ ప్రభుత్వం ఉలిక్కిపడింది. గ్రామ స్థాయిలో ఉన్న నాయకులకు నిరసన కార్యక్రమంలో పాల్గొనకూడదని నోటీసులిచ్చి కేసులు పెడతామని బెదిరించారు. ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు చేశారు. అయినా అవన్నీ లెక్క చేయకుండా ప్రభుత్వ వైఫల్యాలపై ప్రశ్నించడానికి రాష్ట్ర వ్యాప్తంగా రైతులు కదంతొక్కారు. శ్రీకాకుళం నుంచి హిందూపురం వరకు వైయస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు నిరసన ర్యాలీల్లో పాల్గొనకుండా హౌస్ అరెస్టులతో పోలీసులు అడ్డుకున్నారు.