Suryaa.co.in

National

అన్నాదురై.. ఇప్పుడు కరుణానిధి!

తమిళనాడు దివంగత సీఎం, డీఎంకే అధినేత కరుణానిధి కోసం స్మారక చిహ్నాన్ని(మెమోరియల్‌) నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మెరీనా బీచ్‌లోని అన్నా మెమోరియల్‌ కాంప్లెక్స్‌లోనే 2.21 ఎకరాల్లో రూ.39కోట్ల వ్యయంతో కరుణానిధి మెమోరియల్‌ నిర్మించనున్నట్లు ప్రభుత్వం జీవో కూడా విడుదల చేసింది. తమిళనాడు రాజకీయాల్లో తనదైన ముద్రవేస్తూ.. పది సార్లు డీఎంకే అధ్యక్షుడిగా, ఐదుసార్లు ముఖ్యమంత్రిగా పని చేసిన కరుణానిధి.. 2018 ఆగస్టులో కన్నుమూశారు. ప్రస్తుత తమిళనాడు సీఎం ఎం.కె స్టాలిన్‌.. కరుణానిధి కుమారుడన్న విషయం అందరికి తెలిసిందే.
కరుణానిధి కోసం నిర్మించనున్న స్మారక చిహ్నం నమూనా చిత్రపటాన్ని కూడా ప్రభుత్వం విడుదల చేసింది. సూర్యోదయం సమయంలో కనిపించే అర్ధ సూర్యుడి ఆకారం.. దాని ముందు పెన్ను ఆకారంలో భారీ స్థూపాన్ని నిర్మించబోతున్నారు. ఈ మెమోరియల్‌లో కరుణానిధి సాధించిన విజయాలు, చేసిన సేవలు, ఆయన జీవితాన్ని విజువల్‌గా చూపించే ఏర్పాట్లు చేయనున్నారట. దీని ద్వారా భవిష్యత్తు తరాలు కరుణానిధి గురించి తెలుసుకుంటాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే మెరీనా బీచ్‌లో సీ.ఎన్‌. అన్నాదురై మెమోరియల్‌ కాంపెక్స్‌తోపాటు ఎంజీఆర్‌ మెమోరియల్‌, జయలలిత మెమోరియల్‌ను గత ప్రభుత్వాలు ఏర్పాటు చేశాయి. ఇప్పుడు వాటి సరసన కరుణానిధి మెమోరియల్‌ కూడా చేరనుంది.

LEAVE A RESPONSE