– పట్టించుకోని రాష్ట్రస్థాయి రెవెన్యూ ఉన్నత అధికారులు
– ప్రజా చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు సిరిపురపు ఆరోపణ
అమరావతి: ఆంధ్రప్రదేశ్లోని మీ భూమి ఆన్లైన్ వెబ్ ల్యాండ్ ప్రభుత్వ వెబ్ సైట్ సరిగ్గా పనిచేయక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, ఈ విషయమై రాష్ట్రస్థాయి రెవెన్యూ ఉన్నత అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజా చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు సిరిపురపు శ్రీధర్ ఆరోపించారు. ఈ మేరకు ఆయన గుంటూరులో సోమవారం ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో మాట్లాడారు.
వ్యవసాయ భూముల హక్కుదారులు తమ భూములను వారసత్వంగా రిజిస్ట్రేషన్ చేయాలన్నా, ఇతరులకు అమ్ముకున్న లేదా కోర్టుల ద్వారా రిజిస్ట్రేషన్ జరిగిన ఈ వ్యవసాయ భూములు ప్రస్తుత యజమాని పేరుతో 1 బి, 10 బి అడంగల్ లో, ప్రభుత్వ రికార్డులలో వీరి పేర్లు మ్యుటేషన్ ద్వారా ఆన్లైన్ వెబ్సైట్లో నమోదు కావాలంటే ‘ఇతరులు’ అనే సూచిక దగ్గర యజమానుల పేర్లను వెబ్సైటు తీసుకోవట్లేదని తెలిపారు.
రెవెన్యూ కార్యాలయాలలో అన్ని ఆధారాలతో ఉన్న ఆ భూ హక్కుదారు పేర్లు ఎక్కిస్తుంటే ప్రభుత్వ వెబ్సైట్ అసలు తీసుకోవట్లేదన్నారు. దీనితో వ్యవసాయ భూముల యజమానులు తమ భూములు అమ్ముకోలేక, ఇతరులకు, తమ వారసులకు ఇవ్వలేక అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.
