– ఆంధ్రప్రదేశ్లో ఇంధన పరిరక్షణపై కేంద్రం స్పష్టీకరణ
కాకినాడ : 2023–24లో దేశవ్యాప్తంగా గృహాలు, భవనాలు, పరిశ్రమలు, రవాణా, వ్యవసాయ రంగాల్లో అమలైన ఇంధన పరిరక్షణ పథకాల ద్వారా ఏటా 53.60 మిలియన్ టన్నుల చమురు సమాన ఇంధన పొదుపు సాధ్యమైందని కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి శ్రీపాద నాయక్ తెలిపారు. దీనివల్ల సుమారు రూ.2 లక్షల కోట్ల వ్యయ తగ్గింపు జరిగినట్లు బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ (బీఈఈ) అంచనా వేసిందన్నారు. అయితే రాష్ట్రాలు లేదా జిల్లాల వారీగా ఇంధన పొదుపు వివరాలను బీఈఈ లెక్కించదని స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్లో ఇంధన పరిరక్షణ పథకాల అమలుపై రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు అడిగిన ప్రశ్నకు సమాధానంగా మంత్రి ఈ వివరాలు వెల్లడించారు. ఇంధన పరిరక్షణ భవన నియమావళి (ఈసీబీసీ) కనీసం 100 కిలోవాట్ల కనెక్టెడ్ లోడ్ లేదా 120 కేవీఏ కాంట్రాక్ట్ డిమాండ్ ఉన్న కొత్త భవనాలకు వర్తిస్తుందని తెలిపారు. దేశవ్యాప్తంగా 27 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో సుమారు 1,400 పట్టణ స్థానిక సంస్థలు ECBCని స్వీకరించాయని, అయితే అనుగుణ భవనాల రాష్ట్ర/జిల్లా వారీ జాబితాను బీఈఈ నిర్వహించడం లేదన్నారు.
అలాగే ఉజాలా పథకం 2015లో ప్రారంభమై లక్ష్యాలు పూర్తయ్యాక 2019లో ముగిసిందని, ప్రస్తుతం ఈఈఎస్ఎల్ ఆన్లైన్, సంస్థాగత మార్గాల ద్వారా మాత్రమే ఎల్ఈడీ బల్బుల విక్రయం కొనసాగుతోందని మంత్రి తెలిపారు.