మరుగుదొడ్ల ముందు దేవతావిగ్రహాలా?.. హవ్వ!
తిరుపతిలో నగరపాలక సంస్థ అధికారుల తీరిది
నగరపాలక సంస్థ అధికారుల “చెత్త” ఆలోచన దుర్మార్గం
హిందువులు ఆరాధ్య దైవతలుగా ప్రతినిత్యం పూజలందుకునే దేవతామూర్తుల విగ్రహాలను, మరుగుదొడ్ల ముందు చెత్త వేసే రోడ్డు ప్రక్కన, నగరపాలక సంస్థ అధికారులు ఏర్పాటు చేయడం మహా అపచారం!
నగరపాలక సంస్థ అధికారుల “చెత్త” ఆలోచన వినాశకాలే విపరీత బుద్ధి అన్న చందంగా మారి హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి. తిరుపతి గంగమ్మ జాతరను గతంలో ఎన్నడూ లేని విధంగా అంగరంగ వైభవంగా నగర ప్రజలకు పరిచయం చేసే స్థాయిలో నిర్వహించిన అధికార పార్టీ పెద్దలు, శ్రీదేవి కాంప్లెక్స్ ముందు ఉన్న మరుగుదొడ్ల వద్ద హిందూ దేవతా విగ్రహాలను ఏర్పాటు చేయడాన్ని సమర్థిస్తారా? లేక వెంటనే నగరపాలక సంస్థ అధికారులకు ఆదేశాలు ఇచ్చి తొలగిస్తారా? హిందువులకు సమాధానం చెప్పండి!
నగరంలో ఎక్కడపడితే అక్కడ చెత్త వేస్తున్నారని నగరపాలక సంస్థ అధికారులు, అత్యుత్సాహంతో హిందువుల మనోభావాలను కించపరిచే విధంగా, శ్రీదేవి కాంప్లెక్స్ వద్ద ఇందిరా ప్రియదర్శిని మార్కెట్ కు వెళ్లే మార్గం ముందు ఉన్న “సులబ్ కాంప్లెక్స్”(మరుగుదొడ్ల) ముందు, 5 హిందూ దేవతా మూర్తులను ప్రతిష్టించడం మహా అపచారం.హిందూ దేవత విగ్రహాలను మరుగుదొడ్ల వద్ద ఏర్పాటు చేసిన అధికారులను వెంటనే సస్పెండ్ చేయండి.
నగరంలో చెత్త వెయ్యకుండా ప్రజలకు అవగాహన కల్పించే విధంగా.. నగరపాలక సంస్థ అధికారులు చర్యలు చేపట్టాలే తప్ప, దేవుళ్ళ విగ్రహాలను పెట్టి చేతులు దులుపుకోవడం చేతకానితనానికి నిదర్శనం.
శ్రీదేవి కాంప్లెక్స్ పరిసర ప్రాంతాల్లో ఉన్న మద్యం షాపులలో మద్యం సేవించి, రాత్రి సమయంలో సులబ్ కాంప్లెక్స్ వద్ద రోడ్డుపై ఉంచిన దేవతా విగ్రహాలపై.. మూత్ర విసర్జన,ఉమ్మి వేయడం,మద్యం బాటల్ లు పడేయడం విగ్రహాలు పగలగొట్టడం లాంటి అపచారాలు జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు? మత విద్వేషాలు రెచ్చగొట్టే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నాను.
తిరుపతి నగరపాలక సంస్థ అధికారులు మరుగుదొడ్ల ముందు ఏర్పాటు చేసిన దేవతా విగ్రహాలను వెంటనే తొలగించి దేవాలయాల్లో ప్రతిష్టించాలని స్థానికుడిగా భక్తునిగా డిమాండ్ చేస్తున్నాను.
నవీన్ కుమార్ రెడ్డి
స్థానికులు
భక్తుడు