– రోజుకు 6 లక్షల లీటర్లకు చేరుకున్న పాల సేకరణ
– అధికారులు, సిబ్బందిని అభినందించిన ఛైర్మన్
– మార్కెట్ లో సంగం ఉత్పత్తులకు అత్యధిక డిమాండ్
వడ్లమూడి : సంగం డెయిరీ వ్యవస్థాపకుల ఆలోచనలు, ఆకాంక్షలు నెరవేరుస్తూ దిగ్విజయముగా 6 లక్షల లీటర్ల పాల సేకరణ పూర్తి చేసిందని భవిష్యత్తులో 12 లక్షల లీటర్ల సేకరణ మరియు మార్కెటింగ్ లక్ష్యంగా ముందుకు సాగుతుందని సంగండెయిరి ఛైర్మన్ ధూళిపాళ్ళ నరేంద్రకుమార్ అన్నారు. డెయిరి పాల సేకరణ, మార్కెటింగ్ 6.0లక్షల లీటర్ల సామర్ధ్యాన్ని అధిగమించిన సందర్భముగా డెయిరిలోని సమావేశ మందిరములో ఛైర్మన్ ఆధ్వర్యములో సీనియర్ అధికారులు, సిబ్బందితో సమావేశము జరిగింది.
ఈ సమావేశములో ఛైర్మన్ చేతుల మీదుగా కేక్ కట్ చేసి, పలువురికి చైర్మన్ అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భముగా ఛైర్మన్ మాట్లాడుతూ 1978వ సంవత్సరములో డెయిరితో పాటు నర్సరావుపేట, గురజాల చిల్లింగ్ సెంటర్లతో లక్ష లీటర్ల పాల సేకరణ సామర్ధ్యంతో ప్రారంభమైన డెయిరి నేడు 6.0 లక్షల లీటర్లకు చేరుకోవడం కోసం అహర్నిశలు శ్రమించిన డెయిరి అధికారులు, సిబ్బందిని ఛైర్మన్ అభినందించారు. నిన్న సంగండెయిరి పాలసేకరణ సామర్ధ్యం 6.06 లక్షల లీటర్లకు చేరుకుందన్నారు. 2010వ సంవత్సరములో తాను ఛైర్మన్ గా పదవి భాధ్యతలు చేపట్టే నాటికి లక్ష లీటర్లు సేకరించిన పాలను మార్కెటింగ్ చేయడానికే కష్టపడవలసిన పరిస్థితులు ఉండేవని అన్నారు.
విపణిలో పాల సేకరణ, మార్కెటింగ్ లో వస్తున్న మార్పులకు అనుగుణంగా ముందు చూపుతో నూతన విధానాలు అమలు చేశామని ఫలితముగా 2 చిల్లింగ్ సెంటర్ల నుండి నేడు 34 చిల్లింగ్ / మిల్క్ కూలర్లు ఏర్పాటు చేయుట జరిగిందని, అదేవిధముగా గతంలో గుంటూరు జిల్లాకు పరిమితమైన మార్కెటింగ్ ను హైదరాబాద్, విజయవాడ, బెంగుళూరు నగరములతోపాటు, 8 జిల్లాలలో తమ ఉత్పత్తులను మార్కెటింగ్ చేస్తున్నామని ఫలితంగా మనము సేకరించిన పాల కన్నా మార్కెటింగ్ లో మన సంగం పాలకు అధిక డిమాండ్ ఉందన్నారు.
ఉత్పత్తుల నాణ్యతలో రాజీ లేకుండా వస్తున్న టెక్నాలజీని అంది పుచ్చుకొని ముందుకు సాగుట వలన సంగండెయిరిదక్షిణ భారతదేశములోనే పేరెన్నికగన్న డెయిరిగా రూపాంతరం చెందిందని చెప్పారు. నేడు 6 లక్షల లీటర్ల సామర్ధ్యమును పూర్తి చేసినప్పటికీ భవిష్యత్తులో పాల సేకరణ 12 లక్షల లీటర్లకు పెంచాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని అన్నారు. భవిష్యత్తు అవసరాలకు అనుగుణముగా నేడు ప్లాంట్ సామర్యాన్ని 8 లక్షల లీటర్ల పాలను ప్రాసెస్ చేసే సామర్ధ్యానికి పెంచామని, భవిష్యత్తులో 12 లక్షల లీటర్ల సామర్ధ్యానికి పెంచాలనే లక్ష్యంతో అడుగులు వేస్తున్నామని చెప్పారు. సంగండెయిరి ఉత్పత్తులకు మార్కెట్ లో అధిక డిమాండ్ ఉందని, డిమాండ్ కు అనుగుణంగా నాణ్యమైన ఉత్పత్తులను అందించాలనే దిశగా ముందుకు సాగుతున్నామని తెలిపారు.
గతంలో గుంటూరు జిల్లాకే పరిమితమైన సంగండెయిరి నేడు ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, అనంతపురం, కృష్ణా, పశ్చిమ, తూర్పు గోదావరి జిల్లాలలో పాలను సేకరిస్తున్నదని భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 13 జిల్లాలలో పాలను సేకరించాలనే లక్ష్యముగా ముందుకు సాగుతున్నామని తెలిపారు. అదేవిధముగా రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో మార్కెటింగ్ విస్తరించాలని, సమీప రాష్ట్రాలలోని ప్రధాన నగరాలైన చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ మార్కెట్ లో అధికశాతం సంగండెయిరి ఉత్పత్తులు అమ్ముడయ్యేలా చర్యలు చేపట్టాలని, దేశంలోనే ప్రముఖ నగరాలకు మార్కెటింగ్ విస్తరించాలనే లక్ష్యంగా పనిచేయాలని కోరారు.
గత 44 ఏళ్ల డెయిరిలో అనేక మైలురాళ్లను ఆధుగమిస్తూ నేడు దక్షిణ భారతదేశములోనే పేరెన్నికగన్న డెయిరిగా ఎదిగిందని భవిష్యత్తులో దేశములో ప్రముఖ డెయిరిగా పేరు ప్రఖ్యాతలు సాధించే రోజు అతి త్వరలోనే ఉన్నదని అన్నారు. సంగం డెయిరి సుదీర్ఘ ప్రయాణములో డెయిరికి పాలను సరఫరా చేసి డెయిరి పట్ల ఆదరాభిమానాలు చూపిస్తున్న పాడిరైతులు, వినియోగదారులకు చైర్మన్ ఈ సందర్భముగా ధన్యవాదములు తెలియజేశారు. ఈ ప్రయాణంలో కష్టపడి పనిచేస్తున్న అధికారులు, సిబ్బందిని అభినందించారు.భవిష్యత్తులోను డెయిరి పట్ల ఇదేరకమైన ఆదరాభిమానాలతో తమకు చేయూతనందించాలని పాడిరైతులు, వినియోగదారులకు పిలిపునిచ్చారు.
ఉత్పత్తుల నాణ్యత, రైతుల అభివృద్ది స్దంక్షేమం విషయంలో ఎలాంటి రాజీ లేకుండా ముందుకు సాగాలని అధికారులకు సూచించారు. సమావేశానికి ముందుగా డెయిరిలోని స్వర్గీయ ధూళిపాళ్ళ వీరయ్య చౌదరి విగ్రహమునకు ఛైర్మన్ చేతుల మీదుగా పులమాలంకరణ చేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భముగా జరిగిన సమావేశములో మేనేజింగ్ డైరెక్టర్ పి.గోపాలకృష్ణన్, ప్లాంట్ మేనేజర్ యం.బ్రహ్మయ్య, మార్కెటింగ్ మేనేజర్ ఆర్.శ్రీధర్ బాబు, పి అండ్ ఐ జనరల్ మేనేజర్ కె.వెంకటేశ్వర ప్రసాద్ తోపాటు పలువురు సీనియర్ మేనేజర్లు, పి అండ్ ఐ, మార్కెటింగ్, ఇంజనీరింగ్, ఫైనాన్స్, క్వాలిటీ కంట్రోల్, ప్రొడక్షన్ అధికారులు , సిబ్బంది పాల్గొన్నారు.