– పోలీసులా? వైసీపీ కార్యకర్తలా?
– చంద్రబాబుపై దాడి వెనుక జగన్,పెద్దిరెడ్డి కుట్ర
– డీజీపీ ఆఫీసు ఎదుట టీడీపీ నేతల మెరుపు ధర్నా
టీడీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబునాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో వైసీపీ గూండాల అరాచకత్వంపై పోలీసులు చర్యలు తీసుకోకుండా, వైసీపీని ప్రోత్సహిస్తున్న వైనం పోలీసు వ్యవస్థకే సిగ్గుచేటని టీడీపీ నేతలు విరుచుకుపడ్డారు. చంద్రబాబు పర్యటనకు అడుగడుగునాఅడ్డుతగులుతూ, రాళ్లు వేసి, ఫ్లెక్సీలు ధ్వంసం చేస్తున్న వైసీపీ గూండాలను తక్షణం అరెస్టు చేసి, బాబు పర్యటనకు భద్రత ఏర్పాటుచేయాలని టీడీపీ నేతలు డీజీపీని డిమాండ్ చేశారు. ఆ మేరకు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రబాబునాయుడు, మాజీ మంత్రి దేవినేని ఉమ, పీతల సుజాత,రాజు, మాల్యాద్రి తదితర నేతలు మంగళగిరిలోని డీజీపీ ఆఫీసు వద్ద మెరుపు ధర్నా చేశారు.
ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ, పోలీసులు జగన్‌కు జీహుజూర్లుగా మారడం దురదృష్కరమన్నారు. ‘మేం ఆనాడు వైఎస్, ఆయన తనయుడు జగన్ పాదయ్రాతకు ఇదేవిధంగా అడ్డంకులు సృష్టించి, మీ మాదిరిగానే రాళ్ల దాడి చేసి ఉంటే తండ్రీకొడుకులు అధికారంలోకి వచ్చేవారా? అసలు రోడ్డుపై కాళ్లు పెట్టగలిగేవారా? అని నిలదీశారు.
మాజీ మంత్రి దేవినేని ఉమా మాట్లాడుతూ పోలీసు వ్యవస్థ అంటే తమకు గౌరవం ఉందని, అయితే కొందరు పోలీసు అధికారులు వైసీపీ కండువా జేబులో పెట్టుకుని ఆ పార్టీ కార్యకర్తల్లా పనిచేస్తున్నారని ధ్వజమెత్తారు. జడ్ ప్లస్ భద్రత ఉన్న చంద్రబాబుకు వైసీపీ గూండాల నుంచి భద్రత కల్పించలేని పోలీసులు, ఇక సామాన్యులకేం భద్రత కల్పిస్తారని ప్రశ్నించారు. చంద్రబాబుపై దాడి వెనుక జగన్, పెద్దిరెడ్డి ఉన్నారని, వారిపై కేసులు నమోదు చే యాలని డిమాండ్ చేశారు.
‘పోలీసులు ఒక విషయం గుర్తు పెట్టుకోవాలి. అధికారం శాశ్వతం కాదు. జగన్ వచ్చే ఎన్నికల తర్వాత కనిపించడు. వాళ్ల పార్టీ ఎమ్మెల్యేలే రోడ్డెక్కి ధర్నాలు చేస్తున్నారంటే పోలీసులు జనం నాడి ఏమిటో గ్రహించాలి. అలాంటి అరాచకవాది కోసం మీ ఉద్యోగాలు పణంగా పెట్టవద్దు. వైసీపీ అంటే అభిమానం ఉన్న పోలీసులు ఆ పార్టీలో చేరతామంటే ఎవరికీ అభ్యంతరం లేదు. కానీ డ్రెస్సులో ఉండగా మాత్రం అందరినీ సమానంగా చూడాల్సిన బాధ్యత ఉంద’ని వ్యాఖ్యానించారు. కుప్పంలో చంద్రబాబు పర్యటనలో ఎలాంటి అపశృతి జరిగినా దానికి వైసీపీ నేతలు, పోలీసులే బాధ్యత వహించాలని హెచ్చరించారు.