ఎంపి విజయసాయిరెడ్డి
ఆక్వాకల్చర్ సాగు, దిగుబడులు, ఎగుమతుల్లోనే కాకుండా స్థానికంగా వినియోగంలో సైతం ఏపీని మొదటి స్థానంలో నిలబెట్టాలన్న సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ఉందని వైఎస్ఆర్ సిపి జాతీయ ప్రధాన కార్యదర్శి,రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి వెల్లడించారు. పలు ఆంశాలపై ఆయన బుధవారం ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఔత్సాహికులతో కలిసి 100 ఆక్వా హబ్‌లు,14 వేలకుపైగా రిటైల్ ఔట్లెట్లను రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తోందన్నారు. వీటిలో డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించడానికి పేటీఎంతో కలిసి పనిచేస్తోందని వెల్లడించారు.
దేశంలోని వివిధ రంగాలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వినియోగాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని చెప్పారు. పరిశ్రమ, వ్యవసాయం, వైద్యం, విద్యలో ఏఐని ఉపయోగించడం ద్వారా వృద్ధి రేటు మరియు జీడీపీ వేగంగా పెంచుకోవచ్చునని తెలిపారు. భారతదేశంలో ఏఐ మిషన్ త్వరలో వేగం పుంజుకొవడంతో పాటు విజయవంతమవుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు.
కారు డ్రైవింగ్ చేసేటప్పుడు తప్పకుండా సీటుబెల్ట్ ధరించాలని చెప్పారు. కారులో వెళ్లే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా సీటు బెల్ట్ ధరించాలని సూచించారు. దీంతో ప్రమాదం జరిగినప్పుడు ప్రాణాలు కాపాడుకోవచ్చని తెలిపారు. వెనుక సీట్లో కూర్చునే ప్రయాణీకులకు సైతం సీటుబెల్టు తప్పనిసరి చేయాలన్న కేంద్ర నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్టు చెప్పారు.
రోడ్డు ప్రమాదాల కారణంగా ఏటా 1.5 లక్షల మంది మరణిస్తున్నారని , ప్రమాదాలను తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని కేంద్ర రవాణాశాఖ.మంత్రిని ఆయన కొరారు. వీటిని అరికట్టేందుకు అమ్మే ప్రతీకారులోనూ నాలుగు ఎయిర్ బ్యాగ్ లు ఉండేలా చూడాలని కోరారు. అలాగే కార్ల వేగాన్ని 120 కిలోమీటర్లకు పరిమితం చేయాలని కోరతూ కేంద్రమంత్రి గడ్కరీ ట్విట్టర్ ఖాతాకు టాగ్ చేశారు.