– ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మంత్రి మండలి సమావేశం
అమరావతి: రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన గురువారం 28 వ ఇ-క్యాబినెట్ సమావేశం జరిగింది. వివిధ అంశాలపై తీసుకున్న నిర్ణయాలను రాష్ట్ర సచివాలయం నాలుగో భవనం ప్రచార విభాగంలో రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి మీడియాకు వివరించారు.
ఆంధ్రప్రదేశ్ సర్క్యూలర్ ఎకానమీ, వ్యర్థ పదార్థాల పునర్వినియోగ విధానం ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. పెరుగుతున్న పారిశ్రామిక వ్యర్థాల సవాళ్లు, అభివృద్ధి చెందుతున్న స్థిరత్వ అవసరాలు, సర్క్యూలర్ ఎకానమీ నమూనాల నుండి వెలువడుతున్న ఆర్థిక అవకాశాలను మంత్రివర్గం సమగ్రంగా సమీక్షించింది. 2025–2030 కాలానికి ఆంధ్రప్రదేశ్ సర్క్యూలర్ ఎకానమీ, వ్యర్థ పదార్థాల పునర్వినియోగ విధానాన్ని అధికారికంగా ఆమోదించింది. స్వర్ణాంధ్ర 2047 సాకారంలో భాగంగా ఈ విధానం భారతదేశంలో మొట్టమొదటి సమగ్ర సర్క్యూలర్ ఎకానమీ, వ్యర్థ పదార్థాల పునర్వినియోగ విధానంగా (చెత్త నుండి సంపద సృష్టి) నిలిచి, ద్విస్థాయి మౌలిక సదుపాయాల నమూనా, పారిశ్రామిక సైమ్బయోసిస్ ఆవశ్యకత, ప్రత్యేక టాస్క్ ఫోర్స్ అండ్ సర్క్యూలర్ ఎకానమీ ఇంటరాక్టివ్ ఆర్థిక డ్యాష్‌బోర్డ్ వంటి ప్రత్యేకతలను కలిగి ఉంది. ఈ విధానం ద్వారా చెత్త నుండి సంపద సృష్టించే ఎం.ఎస్.ఎం.ఇ.ల స్థాపనకు కూడా పెద్ద ఎత్తున అవకాశాలు కలుగనున్నాయి.
ఏపీ టూరిజం భూమి కేటాయింపు విధానం 2024-29కు అనుబంధ చేరికలు చేసే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఈ అనుబంధంలో భూమి కేటాయింపుకు అర్హత, లాండ్ బ్యాంక్ నోటిఫికేషన్, పర్యాటక ప్రాజెక్టుల కోసం ప్రకటించిన భూములను కేటాయించే విధానం, ప్రకటించిన పరిమితుల ఆధారంగా ప్రతిపాదనలు/డీపీఆర్‌ల మూల్యాంకనం, ప్రాజెక్ట్ అమలు కాలపరిమితులు వంటి ముఖ్య అంశాలు చేర్చారు.
అధికార భాషా కమిషన్ పేరును “మండలి వెంకట కృష్ణరావు అధికార భాషా కమిషన్” గా మార్చే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ అధికారిక భాషా కమిషన్ 1966లోని ఆంధ్రప్రదేశ్ అధికారిక భాషా చట్టం నిబంధనల కింద ప్రభుత్వానికి పరిపాలనలో తెలుగును ప్రోత్సహించడానికి ఏర్పాటు చేశారు. మండలి వెంకట కృష్ణరావు ఈ కమిషన్ స్థాపనలోనే కీలక పాత్ర పోషించారు. దాని లక్ష్యాలను రూపొందించడంలో, దాని ప్రారంభ సంవత్సరాలలో విధాన దిశను అందించడంలో కీలకమైన పాత్ర పోషించారు.
అధికారిక భాషా కమిషన్ స్థాపనలో వారి పాత్ర, తెలుగు భాషకు వారి విశిష్ట సేవలను గుర్తిస్తూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు ఈ నెల నాలుగోతేదీన విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన మండలి వెంకట కృష్ణరావు శతజయంతి వేడుకల సందర్భంగా అధికారిక భాషా కమిషన్‌ను “మండలి వెంకట కృష్ణరావు అధికారిక భాషా కమిషన్” గా పేరు మార్చనున్నట్టు ప్రకటించారు.
ఆంధ్రప్రదేశ్ వ్యవసాయేతర భూమి (వ్యవసాయేతర ప్రయోజనాలకు మార్పు) చట్టం రద్దు చేసే నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ మెట్రోపాలిటన్ రీజియన్, అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలు చట్టం, 2016, ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ చట్టం, 2014, ఆంధ్రప్రదేశ్ టౌన్ ప్లానింగ్ చట్టం, 1920 అండ్ ఆంధ్రప్రదేశ్ మునిసిపాలిటీలు చట్టం, 1965లకు కొన్ని సవరణలు చేసే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
గుంటూరులో తెలుగు దేశం పార్టీ కార్యాలయానికి 2954 చదరపు గజాల మునిసిపల్ భూమిని 33 సంవత్సరాల కాలానికి నిబంధనల ప్రకారం ఎకరానికి రూ.1,000 చొప్పున అద్దె వసూలు చేసే పద్ధతిలో ఇవ్వడానికి, 99 ఏళ్ళ వరకు పొడిగింపు చేసుకునే విధంగా అవకాశం కల్పిస్తూ అద్దెకు ఇచ్చే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
ఏపీసీఆర్డీఏ అథారిటీ చేసిన రిజల్యూషన్ నెం.572/2025 ద్వారా ఆమోదించిన నిర్ణయాన్ని అమల్లోకి తెచ్చేందుకు ఎల్1 బిడ్డర్లకు పనులను అప్పగించేందుకు, అమలు పరచేందుకు చైర్పర్సన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్, ఏడీసీఎల్, విజయవాడకు అధికారం ఇచ్చి ప్యాకేజీల పనుల అవార్డును ఎల్1 బిడ్డర్లకు అప్పగించే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
అమరావతి క్యాపిటల్ సిటీ, ఆంధ్రప్రదేశ్‌లో క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ కింద గ్రామ పంచాయతీలలోని ల్యాండ్ పూలింగ్ సిస్టమ్ లోని జోన్లలో మౌలిక సౌకర్యాల అభివృద్ధికి, ఏడేళ్ళ నిర్వహణ, రక్షణతో ఇంజనీరింగ్, ప్రొక్యూర్మెంట్, కన్స్ట్రక్షన్ ఈపీసీ మోడ్ కింద జోన్ వారీగా టెండర్లను ఆహ్వానించేందుకు అనుమతినిస్తూ “అభివృద్ధి మౌలిక సదుపాయాల కార్యక్రమం” కోసం రూ.904.00 కోట్లకు పరిపాలనా ఆమోదం ఇచ్చే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఈ టెండర్ల ఆహ్వాన ఆమోదం వలన అమరావతి నిర్మాణ పనులు వేగవంతమయ్యేందుకు, మౌలిక వసతుల కల్పన త్వరితగతిన చేపట్టేందుకు వీలు కలుగుతుంది.
సీఆర్డీఏ ప్రాంతంలోని వివిధ సంస్థలకు భూమి కేటాయింపు సమీక్షకు సంబంధించి మంత్రివర్గ బృందం 19వ సమావేశంలో చేసిన సిఫార్సులను ఆమోదించే ప్రతిపాదనకు, అమరావతి భూమి కేటాయింపు నియమాలు, 2017, అమరావతి లాండ్ అలాట్మెంట్ రెగ్యులేషన్స్ 2017 నిబంధనలకు అనుగుణంగా మంత్రివర్గ బృంద సిఫార్సుల ప్రకారం ఏపీసీఆర్డీఏ కమిషనర్ అవసరమైన చర్యలు తీసుకునేలా అనుమతించే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
కన్సార్టియంలో మార్పును ఆమోదించి, మాలక్ష్మీ ఇన్ఫ్రా వెంచర్స్ (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా అకేసియా హోటల్స్ అండ్ రిసార్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్‌ను 100% యాజమాన్య హక్కు కలిగిన పూర్తిస్థాయి అనుబంధ సంస్థగా మార్చేందుకు చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
ఏపీజీఎస్ అండ్ డబ్ల్యూఎస్ చట్టం, 2023లోని హోదాలు/నామకరణాల మార్పునకు, వారి ప్రాథమిక విధులను సవరించేందుకు వార్డు విద్య అండ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ నుండి విద్య అనే విషయాన్ని తొలగించి వార్డు సంక్షేమ అండ్ అభివృద్ధి సెక్రటరీకి అప్పగించే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
ప్రస్తుత మండల్/యూఎల్బీ అండ్ జిల్లా పరిధిలో ఆమోదించిన సంస్థాగత కేడర్‌లో 1785 గ్రామ/వార్డు సెక్రటేరియట్ ఉద్యోగులను తిరిగి కేటాయింపు చేయడం వలన ఖాళీ అవుతున్న సమాన సంఖ్యలోని ఏఎన్ఎంఎస్/ వార్డు ఆరోగ్య సెక్రటేరీల ఖాళీ పదవులను ప్రత్యామన్యాయంగా కొత్తగా (993) పోస్టులను సృష్టించడం ద్వారా జీఎస్డబ్ల్యూ 3 టైర్ నిర్మాణంలో మొత్తం 2778 పోస్టులను డిప్యుటేషన్/అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన భర్తీ చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
ఐఎంఎఫ్ఎల్/బీర్/వైన్ అండ్ ఆర్టీడీ, విదేశీ మద్య బ్రాండ్లకు అంచనా విలువలకు టెండర్ కమిటీ ద్వారా ప్రాథమిక ధరల నిర్ణయానికి ఆమోదం కోరే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 252లోని క్లాజ్ (2) కింద నిర్దేశించిన “మాన్యూవల్ స్కావెంజర్స్, డ్రై లేట్రిన్‌ల శుభ్రం చేసేవారి ఉపాధి, నిర్మాణం (నిషేధం) చట్టం, 1993”ను రద్దు చేసే తీర్మానాన్ని రాష్ట్ర శాసనసభ ముందు ఉంచే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
ఆంధ్రప్రదేశ్ బెగ్గింగ్ నిషేధ చట్టం, 1977 (చట్టం నెం.12 ఆఫ్ 1977) లోని సెక్షన్లు 6 అండ్ 9 సవరించేందుకు వికలాంగులు, కుష్ఠు వ్యాధి బాధితులతో సహా వైకల్యం కలిగిన వ్యక్తుల పట్ల వివక్షాపూరిత పదాలు/వాక్యాలను తొలగించేందుకు డ్రాఫ్ట్ బిల్లు ప్రవేశపెట్టే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
కాకినాడ జిల్లా గండేపల్లి మండలంలోని తల్లూరు గ్రామంలో తోట వెంకటాచలం పుష్కర లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్‌లోని కిలోమీటర్ 45.195 వద్ద తోట మెయిన్ కెనాల్లో ప్రస్తుతం ఉన్న పీఎస్సీ ప్రెషర్ మెయిన్‌ను ఎంఎస్ ప్రెషర్ మెయిన్‌తో మార్చే పనికి టెండర్లను ఆహ్వానించి, రూ.5167.80 లక్షలకు పరిపాలనా ఆమోదం ఇచ్చే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. చిత్తూరు జిల్లాలోని 50 బెడ్డెడ్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌ను 100 బెడ్డెడ్ ఏరియా హాస్పిటల్‌గా ఏఎస్ఆర్ జిల్లాలో అప్‌గ్రేడ్ చేయడానికి అంచనా మొత్తం రూ.33.94 కోట్లు (నాన్-రికరింగ్ ఎక్స్పెండిచర్ : రూ.30.50 కోట్లు అండ్ రికరింగ్ ఎక్స్పెండిచర్: రూ.3.44 కోట్లు), అదనంగా (56) పోస్టుల కల్పనతో అప్‌గ్రేడేషన్ చేసే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
అంతర్జాతీయ టెన్నిస్ ప్లేయర్ శ్రీ సాకేత్ సాయి మైనేనికి స్పోర్ట్స్ కోటా కింద డిప్యూటీ కలెక్టర్ (గ్రూప్-I సర్వీసెస్) గా ఉద్యోగం ఇవ్వడానికి ఏపీ (అపాయింట్మెంట్స్ టు పబ్లిక్ సర్వీసెస్ అండ్ రేషనలైజేషన్ ఆఫ్ స్టాఫ్ ప్యాటర్న్ అండ్ పే స్ట్రక్చర్) చట్టం, 1994 (చట్టం 2 ఆఫ్ 1994) లోని సెక్షన్ 4ను సవరించేందుకు ఏపీ శాసనసభ బిల్లు ప్రవేశపెట్టే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
పాల్నాడు జిల్లా వెల్దుర్తి, గుండ్లపాడు, దివంగత చంద్రయ్య కుమారుడు టి.వీరంజినేయులకు శాఖ, అనుబంధ సూత్రాల ప్రకారం జూనియర్ అసిస్టెంట్‌గా ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వడానికి ఏపీ (అపాయింట్మెంట్స్ టు పబ్లిక్ సర్వీసెస్ అండ్ రేషనలైజేషన్ ఆఫ్ స్టాఫ్ ప్యాటర్న్ అండ్ పే స్ట్రక్చర్) చట్టం, 1994 (చట్టం 2 ఆఫ్ 1994) లోని సెక్షన్ 4ను సవరించేందుకు ఆంధ్రప్రదేశ్ శాసన సభలో బిల్లు ప్రవేశపెట్టే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
మైలవరం మండలంలోని వడ్డిరాల, దొడియం గ్రామాలలోని మొత్తం 1200.05 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆంధ్రప్రదేశ్ సోలార్ పవర్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా అదానీ సోలార్ ఎనర్జీ ఏపీ ఎయిట్ ప్రైవేట్ లిమిటెడ్‌తో 250 ఎండబ్ల్యు సోలార్ పవర్ ప్రాజెక్ట్ ఏర్పాటు చేసేందుకై 33 సంవత్సరాల అద్దె ప్రాతిపదికన భూ కేటాయింపుకు చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
ఆంధ్రప్రదేశ్ వ్యవసాయేతర ప్రయోజనాలకు భూమి మార్పు చట్టం, 2006ను రద్దు చేసే డ్రాఫ్ట్ బిల్లు ఆమోదం కోరే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఏపీ వ్యవసాయేతర ప్రయోజనాలకు భూమి మార్పు చట్టం, 2006 రద్దు నేపథ్యంలో ఏపీ పీఆర్ చట్టం, 1994లోని సబ్ సెక్షన్ (3) లోని సెక్షన్ 60 కింద క్లాజ్ (vi) చేర్చి ఆర్డినెన్స్ తయారు చేసే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. భారత ఉన్నత న్యాయస్థానం క్రిమినల్ రిట్ పిటిషన్ (క్రిమినల్) నెం.511 ఆఫ్ 2024 లో ఇచ్చిన ఉత్తర్వులు, నిబంధనలతో పాటు సిబ్బందితో పాటు శ్రీకాకుళంలో స్పెషల్ కోర్టును ఏర్పాటు జేసి శ్రీ D.కేశవరావు అలియాస్ దున్న కేశవరావుకు వ్యతిరేకంగా నమోదై విచారణ జరుగుచున్న16 కేసుల విచారణను VII అదనపు జిల్లా అండ్ సెషన్స్ కోర్ట్-కమ్-స్పెషల్ కోర్ట్‌గా నియమించే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
సముద్ర, అనుబంధ కార్యకలాపాలకు పెరుగుతున్న డిమాండ్లను తీర్చడానికి, దాని దృఢత్వాన్ని పెంచడానికి, పెట్టుబడిదారుల స్నేహపూర్వకతను మెరుగుపరచడానికి, ఇటీవల నోటిఫై చేయబడిన ఏపీ పారిశ్రామిక అభివృద్ధి విధానం, తదితర రంగాల అభివృద్ధి విధానాలకు అనుగుణంగా ఉండేలా ఆంధ్రప్రదేశ్ సముద్ర విధానాన్ని (2024-29) సవరించడానికి మౌలిక వసతులు, పెట్టుబడులు శాఖ చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
చిత్తూరు జిల్లా కుప్పంలో గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయం అభివృద్ధి కోసం పిపిపి కన్సెషనర్ సేకరణను ప్రారంభించడానికి ఏపీ విమానాశ్రయానికి ఆమోదం కోసం ముసాయిదా ఆర్ఎఫ్పీని ఆమోదించడం, హడ్కో రుణాన్ని ఉపయోగించుకుని భూసేకరణ అండ్ యుటిలిటీల బదిలీ ప్రక్రియను పూర్తి చేయడం, ప్రతిపాదిత విమానాశ్రయం కోసం బాహ్య మౌలిక సదుపాయాల కల్పనకై మౌలిక వసతులు, పెట్టుబడులు శాఖ చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
నెల్లూరు జిల్లా దగదర్తిలో గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయం అభివృద్ధి కోసం పిపిపి కన్సెషనర్ సేకరణను ప్రారంభించడానికి ఏపీ విమానాశ్రయానికి ఆమోదం కోసం ముసాయిదా ఆర్ఎఫ్పీని ఆమోదించడం, హడ్కో రుణాన్ని ఉపయోగించుకుని భూసేకరణ అండ్ యుటిలిటీల బదిలీ ప్రక్రియను పూర్తి చేయడం, ప్రతిపాదిత విమానాశ్రయం కోసం బాహ్య మౌలిక సదుపాయాల కల్పనకై మౌలిక వసతులు, పెట్టుబడులు శాఖ చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
నారావారిపల్లిలోని 30 పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌ను 50 పడకల సిహెచ్సిగా అప్‌గ్రేడ్ చేయడానికి మరియు ఎటువంటి ఆర్థిక చిక్కులు లేకుండా ఇప్పటికే మంజూరు చేయబడిన పోస్టుల స్థానంలో అదనపు పోస్టుల కల్పనకై వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
ఆ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ను సిహెచ్సిగా అప్‌గ్రేడేషన్ చేయడం వలన చుట్టుపక్కల మండలాలకు చెందిన సుమారు 56 వేల మంది ఆరోగ్య సేవలు పొందనున్నారు.
చిత్తూరు జిల్లాలోని కుప్పం మండలం బైరుగానిపల్లె గ్రామంలో ఉన్న సర్వే నెం. 19/1ఎ లోని 7.74 ఎకరాల ప్రభుత్వ భూమిలో సివిల్ సెక్టార్లో కేంద్రీయ విద్యాలయ పాఠశాలను ఉచితంగా ఏర్పాటు చేసేందుకు కేంద్రీయ విద్యాలయ సంఘస్థాన్ న్యూఢిల్లీ వారికి ఉచితంగా ఆ భూమిని అప్పగించేందుకు రెవిన్యూ శాఖ చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
గుంటూరు జిల్లా, ప్రత్తిపాడు మండలం, నడింపాలెం గ్రామంలోని విస్తీర్ణంలో ఉన్న ప్రభుత్వ భూమిలో రూ.5,18,40,000 కేంద్ర నిధులతో సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ యోగా అండ్ నేచురోపతి స్థాపన కోసం, ఆ భూమిని కమిషనర్, ఆయుష్ శాఖ, ఏపీ విజయవాడ వారికి ఉచితంగా బదిలీ చేయడానికి రెవిన్యూ శాఖ చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
అమరావతిలోని ఏపీసీఆర్డీఏ కార్యాలయ భవనంలో నిర్మాణ సంబంధిత పనులు, ఇంటర్నల్ ఫినిషింగ్ వర్క్స్, ఎంఈపీఎఫ్ పనులు, ఐసీటీ పనులు, బాహ్య అభివృద్ధి పనులను నిర్వహించడానికి రూ.160.00 కోట్ల పరిపాలనా అనుమతి ఆమోదానికి, అథారిటీ తీర్మానం ఆధారంగా టెండర్లను ఆహ్వానించి ఖరారు చేయడంలో కమిషనర్, ఏపీసీఆర్డీఏ చర్యను ర్యాటిఫై చేయడానికి పురపాలక, పట్టణాఅభివృద్ధి శాఖ చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంటరెస్ట్ ఆధారంగా అమరావతి క్వాంటం కంప్యూటింగ్ సెంటర్ లో ఐబీఎం క్వాంటం కంప్యూటర్ ఇన్‌స్టాలేషన్‌కు ఐటి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ శాఖ చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
ప్రస్తుత ప్రభుత్వ ఎన్నికల వాగ్దానాలలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 62 సంవత్సరాల వయస్సు నిండిన అంగన్వాడీ వర్కర్లు, అంగన్వాడీ హెల్పర్లకు సర్వీస్ ముగింపు (రిటైర్మెంట్ బెనెఫిట్స్) ప్రయోజనాలకు బదులుగా, అంగన్వాడీ వర్కర్ల (మినీ & మెయిన్) కు రూ.1,00,000/- అండ్ అంగన్వాడీ హెల్పర్లకు రూ.40,000 గ్రాట్యుటీగా చెల్లించడానికి ప్రభుత్వం అత్యవసరంగా జారీ చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.