Suryaa.co.in

Andhra Pradesh National Telangana

షర్మిలకు ఏపీ కాంగ్రెస్ పగ్గాలు?

-డీకే శివకుమార్ తో వైఎస్ షర్మిల భేటీ
-కాంగ్రెస్ తో పొత్తు విషయం చర్చించడానికేనని ప్రచారం
-మర్యాదపూర్వకంగానే కలిశానంటున్న వైఎస్ఆర్ టీపీ చీఫ్
-రాజకీయపరంగా చర్చకు దారితీసిన ఇరువురు నేతల కలయిక
( శివ శంకర్. చలువాది)

కర్ణాటక ఉప ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర చీఫ్ డీకే శివకుమార్ తో వైఎస్ఆర్ టీపీ అధినేత వైఎస్ షర్మిల సోమవారం భేటీ అయ్యారు. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో కీలకంగా వ్యవహరించిన డీకేకు షర్మిల అభినందనలు తెలిపారు. డీకేఎస్ ను మర్యాదపూర్వకంగానే కలిశానని షర్మిల చెబుతున్నారు.

అయితే, ఈ భేటీ తెలంగాణలో రాజకీయ చర్చకు దారితీసింది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీతో వైఎస్ఆర్ టీపీ మధ్య పొత్తు ఉండవచ్చని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో డీకే శివకుమార్ ను షర్మిల కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ క్రమంలో వారి మధ్య రాజకీయపరమైన చర్చ జరిగి ఉండవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

తెలంగాణలో కొంతకాలంగా వైఎస్ఆర్ టీపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య పొత్తుల చర్చలు జరుగుతున్నాయని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రంలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడిగా పోటీ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు వెల్లడించాయి. షర్మిల, డీకేఎస్ భేటీ ఈ ప్రచారానికి మరింత ఊతమిస్తోందని తెలిపాయి.

మరోవైపు, పొత్తు కుదిరితే ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ బాధ్యతలను షర్మిలకు అప్పగిస్తారని కూడా ప్రచారం జరుగుతోంది. ఏపీ ముఖ్యమంత్రి, తన సోదరుడు జగన్ తో విభేదాలను పరిష్కరించుకునేందుకు మధ్యవర్తిత్వం వహించాల్సిందిగా కోరేందుకు డీకే శివకుమార్ ను షర్మిల కలిసి ఉండవచ్చని మరో వాదన వినిపిస్తోంది.

LEAVE A RESPONSE