Suryaa.co.in

Andhra Pradesh Uncategorized

ఏపీ ఫైబర్ నెట్ లో 410 మంది ఉద్యోగుల తొలగింపు

• ఏపీ ఫైబర్ నెట్ లో అక్రమాలపై ఉక్కుపాదం
• వందల సంఖ్యలో అక్రమ నియామకాలు
• అనధికారికంగా కొనసాగుతున్న 410 మంది ఉద్యోగుల తొలగింపు
• గత ప్రభుత్వంలో నేతల సిఫార్సులతో 5 ఏళ్లలో అడ్డగోలు నియామకాలు
– ఏపీ ఫైబర్ నెట్ లిమిటెడ్ చైర్మన్ జీవీ రెడ్డి

విజయవాడ : ఏపీ ఫైబర్ నెట్ లిమిటెడ్ సంస్థలో అవసరం లేకున్నా ఎక్కువ మంది ఉద్యోగులను గత ప్రభుత్వం నియమించిందని అలాంటి వారు 410 మందిని విధుల నుంచి తొలగిస్తున్నామని, ఏపీ ఫైబర్ నెట్ లిమిటెడ్ సంస్థ ఛైర్మన్ జీవీ రెడ్డి తెలిపారు.

ఎన్టీఆర్ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ లో ఉన్న ఫైబర్ నెట్ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో చైర్మన్ జీవీ రెడ్డి మాట్లాడుతూ గత పాలకులు 5 ఏళ్లలో అవసరానికి మించి ఎక్కువ మంది ఉద్యోగులను ఏవిధమైన నియామక ఉత్తర్వులు, లేకుండా కనీసం విచారణ లేకుండానే వాట్సప్ మెసేజ్ పెడితే వారికి ఉద్యోగాలు ఇచ్చారన్నారు.

తీసుకున్నవారు సంస్థ కోసం పనిచేస్తే పర్వాలేదు. కాని వారు శాసనసభ్యుల ఇంట్లో వంట పనులు, పార్లమెంట్ సభ్యుల ఇంట్లో డ్రైవర్ల గా పనిచేస్తూ ఫైబర్ నెట్ నుంచి జీతాలు తీసుకుంటున్నారన్నారు.
పని ఏమో వారికి సిఫార్సుల లేఖలు ఇచ్చిన వారి ఇళ్లల్లో… జీతం ఏమో ఫైబర్ నెట్ కార్యాలయంలో తీసుకుంటున్నారన్నారు. వారికి కనీసం అపాయింట్ మెంట్ లెటర్స్ కూడా లేకుండా డైరెక్ట్ గా పేరోల్స్ లోకి తీసుకున్నారన్నారు.

అందుకే అలా గుర్తించిన 410 మందిని తొలగిస్తున్నా మన్నారు. ఇంకనూ ఉద్యోగుల్లో అనర్హులు ఉంటే వారిని కూడా తొలగిస్తామన్నారు. సంస్థకు 70-75 శాతం మంది అవసరం లేకున్నా ఉద్యోగులను తీసుకున్నారన్నారు. చైర్మన్ బాధ్యతలు స్వీకరించాక ఏ నిర్ణయం తీసుకున్నా ప్రభుత్వ నిబంధనలు ప్రకారం తీసుకుంటున్నామన్నారు. ఉద్యోగుల పట్ల నాకు ఏవిధమై వ్యతిరేకత లేదన్నారు.

అపాయింట్ మెంట్ లెటర్స్ లేని వాళ్లను తక్షణమే తొలగిస్తున్నామన్నారు. అలాంటి వారి వల్ల నేడు సంస్థ నెలకు రూ. 4 కోట్లు చెల్లించాల్సి రావడంతోపాటు దివాలా అంచున ఉందన్నారు. ఎవరు ఎక్కడ పనిచేస్తున్నారో తెలియకుండా ఉందని, అలాంటి వారిని ఉపేక్షించకూడదన్నారు. మేము కక్షతో దురుద్దేశంతో ఉద్యోగులను తొలగించడం లేదన్నారు.

గత ప్రభుత్వం ఎపీఎస్ఎఫ్ఎల్ కు రూ. 1200 కోట్లు అప్పులు చేయడం సహా బకాయిలు రూ. 900 పెట్టిందన్నారు. అక్రమంగా నియమితులైన ఈ ఉద్యోగులను తీయకపోతే, మేము రోడ్డున పడతామన్నారు. తొలగించిన ఉద్యోగులు ఎక్కువ మాట్లాడినా, ఇబ్బందులకు గురిచేసినా ఇంతవరకూ తీసుకువెళ్లిన శాలరీలు రికవరీ పెట్టాల్సి వస్తుంది, కేసులు పెట్టాల్సి వస్తుందన్నారు. ఉద్యోగులను నియమించిన వారికీ లీగల్ నోటీసులు ఇచ్చి వివరణ కోరతామన్నారు. గత ప్రభుత్వంలో అప్పటి ఎండీ లెక్కలేని తనంగా వ్యవహరించారన్నారు.

ఇలా ఉద్యోగుల నియామకానికి అనుమతులు ఇచ్చిన వారికి లీగల్ నోటీసులు పంపిస్తామని, అవసరమైతే రికవరీ చేస్తామన్నారు. గత ప్రభుత్వంలో సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ఇష్టమొచ్చినట్లు రిక్రూట్ చేశారు… దాన్ని సరిచేయాల్సిన బాధ్యత మా పై ఉందన్నారు. లేకపోతే మేము తప్పు చేసిన వారమవుతామన్నారు. లాభాల్లో ఉన్న సంస్థ నష్టాల్లోకి వెళ్లింది.. రూ. 2,160 కోట్ల అప్పులకు వెళ్లతారా అని ప్రశ్నాంచారు? ప్రభుత్వ రంగ సంస్థను ఒక పద్దతి ప్రకారంగా నడపాలి అని అన్నారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాలంలో 108 మంది ఉద్యోగుల కి నెలకు రూ. 40 లక్షలు చెల్లించగా గత ప్రభుత్వం లో 1,360 మంది ఉద్యోగులకు నెలకు రూ. 4 కోట్లు చెల్లించారన్నారు. గతంలో జీతాలపై చేస్తున్న ఖర్చు 10 రెట్లు పెరిగిందన్నారు. ఈ 5 ఏళ్లలో ఫైబర్ నెట్ సేవలను పూర్తిగా నిర్వీర్యం చేసేశారన్నారు.

పెరగాల్సిన కనెక్షన్లు 10 లక్షల నుంచి సగానికి 5 లక్షలకు తగ్గి దివాళా అంచుకి సంస్థ ను తెచ్చారన్నారు. సంస్థలో జరిగిన అక్రమాలపై ఉక్కు పాదం మోపి, పూర్తిగా ప్రక్షాళన చేస్తామన్నారు. ప్రభుత్వ కార్పొరేట్ ఆఫీసును ఒక పద్దతి అనేది లేకుండా గత ప్రభుత్వం సంస్థను నడిపిందని చైర్మన్ జి.వి.రెడ్డి అన్నారు.

LEAVE A RESPONSE