Suryaa.co.in

Andhra Pradesh

ఆహార భద్రతా చట్టం అమల్లో ఏపీ భేష్

రాజ్యసభలో విజయసాయి రెడ్డి ప్రశ్నకు మంత్రి జవాబు

న్యూఢిల్లీ, జూలై 29: జాతీయ ఆహార భద్రతా చట్టం అమలులో అత్యుత్తమ పనితీరు ప్రదర్శించిన రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్ తృతీయ స్థానంలో నిలిచిందని పౌర సరఫరాల శాఖ సహాయ మంత్రి సాధ్వీ నిరంజన్ జ్యోతి వెల్లడించారు. రాజ్యసభలో శుక్రవారం వైఎస్సార్సీపీ సభ్యులు వి.విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా బదులిస్తూ ఆహార భద్రతా చట్టం అమలులో ఉత్తమ పనితీరుతో ఒడిషా, ఉత్తర ప్రదేశ్ ప్రధమ, ద్వితీయ స్థానాలు ఆక్రమించగా ఆంధ్రప్రదేశ్ తృతీయ స్థానంలో నిలిచిందని తెలిపారు. దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో జాతీయ ఆహార భద్రతా చట్టం అమలు, పౌర సరఫరాల వ్యవస్థ పని తీరు ఆధారంగా ఆయా రాష్ట్రాలకు ర్యాంకులు ప్రకటించడం జరిగినట్లు ఆమె చెప్పారు.

దేశంలోని వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఆహార భద్రతా చట్టం అమలు, టార్గెటెడ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ (టీపీడీఎస్) కార్యకలాపాల ఆధారంగా ఆయా రాష్ట్రాల ర్యాంకులను నిర్ధారించడం జరుగుతుందని మంత్రి తెలిపారు. ర్యాంకుల నిర్ధారణ కోసం ప్రధానంగా మూడు అంశాలను ప్రామాణికంగా తీసుకుంటారు. తొలి అంశం కింద ఆహార భద్రతా చట్టం కింద అసలైన లబ్దిదారుల గుర్తింపు, వారికి ఆహారం పంపిణీ జరిగే తీరు. రెండో అంశం కింద ఆహార ధాన్యాల రవాణా, వాటిని పంపిణీ కోసం రేషన్‌ దుకాణాల కోసం చేర వేసే పటిష్టమైన వ్యవస్థ, మూడోది పోషకాహారం పంపిణీ కోసం పౌరసరఫరాల శాఖ చేపట్టే కార్యక్రమాలు. ఈ మూడు అంశాల ఆధారంగానే రాష్ట్రాలకు ర్యాంకులను ప్రకటించడం జరుగుతుందని మంత్రి చెప్పారు. అత్యుత్తమ ర్యాంకుల సాధించిన రాష్ట్రాలకు ప్రోత్సాహకాలు అందించే ప్రతిపాదన ఏదీ ప్రభుత్వ పరిశీలనలో లేదని ఆమె తెలిపారు.

ఏపీలో పామ్‌ ఆయిల్ సాగు అభివృద్ధికి 104 కోట్లు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సహకారంతో 104 కోట్లతో పామ్‌ ఆయిల్ సాగును అభివృద్ధి చేయనున్నట్లు కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ తెలిపారు. రాజ్యసభలో విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు ఆయన రాతపూర్వకంగా జవాబిస్తూ 2022-23 సంవత్సర వార్షిక ప్రణాళిక ప్రకారం రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో 20 వేల హెక్టార్లు పామ్‌ ఆయిల్ సాగుకు అనువైనదిగా గుర్తించి ఆమోదం తెలిపినట్లు చెప్పారు. తూర్పుగోదావరి, గుంటూరు, కృష్ణా, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో 5 లక్షల 31 వేల హెక్టార్లు పామ్‌ ఆయిల్‌ సాగుకు అనువుగా ఉన్నట్లు తెలిపారు. దేశంలో పామ్‌ ఆయిల్‌ సాగు అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం 62 కోట్ల రూపాయలు కేటాయించగా అందులో రాష్ట్ర ప్రభుత్వం 41 లక్షలు తన వాటాగా భరించాల్సి ఉందని అన్నారు. పామ్‌ ఆయిల్ సాగును పెద్ద ఎత్తున విస్తరించి క్రూడ్ పాం ఆయిల్ ఉత్పత్తిని పెంచడం ద్వారా వంట నూనెల దిగుమతులను తగ్గించడమే ఈ మిషన్ లక్ష్యం అని మంత్రి చెప్పారు. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ పామ్‌ రీసెర్చ్ గణాంకాల ప్రకారం దేశంలో 28 లక్షల హెక్టార్లలో పామ్‌ ఆయిల్ సాగును అభివృద్ధి చేయనున్నట్లు మంత్రి తెలిపారు. రానున్న 5 ఏళ్ళలో దేశంలో అదనంగా 6.5 లక్షల హెక్టార్లలో పామ్‌ ఆయిల్ సాగును అభివృద్ధి చేయనున్నట్లు మంత్రి తెలిపారు.

LEAVE A RESPONSE