– జగన్‌కు ఏం చూపించాలో అది చూపించే పార్టీ మాదే
– ట్రేడింగ్ పార్టీలకు ఏజెంట్లు కమ్యూనిస్టు పార్టీలు
– బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు
విజయవాడ: టీడీపీ, వైసీపీ ప్రభుత్వాలు ఏపీని అభివృద్ధికి దూరం చేశారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మండిపడ్డారు. మంగళ వారం విజయవాడలో ఏర్పాటు చేసిన ప్రజాగ్రహ సభలో సోము వీర్రాజు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తీరుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కేంద్రం ఇచ్చిన నిధులతోనే రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుందని, కేంద్ర పథకాలకు వైసీపీ స్టిక్కర్లు అంటిస్తున్నారని విమర్శించారు.
‘‘జగన్‌కు ఏం చూపించాలో అది చూపించే పార్టీ మాదే. మనం ఎందుకు భయపడాలి? మనం ఎప్పుడైనా జైలుకు వెళ్లామా.. భవిష్యత్తులో వెళ్తామా? పలు చోట్ల ఆస్తులు పోగేసుకునేందుకే ఈ నేతల తాపత్రయం. రాజకీయాల్లో నిరాడంబరత్వం చూపించిన పార్టీ మాదే. ఏపీలోని అనేక హైవేలను కేంద్రం అభివృద్ధి చేస్తోంది. బీజేపీ అధికారంలోకి వస్తేనే ఏపీ సర్వతోముఖాభివృద్ధి సాధ్యం. రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా
ఈ సభ పెట్టాం. వచ్చే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావాలి. ప్రత్యేక హోదా ఎందుకు వద్దన్నారని ముందు చంద్రబాబును అడగాలి. ప్రత్యేక హోదా నీతి ఆయోగ్ పరిధిలో ఉంది. రాష్ట్రంలో అన్నీ అమ్మేస్తున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ఇప్పటికీ కాపాడుతున్న పార్టీ మాదే. స్టీల్ ప్లాంట్ నష్టం రూ.3వేల కోట్లను ఇప్పటికీ భర్తీ చేస్తున్నాం. యూనియన్ల పేరుతో పాఠశాలలను సర్వనాశనం చేసింది కమ్యూనిస్టులే. పేదపిల్లల ఆహార నిధులనూ దోచుకున్నారు. ట్రేడింగ్ పార్టీలకు ఏజెంట్లు కమ్యూనిస్టు పార్టీలు’’ అని సోము వీర్రాజు విమర్శించారు.
ఎంపీ జీవీఎల్ నరసింహారావు మాట్లాడుతూ ‘‘వైసీపీ అంటే ఏమీ చేతకాని ప్రభుత్వం. రాష్ట్రంలో టీడీపీ కి భవిష్యత్తు లేదు. బీజేపీ అంటే భవిష్యత్తులో జయించే పార్టీ. మోదీ పట్ల ప్రజల్లో భక్తి భావం ఉంది. కేంద్రం రాష్ట్రానికి ఇస్తున్న నిదులు ఏమవుతున్నాయి? రాష్ట్రం ఎందుకు ఆర్థిక సంక్షోభంలో ఉంది. అవినీతిమయం కాని రంగం రాష్ట్రంలో ఏదీ లేదు. రాష్ట్ర ప్రజలకు బీజేపీయే ప్రత్యామ్నాయం’’ అని పేర్కొన్నారు.
మాజీ మంత్రి రావెల కిశోర్‌బాబు మాట్లాడుతూ ‘‘ కోటి మంది దళితులు వైసీపీ కి గంపగుత్తుగా ఓటు వేశారు. కానీ దళితులపై వైసీపీ ప్రభుత్వం దౌర్జన్యాలకు పాల్పడుతోంది. ఎస్సీ నియోజకవర్గం తాడికొండలో అమరావతి రాజధానికి ప్రధాని శంకుస్థాపన చేశారు. దళితులు బాగుపడటం ఇష్టంలేకే వైసీపీ రాజధాని మార్చాడానికి నిర్ణయం తీసుకుంది’’ అని ఆరోపించారు.