బెయిల్‌పై ఉన్న నేతలు త్వరలోనే జైలుకు:ప్రకాశ్‌ జావడేకర్‌

విజయవాడ: వైసీపీ, టీడీపీ, తెరాసా మూడూ కుటుంబ పార్టీలే..ఈ 3 ప్రాంతీయ పార్టీలు అవినీతికి పాల్పడుతున్నాయని కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్‌ నేత ప్రకాశ్‌ జావడేకర్‌ ఆరోపించారు. విజయవాడలో బీజేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రజా ఆగ్రహ సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఏపీలో టీడీపీ, వైసీపీ రెండూ ప్రజలను మోసం చేశాయని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్‌లో చాలామంది నేతలు బెయిల్‌పై బయట ఉన్నారని, వారంతా త్వరలోనే జైలుకు వెళ్తారని పేర్కొన్నారు.

‘‘ఏపీలో విధ్వంసకర పాలన సాగుతోంది. మద్య నిషేధం అని చెప్పి మద్యంపై వచ్చిన డబ్బుతోనే పాలన సాగిస్తున్నారు. ఇచ్చిన హామీలు ఏవీ జగన్‌ నెరవేర్చలేదు.కేంద్ర పథకాలకు రాష్ట్ర స్టిక్కర్లు అంటిస్తున్నారు. ఇక్కడ కట్టించేది జగనన్న కాలనీలు కాదు.. మోదీ కాలనీలు.నా హయాంలోనే పోలవరానికి అనుమతులు వచ్చాయి. అనుమతులు ఇచ్చి ఏడేళ్లయినా పోలవరం పూర్తి చేయలేదు. అమరావతి కోసం అటవీ భూములను బదిలీ చేశాం. రాజధాని విషయంలో తెదేపా, వైకాపా ఘర్షణ పడుతున్నాయి.

సభకు వస్తున్నప్పుడు దారిలో ‘పుష్ప’ సినిమా పోస్టర్‌ చూశా. ఎర్రచందనం స్మగ్లింగ్‌పై వేసిన సిట్‌ను ఏపీలో రద్దు చేశారు. ఈ రాష్ట్రానికి మేలు చేసే నాయకత్వం తప్పక అవసరం. ఏపీలో వచ్చే ఎన్నికల్లో అధికారం మాదే’’ అని ప్రకాశ్‌జావడేకర్‌ తెలిపారు.

Leave a Reply