విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో మంత్రి ఆదిమూలపు సురేష్ శుక్రవారం విడుదలచేసిన ఏపీ ఐసెట్ ఫలితాల్లో శ్రీకాకుళం జిల్లాకు చెందిన మాలపల్లి రామకృష్ణ మొదటి ర్యాంకు సాధించాడు. 154 మార్కులతో టాప్‌లో నిలిచాడు. తరువాత అనంతపురం జిల్లా వ్యక్తి బండి లోకేష్ 153 మార్కులతో రెండో ర్యాంకు సాధించాడు. తేనేల వెంకటేష్(విజయనగరం)- మూడో ర్యాంకు, అల్లి లిఖిత్(చిత్తూరు)-నాలుగో ర్యాంకు, షైక్ సమీయుల్లా(చిత్తూరు)-ఐదో ర్యాంకు సాధించారు. ఆరో ర్యాంకు- చెన్నం సాయి మణికంఠ కుమార్, గుంటూరు, ఏడో ర్యాంకు- ఎంజేటి వైష్ణవి, చిత్తూరు, ఎనిమిదో ర్యాంకు- సందు సోమశేఖర్, ప్రకాశం, తొమ్మిదో ర్యాంకు- బేతి సాయి ఫణి సురేంద్ర, విశాఖపట్టణం, పదో ర్యాంకు- కరణం చందన, చిత్తూరు.కాగా ఆంధ్రప్రదేశ్‌లో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన ఐసెట్-2021 ఫలితాలు విడుదలయిన విషయం తెలిసిందే. శుక్రవారం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఫలితాలను విడుదల చేశారు.
మంగళగిరిలోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ప్రకటించారు. ఐసెట్ ఫలితాల్లో 38వేల మంది హాజరవగా 34,789 మంది అంటే 91.27 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. విద్యార్థులు ఫలితాల కోసం https://sche.ap.gov.in వెబ్‌సైట్లో ఫలితాలు చూసుకోవచ్చని మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. సెప్టెంబర్ 17, 18 తేదీల్లో విశాఖ ఆంధ్రా యూనివర్సిటీ ఐసెట్ పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. పరీక్ష నిర్వహించిన రెండు వారాల్లోపే రికార్డు స్థాయిలో ఫలితాలను ప్రకటించినట్లు మంత్రి తెలిపారు.