Suryaa.co.in

Political News

ఈ గమనం తిరోగమనమా!

చిరునామా లేని దశలో
పంగనామాలు..
రాజధాని విషయంలోనే స్థిరత్వం లేని రాష్ట్రానికి
కొత్త జిల్లాలు..
పాలనే సక్రమంగా జరగని
చోట పరిపాలనా సౌలభ్యం..
అవసరమా ఇవన్నీ..

ఉత్తరప్రదేశ్..
అతి పెద్ద రాష్ట్రం..80 లోక్ సభ స్థానాలు…403 అసెంబ్లీ
నియోజకవర్గాలు..
90 జిల్లాలు..ఇక్కడే లేవు మూడు రాజధానులు..

మహారాష్ట్ర
288 అసెంబ్లీ స్థానాలు..
35 జిల్లాలు..
దేశ ఆర్థిక రాజధాని ముంబై కేంద్రంగా గల కీలక రాష్ట్రం..

తమిళనాడు
ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొత్తం అంతర్భాగంగా కలిగి ఉన్న
సువిశాల భూమి..
ఇప్పుడు ఆంధ్రదేశ వేరు పడిన తర్వాత కూడా
234 అసెంబ్లీ..39 పార్లమెంట్..35 జిల్లాలతో
పాలన సాగిస్తున్న
దక్షిణాది రాష్ట్రం..
ఇలా రాసుకుంటూ పోతే నిన్న గాక మొన్న 2014 లో మన నుంచి విడివడి..
దేశంలోనే అత్యంత ప్రధాన నగరాల్లో ఒకటైన హైదరాబాదును రాజధానిగా చేసుకుని ఏలుబడి సాగిస్తున్న తెలంగాణతో..అలా తెలంగాణ విడిపోగా పేరు మారకపోయినా ఆంధ్రప్రదేశ్ గా కొనసాగుతున్న
నవ్యాంధ్రప్రదేశ్ తో కలిపి సువిశాల భారతావనిలో 28 రాష్ట్రాలు ఉండగా ఇప్పటి వరకు అంతే సంఖ్యలో 28 మాత్రమే రాజధాని నగరాలు ఉన్నాయి..ఇప్పుడు రాజధానుల సంఖ్యను 30కి పెంచాలనే ఆలోచన
ఓ మహానుభావుడికి
ఏ ముహూర్తాన
వచ్చిందో గాని
ఈ ఆలోచనతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తుపై ప్రతికూల మేఘాలు ఆవరించడమే గాక
దేశంలోని మరికొన్ని రాష్ట్రాలలో కూడా బహుళ రాజధానుల ఆలోచన రేకెత్తే ప్రమాదం లేకపోలేదు..
ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ మూడు సంవత్సరాలుగా రాజధాని విషయంలో అత్యంత ఆందోళనకర పరిస్థితులు ఎదుర్కొంటూ ఇటు అమరావతిలో అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందాన స్తంభించిపోగా అటు విశాఖ ఆశనిరాశల డోలాయమానంలో ఊగిసలాడుతోంది…అక్కడ అభివృద్ధి యథాలాపంగా సాగుతోంది కాని రాజధాని ప్రత్యేక హంగులు ఏవీ కనబడడం లేదు..తేడా ఏంటంటే ఇక్కడా..అక్కడా భూముల రేట్లలో
హెచ్చుతగ్గులే..ఇప్పటికే రాష్ట్ర ప్రజలు రాజధాని విషయంలో
అయోమయస్థితిలో కొట్టుమిట్టాడుతుండగా పరిస్థితిని మరింతగా
గందరగోళం చేస్తూ కొన్ని రోజుల క్రితం రాష్ట్ర ప్రభుత్వం
మూడు రాజధానుల ప్రతిపాదన ఉపసంహరించుకుంటూ రాజధాని అమరావతి
నగరమేనని ఓ ప్రకటన జారీ చేసింది.పోనీలే ఏదో ఒకటి..పక్కాగా ఉంటుందని అనుకునేలోగానే విశాఖ నగరమే సరికొత్త రాజధాని అంటూ మళ్ళీ అయోమయంలోకి నెట్టేసే ప్రక్రియ మొదలైంది..

కొత్త జిల్లాలు..
ఎత్తు”పల్లాలు
ఇదిలా ఉంటే సందట్లో సడేమియాలా కొత్త జిల్లాల ప్రస్తావన..ఇది రాష్ట్రంలో సరికొత్త గందరగోళానికి దారి తీసింది..ఇన్ని జిల్లాలు అవసరమా అనే ప్రశ్నతో పాటు ఫలానా నగరాన్ని ఫలానా జిల్లాలోనే కొనసాగించాలని..ఆ జిల్లాకు ఈ పేరు పెట్టాలనే డిమాండ్లు పెరుగుతూ కొత్త కొత్త ఆందోళనలకు తెర లేస్తోంది..
దీని వల్ల ఇప్పటికే రాష్ట్రంలో ప్రశాంత వాతావరణానికి విఘాతం ఏర్పడుతోంది.
ఇవన్నీ ఎటు పోయి ఎక్కడికి దారి తీస్తాయో తెలియని సంకట స్థితి..
నిజానికి రాష్ట్రం ప్రస్తుతం మునుపెన్నడూ లేనంత తీవ్ర ఆర్థిక సంక్షోభ పరిస్థితులు ఎదుర్కొంటోంది…అభివృద్ధి పథకాల అమలు అంతంత మాత్రంగానే ఉండగా కనీసం ఉద్యోగుల జీతాలు ఇవ్వడానికి కూడా ప్రతి నెలా చెమటలు పడుతున్న దుర్భర పరిస్థితి..ఈ దశలో కొత్త జిల్లాలు..వాటికి సిబ్బంది నియామకం.. భవనాల కల్పన…విభజన వివాదాలు..ఇతరత్రా ఎన్నో అంశాలు..
నిజానికి ఇది ప్రభుత్వం ఆదాయ వనరులు పెంచుకునేందుకు మార్గాలు అన్వేషించాల్సిన తరుణం.
ప్రాజెక్టులు పూర్తి చేయాల్సి ఉంది..వేసవి ముంగిట విద్యుత్ కొరత ముప్పు పొంచి ఉంది..ఉద్యోగుల
పీఆర్సీ వివాదం చల్లబడినట్టు కనిపిస్తున్నా
పూర్తిగా పరిష్కారం అయినట్టో కాదో..కొంత సందేహమే.. మరోవైపు మంత్రివర్గ విస్తరణ వ్యవహారం..ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన ప్పుడు జగన్ రెండున్నర సంవత్సరాల తర్వాత మొత్తం మంత్రులను మార్చి కొత్తవారికి అవకాశం కల్పిస్తామని ప్రకటించారు..
రెండున్నర సంవత్సరాల కాలం గడిచిపోయినా
ఆ విషయంలో కదలిక లేదు.ఇదిగో..అదిగో అనే వార్తలతో పాటు జగన్ మడమ తిప్పేస్తున్నారనే విమర్శలూ వినిపిస్తున్నాయి.
మద్యనిషేధం విషయంలో కూడా జగన్ మాట నిలుపుకోలేకపోయిన పరిస్థితి విమర్శలకు తావిచ్చింది..వీటన్నిటి కంటే ప్రభుత్వం అందజేస్తున్న ఉచితాల కొనసాగింపు..
అందుకు అవసరమైన నిధులు మరింత పెద్ద తలనొప్పి వ్యవహారం..!?

కష్టాలు కొనితెచ్చుకోవడమే
చుట్టూ ఇన్ని సమస్యలు కొలువై ఉండగా ఇప్పుడు కొత్త జిల్లాలంటూ కొంగొత్త
ప్రతిపాదనలు తెస్తున్న ప్రభుత్వ వైఖరి రాష్ట్రాన్ని మరింతగా ఆర్ధిక సంక్షోభంలో కి నెట్టేసే ప్రమాదం ఉండవచ్చు..ఈ పరిణామాల నడుమ నవ్యాంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఎలా ఉండబోతుందో మరి…
జగన్మోహనమా.. జగన్నాటకమా..
జగదానందకారకమా..
జగడాలా..
జలగండాలా..
సుడిగుండాలా..
అగ్నిగుండాలా..
దినదినగండాలా..!!??

– సురేష్ కుమార్.ఇ

LEAVE A RESPONSE