– కేంద్రం తీసుకొచ్చిన జీఎస్టీ సంస్కరణలను కూటమి ప్రభుత్వం స్వాగతిస్తోంది
– కొత్త స్లాబులతో వ్యవసాయ, వ్యాపార, రియల్ ఎస్టేట్ రంగాలకు భారీ ఊరట
– పౌల్ట్రీ, పాడి పరిశ్రమల అభివృద్ధికి మరింత ఉపయోగకరం
– ప్రజల కొనుగోలు శక్తి పెరిగేలా నూతన జీఎస్టీ స్లాబులు తీసుకొచ్చిన కేంద్రం
– ఏపీ బయోడైవర్సిటీ బోర్డు ఛైర్మన్ నీలాయపాలెం విజయ్ కుమార్
మంగళగిరి: పన్ను విధానంలో గత 50 ఏళ్ల చరిత్రలో పన్నులు తగ్గిస్తున్నామని ప్రకటించిన ప్రభుత్వం ఎన్డీయే ప్రభుత్వమేనని ఏపీ బయోడైవర్సిటీ బోర్డు ఛైర్మన్ నీలాయపాలెం విజయ్ కుమార్ అన్నారు. శనివారం మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… పన్నులను 5 %, 10% చొప్పున పన్నులు తగ్గించడం స్వాగతించదగ్గ విషయం. జీఎస్టీలోని నాలుగు స్లాబులను రెండింటికి కుదించారు. ఈ విధానంతో పన్నులు తగ్గుతాయి. తద్వారా ఆంధ్రప్రదేశ్ కు అదనపు ఆదాయం వస్తుంది. కూటమి ప్రభుత్వం కొత్త జీఎస్టీ స్లాబులను స్వాగతిస్తుందన్నారు. ఇంకా, ఆయన ఏమన్నారంటే…
సంపూర్ణంగా కొత్త జీఎస్టీ విధానాన్ని తెలుగు దేశం ఆహ్వానిస్తుంది. అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ భారత్ పై టారిఫ్ ల పేరుతో అధిక భారం విధించినా మనకు ఎక్కడా ఆర్థిక భారం పడకుండా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. జీఎస్టీ స్లాబులతో దేశ ప్రజలకు ముందుగానే దీపావళి పండుగ వచ్చింది. నిత్యావసర వస్తువుల ధరలు తగ్గడంతో పేద, మధ్యతరగతి ప్రజలకు వస్తువులు చౌకగా లభిస్తాయి. రైతులకు పంట ఉత్పత్తుల ధరలు తగ్గుతాయి. నిత్యవసర వస్తువుల ధరలు గత వైసీపీ హాయంలో మాదిరిగా కాకుండా చాలా తక్కువ ధరకే లభిస్తాయి. దీని ద్వారా వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. ఇక్కడే పెట్టుబడులు పెట్టేందుకు ఉపయోగపడుతుంది. హెల్త్ ఇన్సురెన్స్ పై పన్ను తొలగించారు. ఇది చాలా ఉపయోగకరమైన విధానం. గృహ నిర్మాణ ఖర్చులు తగ్గుతాయి.
నిర్మాణ రంగంలో 5% ఖర్చు తగ్గుతుంది. సిమెంట్, గ్రానేట్, ఇతర వస్తువుల ఖర్చు తగ్గడంతో ఇళ్ల నిర్మాణాలు పెరుగుతాయి. తద్వారా రాష్ట్రానికి చాలా ఆదాయం వస్తుంది. ఏపీలో కోళ్ల పరిశ్రమ ప్రథమ స్థానంలో ఉంది. కోళ్లకు ఇచ్చే దాణపై ఉన్న 5% తగ్గింపు వర్తిస్తుంది. పాడి పరిశ్రమకు సంబంధించిన పాల ఉత్పత్తులపై 0% పన్ను ఉంటుంది. ఈ రెండు రంగాల్లో ఏపీకి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది.
రాష్ట్రంలో టెంపుల్ టూరిజం చాలా ఎక్కువ. తిరుమల, అన్నవరం, ద్వారకతిరుమల, విజయవాడ వంటి పుణ్యక్షేత్రాల్లో ఉండే హోటళ్లకు ఈ జీఎస్టీ స్లాబుల ద్వారా 7 శాతం రాయితీ వస్తుంది. గతంలో 12 ఉంటే ఇప్పుడు కేవలం 5 శాతంకి తగ్గించారు. తక్కువ ఖర్చు కావడంతో ఎక్కువ మంది పర్యాటకులు మన రాష్ట్రంలో పర్యటనలు చేస్తారు. ప్రభుత్వానికి ఎక్కువ ఆదాయం వచ్చే ఆస్కారం ఉంటుంది. రాష్ట్రంలో టూరిజం అభివృద్ధికి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ చాలా వృద్ధి చెందుతుంది. రిజస్ట్రేషన్లు పెరుగుతాయి. ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. అభివృద్ధి చెందుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈ జీఎస్టీ స్లాబులతో చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. రోజువారిగా ఉపయోగించుకునే పన్నీరు, ఇతర వస్తువులపై 5% తగ్గించారు.
వ్యవసాయ యంత్రాలు, డ్రిప్ ఇరిగేషన్ 5% పన్ను వర్తిస్తుంది. దీని వల్ల ఖర్చులు తగ్గి రైతులకు ఉత్పత్తి సామర్థం పెరుగుతుంది. ఎంఎస్ఎంఈ, సూక్ష్మ పరిశ్రమల రంగానికి ఈ పన్నుల విధానం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. టీవీ, ఫ్రిజ్, ఇతర ఎలక్ట్రానిక్స్ వస్తువులకు సంబంధించి 28 నుంచి 18కి తగ్గించారు. దీని ద్వారా 10 శాతం జీఎస్టీ తగ్గుతుంది. అమెరికన్, యూరప్ దేశస్తులే కాకుండా భారతీయులు ఆనందంగా ఉండాలని సంకల్పించి కేంద్ర ప్రభుత్వం ఈ జీఎస్టీ విధానాలతో మార్పులు తీసుకొచ్చింది. కార్లు, బైకులు వంటి ఆటోమొబైల్స్ రంగానికి సంబంధించి 10 శాతం పన్ను తగ్గించారు. చిన్నకారులు రూ.లక్ష వరకు తగ్గే అవకాశం ఉంది. ఈ పన్నుల తగ్గింపుతో మంచి వ్యాపార వ్యవస్థ ఏర్పాటు అవుతుంది.
జీఎస్టీలో ఇప్పటికే జూలై, ఆగస్టులో ఏపీ అధిక ఆదాయం సాధించాం. కచ్చితమైన టార్గెట్ పెట్టి పర్యవేక్షించడంతో ట్యాక్స్ రూపంలో ఆదాయం వచ్చింది. కొత్త జీఎస్టీ సంస్కరణలతో ఏపీకి మంచి ఆర్థిక ప్రయోజనం లభించనుంది. ప్రజల రోజూవారి, నెలవారి ఖర్చు తగ్గుతుంది. ఆర్థిక వినిమయం ఎక్కువవుతుంది. ప్రభుత్వానికి పన్నుల రూపేన ఆదాయం వస్తుంది. ఆ ఆదాయంతో గత ప్రభుత్వంలో మాదిరి దోపిడీ చేయకుండా సంక్షేమ పథకాలకు ఉపయోగించుకునే ఆస్కారం ఏర్పడుతుంది. పెన్షన్ రూ.2 వేల నుంచి రూ.4 వేలు చేశాం. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకు తల్లికి వందనం అందజేస్తున్నాం.
ఉచిత బస్సు, ఇతర సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాం. సంపద సృష్టిస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. నేడు ఆచరణలో పెట్టి చూపించారు. జీఎస్టీ సంస్కరణలను తెలుగు దేశం పార్టీ, కూటమి ప్రభుత్వం సంపూర్ణంగా ఆహ్వానిస్తున్నాయి. ఈ విధానం దేశానికి, రాష్ట్రానికి ఎంతో ఉపయోగపడుతుంది. ప్రజల జీవన ప్రమాణాలు పెరిగేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ ఆర్థిక సంస్కరణలు తీసుకురావడం చాలా ఉపయోగకరం. పీవీ నరసింహారావు ఆర్థిక సంస్కరణలు తీసుకురావడంతో ఈ రోజు ఆర్థికంగా పురోగతిలో ఉన్నాం. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ద్వారా చంద్రబాబు దూరదృష్టితో ఆలోచించి సంస్కరణలు తీసుకొచ్చారు. సంస్కరణలకు ఆద్యుడు చంద్రబాబు. ఈ దేశ సంపద మరింత పెరిగేందుకు ప్రజలు ఇంకా సంపూర్ణ ఆనందంతో జీవనం సాగించేలా ఈ కొత్త జీఎస్టీ సంస్కరణలు దోహదపడతాయి.