Suryaa.co.in

Andhra Pradesh

పాలనను ప్రజల ముంగిటకు తెచ్చిన ఏపీ వలంటీర్ల వ్యవస్థ

– ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా మారిన ఆంధ్రా కొత్త వ్యవస్థలు
– రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి

ఆంధ్రప్రదేశ్‌ లో ప్రభుత్వం నుంచి సహాయం, సంక్షేమ పథకాల ప్రయోజనాలు, సేవలను ప్రజలకు అందిస్తున్న గ్రామ, వార్డు వలంటీర్ల గురించి జనం ఇప్పుడు అందరూ మాట్లాడుతున్నారు. ప్రభుత్వం నుంచి అందాల్సిన అన్ని సేవలను మధ్యదళారుల అవసరం, అవినీతికి ఆస్కారం లేకుండా ఈ వలంటీర్లు చక్కగా నిర్వహిస్తున్నారు. లంచాలకు, పైరవీలకు తావు లేకుండా సామాన్య ప్రజానీకానికి ఈ వలంటీర్ల వ్యవస్థ ఎనలేని మేలు చేస్తోంది.

దీంతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి నాయకత్వంలోని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం పనితీరుపై పేద, మధ్యతరగతి ప్రజల్లో సదభిప్రాయం బలపడుతోంది. ప్రతి 50 కుటుంబాలకు ఒక వలంటీర్‌ చొప్పున పనిచేసే ఈ వినూత్న వ్యవస్థను నడపడానికి వారి వేతనాల (గౌరవవేతనం) కింద ఏటా రూ.1200 కోట్లు చెల్లిస్తున్నారు. కనీస విద్యార్హతలతో, పారితోషికంతో పనిచేసే వలంటీర్ల వ్యవస్థను వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్ది మాసాలకే 2019 ఆగస్టు 15న ప్రవేశపెట్టింది.

కొత్త వ్యవస్థకు వచ్చే నెల 15న నాలుగేళ్లు నిండుతాయి. ఈ 4 సంవత్సరాల్లో ఈ కొత్త వ్యవస్థ పనితీరును నిస్పక్షపాతంగా సమీక్షిస్తే వలంటీర్లకు మంచి మార్కులే వస్తాయి. అవసరమైన ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండే గ్రామ, వార్డు వలంటీర్లు ప్రజలకు నిజమైన సేవలందించించే ‘డెలివరీ సిస్టం’లో కీలకపాత్రధారులయ్యారు. ప్రజలకు కూతవేటు దూరంలో ఉండే వలంటీర్లు ప్రజాసేవకులుగానే వ్యవహరిస్తున్నారు కాని, ప్రతిపక్షాలు నిందిస్తున్నట్టు పాలకపక్షం ప్రతినిధులుగా కాదు. రెండున్నర లక్షల మందికి పైగా ఉన్న వలంటీర్ల పనితీరును గుర్తించి ఏపీ సర్కారు అర్హులైన వారికి నగదు బహుమతులు అందిస్తోంది.

సామాన్య జనానికి వారి సేవలకు గుర్తింపుగా దాదాపు రెండొందల ఏభయి కోట్ల విలువైన నగదు అవార్డులు ఇస్తోంది. 2019 అక్టోబర్‌ లో ప్రారంభించిన గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను ముందుకు నడిపించే సిపాయిలుగా ఈ వలంటీర్లు పనిచేస్తున్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేయడానికి ప్రభుత్వాధికారులు వ్యూహాలు రూపొందిస్తుంటే వాటిని క్షేత్రస్థాయిలో అమలు చేస్తున్నది వలంటీర్లే.

ప్రవేశపెట్టిన వెంటనే పట్టాలెక్కిన కొత్త వ్యవస్థ!
అధికార వికేంద్రీకరణ, ప్రజల ముంగిటకే పాలన అనే గొప్ప సూత్రాల అమలుకు ప్రవేశపెట్టిన వెంటనే గ్రామ, వార్డు వలంటీర్ల వ్యవస్థ పట్టాలెక్కి ఆశించిన దాని కన్నా ఎక్కువ వేగంతో ముందుకు సాగింది. గ్రామ, వార్డు సచివాలయాల్లో కీలకంగా వ్యవహరించే దాదాపు పదిహేన వేల మందికి పైగా గ్రామ, వార్డు కార్యదర్శులు తోడు కావడంతో వలంటీర్ల వ్యవస్థ మరింత చలనశీలంగా సాగుతోంది. కనీవినీ ఎరగని రీతిలో ఎన్నో రకాల సేవలను ప్రజల గుమ్మం ముందుకే తీసుకొచ్చాయి ఈ సచివాలయ, వలంటీర్ల వ్యవస్థలు.

పేదలు, దిగువ మధ్య తరగతి ప్రజలు ప్రభుత్వోద్యోగుల కాళ్లావేళ్లా పడే అవసరం లేకుండా ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల ఫలాలు అందుకోవడం కొత్త వ్యవస్థలు విజయవంతమయ్యాయని చెప్పడానికి గొప్ప నిదర్శనం. ప్రతి వేయి కుటుంబాలకు సేవలందించే సచివాలయ వ్యవస్థకు వలంటీర్ల వ్యవస్థ తోడవడంతో అచిరకాలంలో ఆశించిన ఫలితాలు వచ్చాయి. వాటికి దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు లభించింది. తెలంగాణలో కూడా అధికార వికేంద్రీకరణకు ఇలాంటి వ్యవస్థను ప్రవేశపెట్టాలనే ఆలోచన వచ్చిందని తెలుస్తోంది.

తమిళనాడు సైతం గ్రామ సచివాలయాల ఫక్కీలో గ్రామీణ ప్రాంతాల్లో 600కి పైగా కార్యాలయాలు ఏర్పాటు చేయాలనే ఉద్దేశం ఉన్నట్టు 2022లో ప్రకటించింది. వాటిలో పాలనా సౌకర్యాలు, సమావేశ మందిరాలు ఉండేలా చూడాలని తమిళ సర్కారు యోచిస్తోంది. ఎవరెన్ని వివాదాలు లేవనెత్తినా పాతికకు పైగా ఉన్న ఏపీ ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో మాత్రం వలంటీర్లు కీలక పాత్ర పోషిస్తున్నారనేది తిరుగులేని వాస్తవం.

పూర్తిస్థాయి ప్రభుత్వ ఉద్యోగులు కాకపోయినా ప్రజల అవసరాలు తీర్చడంలో వలంటీర్లు ముందుంటున్నారు. జనం ఇవే అవసరాల కోసం ప్రభుత్వ ఆఫీసులు చూట్టూ తిరగాల్సిన దుస్థితిని వలంటీర్ల వ్యవస్థ ద్వారా వైఎస్సార్సీపీ సర్కారు తప్పించింది. సామాన్య ప్రజానీకానికి సాధికారత లభించింది.

LEAVE A RESPONSE