Suryaa.co.in

Telangana

విద్యతో పాటు ఆటల్లోనూ రాణించాలి

– విద్యార్ధులకు మంత్రి తలసాని పిలుపు

విద్యార్థులు చదువుతో పాటు క్రీడలు, సాంస్కృతిక రంగాలలోను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బుధవారం సనత్ నగర్ లోని వెల్ఫేర్ గ్రౌండ్ లో రికగ్నైజ్డ్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మూడు రోజులపాటు నిర్వహించే విద్యార్థుల స్పోర్ట్స్ మీట్ ను మంత్రి ప్రారంభించారు. ఈ పోటీలలో 50 పాఠశాలలకు చెందిన వెయ్యికి మందికి పైగా విద్యార్థులు పాల్గొన్నారు. ముందుగా మంత్రి విద్యార్ధుల నుండి గౌరవ వందనం స్వీకరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరంతరం తరగతి గదులలో, పరీక్షలకు సిద్ధం కావడం వంటి వత్తిడుల నుండి విద్యార్థులకు క్రీడల తో మానసికోల్లాసం లభిస్తుందని, క్రమశిక్షణ కూడా అలవడుతుందని అన్నారు. అంతేకాకుండా విద్యార్థులను క్రీడలలో ప్రోత్సహించే విధంగా పోటీలను నిర్వహించడం పట్ల రికగ్నైజ్డ్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ నిర్వహకులను మంత్రి అభినందించారు. విద్యార్ధులు చదువుతో పాటు క్రీడలు, సాంస్కృతిక ఇతర రంగాలపై కూడా ఆసక్తి చూపాలని పిలుపునిచ్చారు .

సమాజంలో విద్యకు ఎంతో గౌరవం, గుర్తింపు ఉన్నదని గుర్తించి మంచి విద్యావంతులు గా తయారు కావాలని పిలుపునిచ్చారు. మీరు ఎంత ఉన్నతంగా ఎదిగితే మీ తల్లిదండ్రులు, మీ కుటుంబ సభ్యులకు అంత గౌరవాన్ని తీసుకొచ్చిన వారు అవుతారని చెప్పారు. క్రీడలలో గెలుపు, ఓటములు సహజమని, ఆ రెండింటిని ఒకే తీరుగా స్వీకరించాలని చెప్పారు. విద్యార్థులను ఉత్తమ భావి భారత పౌరులుగా తీర్చిదిద్దడానికి ఎంతో కృషి చేస్తున్న రికగ్నైజ్డ్ స్కూల్స్ నిర్వహకులు విద్యార్థులను క్రీడా పోటీలను నిర్వహించడం అభినందనీయం అన్నారు.

ఈ కార్యక్రమంలో TRS డివిజన్ అధ్యక్షులు కొలన్ బాల్ రెడ్డి, డిప్యూటీ DEO యాదయ్య, అసోసియేషన్ అధ్యక్షులు అగస్టీన్, జనరల్ సెక్రటరీ సుధాకర్, ఖుతుబుద్దీన్, VV రావు, ప్రసాద్, ఉమా మహేశ్వర్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE