Suryaa.co.in

Andhra Pradesh

ధూళిపాళ్ళ నరేంద్ర, తెనాలి శ్రావణ్ వి చౌకబారు విమర్శలు

– లేళ్ళ అప్పిరెడ్డి

జీడీసీసీ బ్యాంకులో జరిగిన అవకతవకలపై టీడీపీ మాజీ ఎమ్మెల్యేలు ధూళిపాళ్ళ నరేంద్ర, తెనాలి శ్రావణ్ నిరాధారమైన ఆరోపణలు, చౌకబారు విమర్శలు చేస్తున్నారని శాసనమండలి సభ్యులు, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ళ అప్పిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

తద్వారా దర్యాప్తును తప్పు దారి పట్టించాలన్నదే వారి పన్నాగమని ఆరోపించారు. వారు చెప్పేదానిలో వాస్తవం ఉంటే అందుకు సంబంధించిన ఆధారాలను రెండ్రోజుల్లో తమకు కానీ… మీడియాకు కానీ… పోలీసులకు కానీ… సమర్పించాలని ఆయన సవాల్ చేశారు. లేని పక్షంలో సోమవారం తాను వారిపై న్యాయ పోరాటానికి సిద్ధమని ప్రకటించారు.

బృందావన్ గార్డెన్స్‌లోని తన క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రంలో వైఎస్ జగన్ నేతృత్వంలో రైతు సంక్షేమ పాలన జరుగుతుందని తెలిపారు. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని సంపూర్ణంగా నమ్మి దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఒకడుగు ముందుకు వేస్తే… ఆయన తనయుడైన ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నాలుగడుగులు ముందుకు వేస్తూ రైతులు నాటే విత్తనాల నుంచి పండిన పంటను అమ్ముకునేంత వరకు వారికి చేయూత అందిస్తున్నారని చెప్పారు. రైతు పక్షపాతి అయిన జగన్ పాలనలో… రైతుల కోసం పని చేస్తున్న జీడీసీసీ బ్యాంకులో అవినీతి భాగోతం జరగడం నిజంగా దురదృష్టకరమని ఆయన విచారం వ్యక్తం చేశారు.

విషయం తెలిసిన వెంటనే బ్యాంకు ఛైర్మన్ రాతంశెట్టి సీతారామాంజనేయులు సంబంధిత మంత్రి కన్నబాబు దృష్టికి తీసుకెళ్ళి, వెంటనే దీనిపై ఎస్పీకి ఫిర్యాదు చేశారని లేళ్ళ అప్పిరెడ్డి తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు జీడీసీసీ బ్యాంకు పరిధిలోని 167 సొసైటీలలో నూటికి నూరు శాతం దర్యాప్తు జరిపిస్తున్నారని చెప్పారు.

ప్రాధమిక దర్యాప్తులో దోషులుగా నిర్ధారించిన 7 బ్రాంచిలలోని 13మంది మేనేజర్లు, సూపర్‌వైజర్లు, 17 సొసైటీలకు చెందిన సీఈఓ లను సస్పెండ్ చేసి వాటి పర్సన్ ఇన్‌ఛార్జ్‌లను కూడా సమాన బాధ్యులుగా గుర్తించి వారిపై కూడా విచారణ జరుపుతున్నారని వివరించారు.

రైతాంగానికి నష్టం జరిగితే ఎంత మాత్రం సహించలేని ముఖ్యమంత్రి జగన్ ఆదేశాల మేరకు రైతు సొమ్ము తిన్న ఏ ఒక్కరూ తప్పించుకోకూడదనే ప్రభుత్వం ఈ వ్యవహారాన్ని బ్యాంకు, రైతులు, అవినీతి అనే అంశాలను మాత్రమే పరిగణనలోకి తీసుకుని దర్యాప్తు జరిపిస్తున్నట్లు లేళ్ళ అప్పిరెడ్డి చెప్పారు. అయితే టీడీపీ మాజీ ఎమ్మెల్యేలు ధూళిపాళ్ళ, తెనాలి శ్రావణ్ దీనికి రాజకీయ రంగు పులుముతూ దర్యాప్తును పక్కదారి పట్టించి, దోషులను తప్పించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.

నిజానికి ఈ రాకెట్ ఎప్పుడు ప్రారంభమైందీ… దీని వెనుక ఎవరెవరు ఉన్నారు…? వారు ఎవరి ప్రోద్బలంతో ఇదంతా చేశారు, వారు ఏ రాజకీయ పార్టీకి చెందిన వారనే దానిపై తమ వద్ద సమాచారం ఉందనీ… అయితే విచారణను ప్రభావితం చేసినట్లు అవుతుందనే తాము ఆ విషయాలు ఇప్పుడు మాట్లాడదలుచుకోలేదనీ… ఆయన తెలిపారు. విచారణ పూర్తయిన తర్వాత దీని వెనుక ఎవరున్నా వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఆయన తేల్చి చెప్పారు.

వారిపై కేసులు నమోదు చేయడమే కాక వారి అస్తులను జప్తు చేయడం కూడా జరుగుతుందని హెచ్చరించారు. ధూళిపాళ్ళ, తెనాలి శ్రావణ్ గురించి తనకు పూర్తిగా తెలుసు … అయినా దర్యాప్తు తప్పుదారి పడుతుందనే తాను వ్యక్తిగతంగా ఆ విషయాలు మాట్లాడడం లేదని తెలిపారు.

ఇప్పటికైనా ఈ వ్యవహారంలో చౌకబారు రాజకీయాలు చొప్పించి నిరాధారమైన నిందలు మోపడం, అబద్ధాలతో అభాండాలు వేయడం, వైఎస్సార్సీపీ నాయకులంటూ బురదజల్లే ప్రయత్నం చేయడం, నా బంధువు ఉన్నాడని బొంకడం మానాలని లేళ్ళ అప్పిరెడ్డి వారికి హితవు పలికారు.

నిజంగా వారి వద్ద ఆధారాలుంటే వాటిని బయటపెట్టి దర్యాప్తునకు సహకరించాలని సూచించారు. వారికి ఈ విషయం చెప్పిన వారి చేతే పోలీసులకు ఫిర్యాదు చేయించాలని లేదంటే తానే స్వయంగా రంగంలో దిగి వారిపై కోర్టు ద్వారా న్యాయ పోరాటం చేస్తానని లేళ్ళ అప్పిరెడ్డి హెచ్చరించారు.

LEAVE A RESPONSE