– ఆత్మీయ సమ్మేళనంలో అప్పిరెడ్డి
అప్పిరెడ్డి ఆత్మీయులు ఆటోవాలాలు. వారికి అండగా నిలిచేందుకు నేనెప్పుడూ సిద్ధం. ఊకదంపుడు ఉపన్యాసాలు కాదు… ఉపయోగపడాలన్న భావనతో ఉన్నాను. అప్పిరెడ్డి మీ వాడు. కట్టె కాలే వరకు మీతోనే ఉంటాను. నాకు మీ చప్పట్లు, సన్మానాలు అక్కర్లేదు. నా గుండెల నిండా మీరే నిండి ఉన్నారు. మీకు ధైర్యాన్ని, నమ్మకాన్ని కల్గించడమే కాదు. మీ కుటుంబ సభ్యుడిగా కష్టుఖాల్లో తోడు–నీడగా నిలుస్తాను.” అని శాసనమండలి సభ్యులు, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ళ అప్పిరెడ్డి ఆటోడ్రైవర్లతో స్పష్టం చేశారు.
బృందావన్‌గార్డెన్స్‌లోని ఎమ్మెల్సీ క్యాంప్ కార్యాలయంలో బుధవారం ఆటోడ్రైవర్ల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. పార్టీ నగర ప్రధాన కార్యదర్శి బందా రవీంద్రనాద్ అధ్యక్షతన జరిగిన ఈ సమ్మేళనంలో ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి మాట్లాడుతూ, తన రాజకీయ ఎదుగుదలకు కారకులైన వారిలో ఆటోవాలాలు కూడా అత్యంత ముఖ్యులని పేర్కొన్నారు. ప్రతిపక్షంలో తాను కార్మిక నేతగా కష్టకాలంలో ఉన్నప్పుడు వైఎస్సార్సీపీ జెండా పట్టుకునేందుకే చాలా మంది బయపడుతున్న పరిస్థితుల్లో కూడా తనకు అండగా నిలవడమే కాక అప్పిరెడ్డి తమవాడు అని మనస్పూర్తిగా వెన్నంటి నిలిచారని ఆనాటి రోజులను ఆయన జ్ఞాపకం చేసుకున్నారు. అందుకే ఆటో డ్రైవర్లు తనకు ఎన్నటికీ ఆత్మీయులేననీ, వారితో గడిపే ప్రతి క్షణమూ మధురమేననీ ఆయన ప్రకటించారు. అందుకే వారితో తనకున్న అనుబంధాన్ని ఫొటోలు, వీడియోల రూపంలో కాక భద్రంగా హృదయంలో దాచుకున్నట్లు ఆయన వెల్లడించారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆశయాలకు అనుగుణంగా ఆటో డ్రైవర్ల పిల్లలు తిరిగి ఆటోడ్రైవర్లు కాకూడదన్నదే తన ఆలోచనగా లేళ్ళ అప్పిరెడ్డి చెప్పారు. విద్యారంగంలో విప్లవాత్మకమైన సంస్కరణలకు శ్రీకారం చుడుతూ సీఎం ప్రవేశపెట్టిన పధకాలను సద్వినియోగం చేసుకోవడం ద్వారా తమ పిల్లల్ని ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దుకోవాలని ఆయన సూచించారు. అప్పుడే ఆటో డ్రైవర్ల జీవితాల్లో అసలైన వెలుగులు విరబూస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు.
ఈ క్రమంలో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించేందుకు, పిల్లల చదువులు, ఉద్యోగాలకు అవసరమైన సాయం అందించేందుకు తాను రెడీగా ఉంటానని చెప్పారు. తద్వారా మీ రుణం తీర్చుకుంటానని తెలిపారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలని ఆయన కోరారు. ఆటో డ్రైవర్లుగా విధి నిర్వహణలో కానీ… కుటుంబపరంగా జీవన గమనంలో కానీ… ఎదురయ్యే ఇబ్బందులను తన దృష్టికి తేవాలని సూచించారు. ఇటు పార్టీ పరంగా అటు ప్రభుత్వపరంగానే కాక వ్యక్తిగతంగా కూడా తాను అన్ని విధాలా అండగా నిలుస్తానని లేళ్ళ అప్పిరెడ్డి ప్రకటించారు.
ఈ ఆత్మీయ సమ్మేళనంలో జిల్లా గ్రంధాలయ సంస్థ ఛైర్మన్ బత్తుల దేవానంద్, వైఎస్సార్సీపీ నగర ట్రేడ్ యూనియన్ నేతలు మేకా రవి, శేషగిరి పవన్, పలు ఆటో స్టాండ్ యూనియన్ నేతలు ఎస్.కె.సుభాని, శ్రీరాములు, మొగిలి సాయి, సత్తిరెడ్డి, బాబు తదితరులు పాల్గొన్నారు.