Suryaa.co.in

Editorial

బీజేపీ బాసులను.. తెలంగాణ నేతలు తప్పుదోవపట్టిస్తున్నారా?

– 35-40 సీట్లు వస్తాయని నివేదిక?
– దానిపై ఆరా తీసిన సంఘ్‌ పెద్దలు
– రాష్ట్ర బీజేపీ నివేదికలపై ఆరా?
– 3-7 సీట్లు వస్తాయని తేలిన వైనం
– బండి సంజయ్‌ తొలగింపు తర్వాత తీరు మారిందని వివరణ
– ఆర్గనైజేషన్‌ను గాలికొదిలేశారని ఫిర్యాదు
– ఐదేళ్లలో నేతలను తయారుచేయలేదని స్పష్టీకరణ
– పార్టీలో చేరిన వారిని పట్టించుకోలేదని ఫిర్యాదులు
– బీజేపీ నివేదికపై ఆశ్చర్యపోయిన సంఘ్‌ పెద్దలు
– ఆ నివేదికలే నిజమని నమ్మి అగ్రనేతలు పర్యటిస్తున్నారా?
( మార్తి సుబ్రహ్మణ్యం)

తెలంగాణ ఎన్నికల్లో వాస్తవ పరిస్థితులపై రాష్ట్ర బీజేపీ బాధ్యులు.. ఢిల్లీ బాసులను తప్పుదోవపట్టిస్తున్నారా? నిజాలను దాచి పైవారిని మభ్య పెడుతున్నారా? క్షేత్రస్థాయి నివేదికలను మసిపూసి మారేడుకాయచేస్తున్నారా? లేని బలాన్ని ఉన్నట్లు భూతద్దంలో చూపిస్తున్నారా? దాని వల్ల బీజేపీ నేతలు ఏం లబ్ధి ఆశిస్తున్నారు? ఎవరి మెప్పు కోసం తప్పుడు తడకల నివేదికలు అందిస్తున్నారు? అయినాఈ నివేదికలను ఢిల్లీ బాసులు నమ్మడం లేదా? అందుకే సంఘ్‌ పెద్దలను రంగంలోకి దింపి ఆరా తీసిందా?.. ఇదీ ఇప్పుడు బీజేపీలో హాట్‌టాపిక్‌.

విశ్వసనీయ సమాచారం ప్రకారం.. తెలంగాణలో కమలవికాసం దేదీప్యమానంగా ఉందని, రాష్ట్ర పార్టీ బాధ్యులు కేంద్ర నాయకత్వానికి ఇటీవల నివేదిక పంపించారట. ప్రజల్లో బీఆర్‌ఎస్‌పై వ్యతిరేకత ఉప్పెనలా ఉందని, జనం బీజేపీని ప్రత్యామ్నాయంగా భావిస్తున్నారని పేర్కొంది. ఆ ప్రకారంగా తమ పార్టీకి 35 నుంచి 40 సీట్లు వచ్చే అవకాశం ఉందని నివేదిక పంపింది. ఆయా స్థానాల్లో బలమైన అభ్యర్ధులు ఉన్నారని తన నివేదికలో వెల్లడించింది.

దానితో సంబరపడిన ఢిల్లీ బాసులు.. ఈ విషయాన్ని సంఘ్‌ పెద్దలకు వివరించారట. ఎలాగూ పార్టీ జాతీయ సంఘటనా మహామంత్రి బీఎల్‌ సంతోష్‌జీ , సంఘ్‌ పురమాయిస్తే నియమితులయిన నాయకుడే కాబట్టి.. అదేదో ఓసారి పరిశీలించమని సంఘ్‌ పెద్దలకు సూచించారట. దానితో సంఘ్‌ అగ్ర నేతలు తెలంగాణలో బీజేపీ విజయంపై వాస్తవ పరిస్థితులను వాకబు చేయడం ప్రార ంభించారు.

రంగంలోకి దిగిన ఆరెస్సెస్‌ నేతల విచారణలో .. అసలు ఇక్కడ పార్టీకి అంత సినిమా లేదని తేలిందట. బండి సంజయ్‌ అధ్యక్షుడిగా ఉన్నప్పుడైతే మీరు చెప్పింది నిజమేనని, ఇప్పుడు అంత సీను లేదని తేలిందట. పార్టీకి మహావస్తే 3 నుంచి 7లోపల వచ్చే అవకాశాలున్నాయని వారి నిజనిర్ధారణలో వెల్లడయిందట. నాయకత్వం ఆర్గనైజేషన్‌ను గాలికొదిలేసిందని, ఎవరూ జనంలోకి వెళ్లకుండా మీడియాకు పరిమితమైన ఫలితమే ఈ పరిస్థితి అని వివరించారట.

వలసలు కూడా పార్టీని దెబ్బతీశాయని, పార్టీలో చేరిన వారిని గౌరవించి, వారికి బాధ్యతలు అప్పగించడంలో నాయకత్వం విఫలమయిందని స్పష్టం చేశారట. పార్టీలో చేరిన అగ్రనేతలంతా ఎన్నికల ముందు, ఇతర పార్టీల్లో చేరిపోవడం తప్పుడు సంకతాలకు కారణమయిందని చెప్పారట.

ఈ ఐదేళ్లలో సమర్ధులైన నాయకులను తయారుచేసుకోవడంలో రాష్ట్ర నాయకత్వం విఫలమైందని కుండబద్దలు కొట్టారట. ప్రధానంగా ఢిల్లీ లిక్కర్‌ కేసులో కవితను అరెస్టు చేయకపోవడం, కేసీఆర్‌ సర్కారుపై పోరాడుతున్న బండి సంజయ్‌ను తొలగించడంతో బీజేపీ-బీజఆర్‌ఎస్‌ ఒక్కటేనన్న భావన జనంలో స్థిరపడిందని స్పష్టం చేశారట.

దానితో తమ దృష్టికి వచ్చిన అంశాలు విశ్లేషించిన సంఘ్‌ పెద్దలు నోరెళ్లబెట్టారట. ఆ ప్రకారంగా రాష్ట్ర బీజేపీ బాధ్యులు ఢిల్లీ బాసులను, కావాలనే తప్పుదోవపట్టించారన్న విషయం సంఘ్‌ నేతలకు స్పష్టమయింది. దానితో ఇది ఎందుకోసం? ఎవరి ప్రయోజనాల కోసం అన్న చర్చకు తెరలేచింది.

నిజానికి ఎన్నికల సమయంలో పార్టీ నాయకత్వం… గెలిచే స్థానాలు-పోటీ ఇచ్చే స్థానాలు- ఓటు శాతం పెంచుకునే నియోజకవర్గాలను గుర్తిస్తాయి. నిధుల పంపిణీ కూడా ఆ మేరకే ఉంటుంది. మొదటి కేటగిరికి ఎక్కువ నిధులు, రెండవ కేటగిరికి తక్కువ నిధులు ఇస్తుంటాయి. అవన్నీ రాష్ట్ర అధ్యక్షుడు,సంఘటనామంత్రి ద్వారానే పంపిణీ అవుతుంటాయన్నది బహిరంగ రహస్యం.

మరి వాస్తవంగా గెలిచే సీట్లు పది స్థానాల లోపే ఉంటే.. 35-40 సీట్లు గెలుస్తామని నివేదికలివ్వడం వెనుక మతలబేమిటి? ఆ నివేదికలకూ-నిధులకూ ఏమైనా బాదరాయణ సంబంధం ఉందా? అసలు కొంపదీసి రాష్ట్ర బీజేపీ ఇచ్చిన నివేదికలనే నిజమని నమ్మి.. ప్రధాని మోదీ-హోంమంత్రి అమిత్‌షా, కేంద్రమంత్రులు పాపం తెలంగాణకు వచ్చి కష్టపడుతున్నారా? ఇప్పుడు బీజేపీ వర్గాలలో ఇదే చర్చ.

LEAVE A RESPONSE