– అమెరికా అసహనం, యూనస్‌కు కొత్త చిక్కులు
బంగ్లాదేశ్ విద్యార్థి ఉద్యమ నేత ఉస్మాన్ హాదీ హత్యలో యూనస్ ప్రభుత్వంలోని కీలక వ్యక్తుల హస్తం ఉందని ఆయన సోదరుడు ఒమర్ హాదీ ఆరోపించారు. బంగ్లాదేశ్‌లో ఫిబ్రవరిలో నిర్వహించాల్సిన ఎన్నికలను అడ్డుకొనేందుకు ఈ హత్యకు పాల్పడ్డారని తీవ్రమైన ఆరోపణలు చేశారు.
హత్యల కారణంగా ఎన్నికల వాతావరణం దెబ్బతినకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఒమర్ హాదీ కోరారు. వేగంగా విచారణ జరిపి హాదీ హత్య నిందితులను పట్టుకోవాలని డిమాండ్ చేశారు.
ఉస్మాన్ హదీకి న్యాయం జరగకపోతే, ఏదో ఒక రోజు యూనస్ కూడా బంగ్లాదేశ్‌ను వీడి పారిపోవాల్సి వస్తుందని ఒమర్ హాదీ హెచ్చరించారు. షాబాగ్లోని జాతీయ మ్యూజియం ముందు ఇంకిలాబ్ మంచో నిర్వహించిన “షహీదీ షపత్” (అమరవీరుల ప్రమాణం) కార్యక్రమంలో ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఒమర్ హదీ మాట్లాడుతూ, “ఉస్మాన్ హదీని చంపించింది మీరే, ఇప్పుడు దీనిని ఒక సమస్యగా వాడుకుని ఎన్నికలను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారు” అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తన సోదరుడు ఫిబ్రవరి నాటికి జాతీయ ఎన్నికలు జరగాలని కోరుకున్నారని చెబుతూ ఎన్నికల వాతావరణాన్ని చెడగొట్టవద్దని అధికారులను కోరారు. ఏ ఏజెన్సీకి గానీ లేదా “విదేశీ యజమానులకు” గానీ లొంగనందుకే తన సోదరుడిని చంపారని ఒమర్ హదీ ఆరోపించారు. ప్రభుత్వం ఎన్నికలను “విధ్వంసం” చేయడానికి ప్రయత్నిస్తోందని అనుమానం వ్యక్తం చేశారు.
మరోవైపు, అంతర్జాతీయంగానూ యూనస్ ప్రభుత్వానికి ఇబ్బందులు తప్పడం లేదు. మాజీ ప్రధాని షేక్ హసీనాకు చెందిన ‘అవామీ లీగ్’ పార్టీపై బంగ్లాదేశ్ ప్రభుత్వం నిషేధం విధించింది. దీనివల్ల వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ పోటీ చేసే అవకాశం లేకుండా పోయింది. ఈ నిర్ణయంపై అమెరికా తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.
పారదర్శక, స్వేచ్ఛాయుత ఎన్నికలు జరగాలంటే అన్ని పార్టీలకు అవకాశం ఉండాలని అమెరికా చట్టసభ్యులు పేర్కొన్నారు. అవామీ లీగ్‌పై విధించిన నిషేధాన్ని పునఃసమీక్షించాలని సూచించారు. ప్రభుత్వాన్ని ఎన్నుకునే హక్కు బంగ్లాదేశ్ పౌరులకు ఉందని, దాన్ని కాలరాయవద్దని స్పష్టం చేశారు.
(‘నిజంటుడే’ సౌజన్యంతో)