-తాడేపల్లిలో కూర్చుని పేజీలు తిరగేసి అంకెలు చెప్పినంత మాత్రాన అంగన్వాడీల సమస్యలు తీరవు
– క్షేత్ర స్థాయికి వెళ్లి పరిశీలిస్తే నిజాలు తెలుస్తాయి
– రాష్ట్రంలో ఏ ఒక్కరు మీకు అనుకూలంగా మాట్లాడే పరిస్థితి లేదు
– ఎన్నికల మేనిఫెస్టోలో తెలంగాణకు మించి అంగన్వాడీలకు ప్రయోజనం చేకూర్చుతానని మాట తప్పారు
– నెలకు రూ.10 వేల లోపు ఆదాయం ఉన్న వారికి సంక్షేమ పథకాల అమలు నిబంధన అంగన్వాడీలకు శరాఘాతమైంది
– అంగన్వాడీ-డ్వాక్రా సంఘాల అభివృద్ధిపై చర్చకు సిద్ధమా?
-టీడీపీ అంగన్వాడీ, డ్వాక్రా రాష్ట్ర విభాగాల అధ్యక్షురాలు ఆచంట సునీత
తాడేపల్లిలో కూర్చుని పేజీలు తిరగేసి అంకెలు చెప్పినంత మాత్రాన అంగన్వాడీల సమస్యలు తీరవని టీడీపీ అంగన్వాడీ, డ్వాక్రా విభాగాల రాష్ట్ర అధ్యక్షురాలు ఆచంట సునీత ఎద్దేవా చేశారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం, ఎన్టీఆర్ భవన్ లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ….
జగన్ రెడ్డి అధికారంలోకి రానంత వరకు మాట తప్పను-మడమ తిప్పను అని చెప్పి పూర్తిగా మాట తప్పారు, మడమ తిప్పారు. ఆచరణకు సాధ్యం కాని హామీలు ఇచ్చారు. మాది మహిళా పక్షపాతి ప్రభుత్వం అని చెప్పి మహిళలను వంచిస్తున్నారు. మహిళా సంక్షేమమే ధ్యేయంగా మా ప్రభుత్వం పని చేస్తుందని చెప్పి మోసం చేశారు. మహిళలంతా నా సొంత అక్క చెల్లెమ్మలు, పిల్లలందరికి మేనమామ అని చెప్పి ఓట్లు దండుకున్నారు.
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడున్నరేళ్లు అయినా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందాన ఉంది. ఎంత మంది మహిళలకు న్యాయం చేశారో చెప్పాలి. గతంలో అంగన్ వాడీ కేంద్రాలంటే మనోవికాస కేంద్రాలుగా ఉండేవి. నేడు అంగన్ వాడీ కేంద్రాలను సందర్శించడానికి వెళితే కేంద్రాలు సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతూ కనిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి రాష్ట్రంలోని అంగన్ వాడీ ఒకసారి సందర్శిస్తే కేంద్రాలు ఎంత దుర్భర పరిస్ధితులలో ఉన్నయో తెలుస్తుంది. అక్కడి పిల్లల బాగోగులు, టీచర్లు పడుతున్న ఇబ్బందులు అర్ధమౌతాయి.
కేవలం పుస్తకాలు చదవేదివేస్తే ప్రయోజనం ఏముంది..? చెదపురుగులు కూడా పుస్తకాలను నమిలేస్తాయి..అంతమాత్రాన వాటికి జ్ణానం వచ్చేసినట్లా అని డాక్టర్ బీ.ఆర్.అంబేద్కర్ గారు అన్నారు. జగన్ రెడ్డి మాది మహిళా సంక్షేమ ప్రభుత్వం, మహిళలకు పెద్ద పీట వేస్తానని చెప్పి మోసం చేశారు. ఆచరణలో ఎక్కడ మహిళలకు పెద్ద పీట వేసిన పరిస్ధితి లేదు. పెద్ద ఎత్తున కలెక్టరేట్ ముందు అంగన్ వాడీలు, ఆశా వర్కర్లు, డ్వాక్రా మహిళలు నిరసన తెలుపుతున్నారు. ప్రతి ఒక్కరు రోడ్లెక్కి వాళ్ల న్యాయబద్ధమైన డిమాండ్స్ లని తీర్చమని నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు.
రాష్ట్రంలో ఉన్న 1లక్షా 20వేల కేంద్రాలు ఏ విధంగా ఉన్నాయో, అందులోని పిల్లలు ఎంత ఇబ్బందులు పడుతున్నారో కళ్లతో చూస్తే తెలుస్తుంది. అంగన్వాడీ-డ్వాక్రా సంఘాల అభివృద్ధిపై ఎవరు చర్చకు వచ్చినా చర్చించేందుకు సిద్ధంగా ఉన్నాను. ప్రైవేటు రుణ అప్ లని ఆశ్రయించి ఆ సంస్థలు చేసే దౌర్జన్యాలను తట్టుకోలేక అనేకమంది మరణాలకు పాల్పడుతున్నారు. వైసీపీ కార్యకర్తలకు వాలంటీర్ల పేర్లతో ఉద్యోగాలు కట్టబెట్టారు. తల్లిని, చెల్లిని రోడ్డు మీదకు గెంటేశారు. తల్లి, చెల్లినే పట్టించుకోని వ్యక్తి రాష్ట్రంలోని మహిళలకు న్యాయం చేస్తారనుకోడం అపోహ అవుతంది.
చంద్రబాబు నాయుడు హయాంలో:
చంద్రబాబు నాయుడు హయాంలో మంచి సంకల్పంతో అంగన్ వాడీలను ఏర్పరచడం జరిగింది. అంగన్ వాడీలను కార్పొరేట్ స్కూళ్ళకు సమానంగా తీర్చిదిద్దడం జరిగింది. నాణ్యమైన విద్యతో పాటు, తల్లి, బిడ్డలకు, గర్భిణీలకు పౌష్టికాహారము అందించారు.
చంద్రబాబు నాయుడుకి డ్వాక్రా మహిళా సంఘాలంటే మానస పుత్రికలుగా ఉండేవి. ప్రతి మహిళా వాళ్ల కాళ్ళ మీద వాళ్ళు నిలబడి కుటుంబాన్ని పోషించుకోవాలనే సంకల్పంతో డ్వాక్రా గ్రూపులను ఏర్పాటు చేశారు.
అంగన్ వాడీలకు వేతనాలు పెంచిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వానిదే. 2018 వరకు అంగన్వాడీ కార్యకర్తలకు గౌరవ వేతనం రూ. 4,200 ఉండగా దాన్ని రెండు విడతల్లో రూ. 6,300 వరకు పెంచారు. జగన్ రెడ్డి కేవలం వెయ్యి పెంచి చేతులు దులుపుకున్నారు. డ్వాక్రా గ్రూపులలో లోన్ రివాల్వింగ్ ఫండ్ ఇవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ అంటే డ్వాక్రా మహిళలు గుర్తొచ్చేట్లు చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు.
జగన్ రెడ్డి హయాంలో:
అధికారంలోకి వస్తే అంగన్ వాడీలకు పెద్ద పీట వేస్తాం, అభివృద్ధికి పాటు పడతాం, అంగన్ కేంద్రాలను బలోపేతం చేసి గొప్పగా తీర్చు దిద్దుతాం అని మాయ మాటలు చెప్పి ప్రజలను మోసం చేశారు. అంగన్ వాడీలకు వచ్చే బడుగు, బలహీన వర్గాలకు చెందిన చిన్న పిల్లలకు పెట్టే అన్నం నాణ్యత లేకుండా పోయింది. మీ ధనదాహాంతో వారిని ఇబ్బంది పెడుతున్నారు. బిడ్డల, తల్లుల ఉసురు తగులుతుంది. అంగన్ వాడీ టీచర్లు, ఆయాలకు ప్రతి నెల జీతంఇవ్వడం లేదు. మూడు, నాలుగు నెలలకు ఒకసారి 11,12వేల జీతం ఇస్తుంటే వాళ్లు ఏ రకంగా బతకాలి? అంగన్ వాడీ కేంద్రాల కరెంటు బిల్లులు చెల్లించడం లేదు. వాళ్లకు రావాల్సిన టిఏ, డిఏ లు ఇవ్వడం లేదు, అద్దెలు చెల్లించడం లేదు. అధికారంలోకి వచ్చాక డ్వాక్రా గ్రూపులని నిర్వీర్యం చేశారు.
జగన్ రెడ్డి ప్రభుత్వంలో రుణ సదుపాయం లేకపోవడంతో ప్రైవేటు అప్ లను ఆశ్రయిస్తున్నారు. డ్వాక్రా పొదుపు సంఘాలు దాచుకున్న 10వేల కోట్లు, అభయ హస్తం 2వేల కోట్లు దోచేశారు. నేడు సరికొత్త మోసానికి తెర తీశారు.
ప్రతి డ్వాక్రా గ్రూపులో ఉన్న మహిళ దగ్గర నుంచి రూ.200/-లు తీసుకొని మండలానికో మహిళా మాల్ ని పెడతాం అనడం దుర్మార్గం. అధికారంలోకి వచ్చిన వెంటనే జాబ్ క్యాలెండర్ తెస్తానని నిరుద్యోగ యువతను మోసం చేశారు.
చంద్రన్న భీమా, కళ్యాణ మిత్ర, పశు మిత్రని రద్దుచేశారు. గ్రామీణ ప్రాంతంలో వీఒఏలు, పట్టణ ప్రాంతంలో ఆర్పీలు 32వేల మంది ఉన్నారు. 32వేల మందిని తొలగించి మళ్లీ కొత్త వాళ్లని నియమించుకుంటాం అని నవంబరులో జివో ఇస్తాం అనడం ఎంత వరకు సమంజసం? రాష్ట్రంలో పిఆర్సిలో అంగన్వాడీలకు వేతనాలు పెంచలేదు.
లోన్ యాప్ బాధితులు:
లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులు తట్టుకోలేక రాజమండ్రిలో దుర్గారావు దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. వారిద్దరి పిల్లలూ అనాధలయ్యారు. ఈ పరిస్థితి చూస్తుంటే మనసు కలిచివేస్తుంది. గతంలో అప్పు చెల్లించమని రికవరీ ఏజెంట్లు ఇంటికొచ్చి బెదిరించడంతో అవమానం తట్టుకోలేక విద్యార్థిని హరిత ఆత్మహత్య చేసుకుంది. మంగళగిరిలో అప్పు చెల్లించినప్పటికీ అశ్లీల చిత్రాలు బంధువులకు పంపుతామని బెదిరింపులతో, లోన్ యాప్ వేధింపులకు తట్టుకోలేక ప్రత్యూష అనే మహిళ ఆత్మహత్య చేసుకుంది. తూర్పుగోదావరి, కడియంలో చదువు కోసం రుణం తీసుకున్న సతీష్ అనే పీజీ విద్యార్థికి రుణ యాప్ నిర్వాహకుల వేధింపులకు గురి అయ్యాడు. అశ్లీల చిత్రాలు సెల్ కు పంపి బెదిరించడంతో మానసిక ఒత్తిడికి లోనై రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు.
పేద, బడుగు, బలహీన వర్గాలకు మోసం :
ఆచరణకు సాధ్యంకాని హామీలిచ్చి పేద, బడుగు, బలహీన వర్గాలను మోసం చేసిన ముఖ్యమంత్రి చరిత్రలో నిలిచిపోతారు. డ్వాక్రా సంఘాల కు రావాల్సిన బకాయిలు, పొదుపు డబ్బులు, వారు దాచుకున్న అభయహస్తం డబ్బులు ప్రభుత్వం వెంటనే చెల్లించాలి. జగన్ ఇంటిని ముట్టడించైనా సరే వారి న్యాయమైన హక్కులను సాధించుకుంటాం. వారి హక్కుల సాధన కోసం పోరాడుతూనే ఉంటామని టీడీపీ అంగన్వాడీ, డ్వాక్రా విభాగాల రాష్ట్ర అధ్యక్షురాలు ఆచంట సునీత హెచ్చరించారు.