ప్రాథమిక హక్కులను రక్షించండి

-అనుమానితుల ఆస్తులు దొంగిలిస్తున్న పోలీసులు
-దర్యాప్తు సంస్థల వద్ద సీసీ కెమెరాలు అమర్చాలి
-ప్రభుత్వ సీఎస్‌కు హైకోర్టు న్యాయవాది గూడపాటి లక్ష్మీనారాయణ లేఖ

అమరావతి: ప్రజల ప్రాథమిక హక్కులను పరిరక్షించాలని కోరుతూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి హైకోర్టు ప్రముఖ న్యాయవాది గూడపాటి లక్ష్మీనారాయణ శనివారం లేఖ రాశారు. పోలీసులు, దర్యాప్తు సంస్థల వారు అనుమానితులను విచారించే సమయంలో సుప్రీం కోర్టు ఆదేశాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నట్లు తెలిపారు.

పోలీసులు నిందితులను అరెస్టు చేసిన తరువాత వేధింపులకు గురిచేస్తూ శారీరక హింసకు పాల్పడుతున్నారని ఆరోపించారు. సీఐడీ(నేర పరిశోధక శాఖ), ఏసీబీ( అవినీతి నిరోధక బ్యూరో) వారు అనుమానితులను తలుపులు పగలగొట్టి మరీ అర్ధరాత్రి అరెస్టులు చేస్తూ మానవ హక్కులను ఉల్లంఘిస్తున్నారని తెలిపారు. విచారణ పేరుతో అనుమానితులను చిత్రహింసలు, భావోద్వేగ వేధింపులకు గురిచేస్తున్నట్లు వివరించారు.

అరెస్టులు చేసే సమయంలో దర్యాప్తు సంస్థలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ పౌరహక్కులకు భంగం కలిగిస్తున్నట్లు తెలిపారు. అనుమానితులకు చెందిన డెస్క్ టాప్ కంప్యూటర్లు, ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్‌లు, ఐప్యాడ్‌లు వంటి వాటిని దోచుకుంటున్నాయన్నారు. దర్యాప్తు సమయంలో దోచుకున్న వస్తువుల వివరాలు వారు రికార్డులలో నమోదు చేయడంలేదని తెలిపారు. విచారణ ప్రదేశాలలో సీసీ కెమెరాలు అమర్చడంలేదని, పోలీసులు, దర్యాప్తు సంస్థల అధికారులు, సిబ్బంది వారి శాఖకు, హోదాకు సంబంధించిన బ్యాడ్జీలు ధరించడంలేదని పేర్కొన్నారు.

వారెవరో తెలియకుండా దౌర్జన్యంగా అరెస్టులు చేస్తున్నట్లు తెలిపారు. ఈ విధమైన చర్యలు సుప్రీం కోర్టు ఆదేశాలను ఉల్లంఘించడమేనన్నారు. అనుమానితులను విచారించే ముందు దర్యాప్తు సంస్థల వారు తమ తమ శాఖలు, హోదాలు తెలిపే బ్యాడ్జీలు ధరించాలని, కోర్టు ఆదేశాలకు కట్టుబడి విచారణ ప్రదేశంలో సీసీ కెమెరాలను అమర్చాలని, విచారణ దృశ్యాలను రికార్డు చేయాలని కోరారు. పోలీస్ స్టేషన్లు, దర్యాప్తు సంస్థల వద్ద సీసీ కెమెరాలు అమర్చే విధంగా చర్యలు తీసుకోవాలని గూడపాటి లక్ష్మీనారాయణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి రాసిన లేఖలో విజ్ఞప్తి చేశారు.