– ఇది తెలుగుదేశం పార్టీ అధికారిక వైఖరా?
– లేక ఆ ఎంపీల సొంత పైత్యమా?
– తెలంగాణ మీద ఏడుపు ఆపండి
– తెలంగాణ ఎంపీల మౌనం.. ఆత్మగౌరవానికి ద్రోహం
– మీ తెలివిని ఆంధ్రా అభివృద్దికి వాడుకోండి
– తెలంగాణపై ఇంకా చిల్లర రాజకీయాలు ఎందుకు?
– ఆంధ్రా ఎంపీలకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్ హెచ్చరిక
హైదరాబాద్: రాష్ట్రం విడిపోయి పన్నెండేళ్లు గడుస్తున్నా, ఇంకా తెలంగాణ ఏర్పాటుపై విషం చిమ్ముతున్న ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం ఎంపీల తీరుపై బీఆర్ఎస్ నేత, డాక్టర్ దాసోజు శ్రవణ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. లోక్‌సభ వేదికగా తెలంగాణ అస్తిత్వాన్ని కించపరిచేలా వ్యవహరించిన ఎంపీలు లావు కృష్ణదేవరాయలు, తెన్నేటి కృష్ణప్రసాద్‌ల వైఖరిని ఆయన తీవ్రంగా ఖండించారు.
“కోతికి పుండు అయితే గోకినట్టు.. నాకినట్టు” తయారైంది తెలుగుదేశం నాయకుల తీరు అని శ్రవణ్ ఎద్దేవా చేశారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్ర అభివృద్ధికి ఏం కావాలో అడిగి సాధించుకునే తెలివి లేక, నిరంతరం తెలంగాణపై పడి ఏడవడం వీళ్లకు పరిపాటైపోయిందని విమర్శించారు. నాడు ఉద్యమ సమయంలో వందలాది మంది తెలంగాణ యువకుల ఆత్మబలిదానాలకు కారణమైంది మీ కుట్రలు కాదా? అని నిలదీశారు.
సొంత రాష్ట్రంలో పాలన చేతకాక, ఆంధ్రప్రదేశ్‌ను చిల్లర ఫ్యాక్షన్ రాజకీయాలతో అగాధంలోకి నెట్టేస్తున్నారని శ్రవణ్ మండిపడ్డారు. మోదీ ముందు మోకరిల్లి కూడా ఏపీకి రావాల్సిన ‘స్పెషల్ స్టేటస్’ సాధించుకోలేకపోయిన మీ అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికే తెలంగాణపై విషం చిమ్ముతున్నారా? అని ప్రశ్నించారు. ఇది తెలుగుదేశం పార్టీ అధికారిక వైఖరా? లేక ఆ ఎంపీల సొంత పైత్యమా? అని డిమాండ్ చేశారు.
పాత గాయాలను రేపాలని చూస్తే ఊరుకునేది లేదని, ప్రతి అంశంపై పార్లమెంట్ సాక్షిగా చర్చకు తాము సిద్ధమని సవాల్ విసిరారు:
* వెన్నుపోటు రాజకీయం: డిసెంబర్ 9 ప్రకటన దగ్గరి నుండి టీడీపీ పెట్టిన ప్రతి మోకాలడ్డంకుపై చర్చ చేద్దాం.. సిద్ధమా?
* నీటి దోపిడీ: కృష్ణా జలాల్లో ఆంధ్రా సాగిస్తున్న దోపిడీపై బహిరంగంగా నిగ్గు తేలుద్దాం.. దమ్ముందా?
* శిఖండి పాత్ర: తెలంగాణ రాజకీయాల్లో ‘శిఖండి’ పాత్ర పోషిస్తూ ఇక్కడి అభివృద్ధిని అడ్డుకుంటున్న మీ కుట్రలపై చర్చకు వస్తారా?
పార్లమెంట్లో ఇంత జరుగుతున్నా తెలంగాణకు చెందిన కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు ఎందుకు నోరు విప్పడం లేదని శ్రవణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరికి భయపడి మిన్నకుండిపోయారు? లావు కృష్ణదేవరాయలను అక్కడికక్కడే ఎందుకు నిలదీయలేకపోయారు? మీ మౌనం తెలంగాణ ఆత్మగౌరవానికి తీరని ద్రోహం అని హెచ్చరించారు.
“వట్టి మాటలు కట్టిపెట్టోయ్.. గట్టి మేలు తలపెట్టోయ్” అన్న గురజాడ మాటలను గుర్తు చేస్తూ.. మీ అతి తెలివినంతా ఆంధ్ర అభివృద్ధి కోసం వాడుకోవాలని హితవు పలికారు. ప్రాంతాలుగా విడిపోయినా ప్రజలు అన్నదమ్ముల్లా కలిసి బతుకుతుంటే, మీ చిల్లర రాజకీయాల కోసం చిచ్చు పెట్టొద్దని వార్నింగ్ ఇచ్చారు. తెలంగాణ ప్రజలను అవమానిస్తే తెలంగాణ సమాజం తగిన గుణపాఠం చెబుతుందని, “ఖబడ్దార్.. తస్మాత్ జాగ్రత్త!” అని హెచ్చరించారు.