-
నీ వెనుక 11 అనే దరిద్రం ఉందంటూ వైసీపీతో బంధంపై పరోక్షంగా విసుర్లు
-
సోషల్‌మీడియాలో పేలుతున్న సెటైర్లు
( మార్తి సుబ్రహ్మణ్యం)
ఒకప్పుడు తమ కోడి కూస్తే తప్ప తెల్లారదన్న గర్వంతో మీడియా మిడిసిపడేది. తమ ఆలోచన ప్రకారమే ప్రపంచం ఆలోచించాలనే అహంకారంతో విర్రవీగేది. తమ పత్రికలు/చానెల్‌లో వచ్చిందే జనం నమ్ముతారన్న భ్రమల్లో బతికేవి. మొత్తంగా.. రాజగురువులు గీరిన గీత లోపలే జనం ఆలోచన పరిమితమయ్యేది. ఆమేరకు చేసిన శ్రమదానంతో.. పాలకుల నుంచి పవర్‌ప్రాజెక్టులు, లైవ్ టెలికాస్టుల నజరానాలు అందుకునేవి. కానీ ఇప్పుడు రింగ్ రివర్సయింది.
మీడియాకు… అంటే ఎలక్ట్రానిక్ మీడియా.. ప్రింట్ మీడియాకు మొహమాటం ఉంటుందేమో కానీ, సోషల్‌మీడియాకు అస్సలు ఎవరితోనూ మొహమాటం ఉండదు. నిజం వెల్లడిస్తే తమకు పాలకులు యాడ్స్ ఇవ్వరన్న భయం ఉండదు. నిజాలు రాస్తే తమకు నాయకులు క్యాలెండర్, డైరీ యాడ్స్ ఇవ్వరేమోనన్న వెరపు ఉండదు. బుల్లెట్ దిగిందా? లేదా? అన్నదే ముఖ్యం.
ప్రింట్-ఎలక్ట్రానిక్ మీడియాకు యాడ్స్ పితలాటకం వల్ల నిజాలు దాచవచ్చు. వారితో ఉన్న అనేక బంధాల కారణంగా, నిజాలు చెప్పే ధైర్యం చేయకపోవచ్చు. అందులో కుల-మత మోహమాటాలూ, ఇంకా అనేక బాదరాయణ బంధాలూ ఉండవచ్చు. కానీ అలాంటి లంపటాలు సోషల్ మీడియాకు ఉండవు.
అందుకే ప్రింట్-ఎలక్ట్రానిక్ మీడియా కంటే, సోషల్‌మీడియా గాలికంటే వేగంగా జనంలోకి వెళుతుంది. ఫలితంగా పాలకులు తమ తప్పులు దిద్దుబాటు చేసుకుంటున్న పరిస్థితి. సూటిగా చెప్పాలంటే.. ఇప్పుడు మోతుబరి మీడియా అని చెప్పుకునే పెద్ద మీడియా సంస్థలకు సైతం.. సోషల్ మీడియా వార్తలే దిక్కు.
అంత పవర్‌ఫుల్ సోషల్‌మీడియాలో ఇప్పుడు పుష్ప అల్లు అర్జున్‌కు సంధించిన ఒక ఆసక్తికరమైన ‘అంకెల అనుబంధం’ తెగ చక్కెర్లు కొడుతోంది. అర్జున్ లెవల్ ఇప్పుడు హిమాలయమంత ఎత్తులో ఉంది. అయితే ఆయన లెవల్ ఇప్పుడు ‘లెవెన్’ అంటూ.. ఆ లెవెన్‌తో.. అర్జున్‌కు ఉన్న అనుబంధాన్ని సవివరంగా, వ్యంగ్యంతో కూడిన వివరణతో జనంలో నిలిచింది.
గత ఎన్నికల ప్రచారంలో జనసేనాధిపతి పవన్ కల్యాణ్.. టీడీపీ-బీజేపీతో కలసి కూటమిగా పోటీ చేశారు. అయితే ఆ సమయంలో పవన్ బంధువైన అల్లు అర్జున్.. నంద్యాలలో వైసీపీ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న తన మిత్రుడు శిల్పా గెలుపు కోసం ప్రచారం చేయడం వివాదంగా మారింది. సరే.. ఆ ఎన్నికల్లో అర్జున్ మిత్రుడు ఓడిపోయానుకోండి. అది వేరే విషయం.
సినిమా భాషలో సీన్ కట్ చేస్తే.. సంధ్య థియేటర్‌లో పుష్ప సినిమా చూసేందుకు అర్జున్ వచ్చిన సమయంలోనే, ఒక మహిళ తొక్కిసలాట జరిగి చనిపోయింది. ఆమె కుమారుడు ఇప్పుడు చావుబతుకులతో పోరాడుతున్నాడు. దానితో పోలీసులు అర్జున్‌పై కేసు పెట్టి, చంచల్‌గూడ జైలుకు పంపించిన విషయం తెలిసిందే.
అయితే దీనికి సంబంధించిన 11 అంకె.. ఇప్పుడు సోషల్‌మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ‘‘ కర్మ సిద్ధాంతం ఇలాగే ఉంటుంది. సొంత పవర్‌ను వదిలి అద్దె లెవన్‌కు వెళ్లినప్పటి నుంచే ఈ దరిద్రాలు. అల్లు అర్జున్‌కు 2011లో పెళ్లయింది. ఆయన మే 11న నంద్యాల వెళ్లాడు. సంధ్య థియేటర్‌లో ఘటన 11 గంటలకు జరిగింది. ఆయనను ఏ-11గా కేసులో చేర్చారు. ఉదయం 11 గంటలకు పోలీసుస్టేషన్‌కు రావాలని పోలీసులు నోటీసులు ఇచ్చారు. నీ వెనుక 11 అనే దరిద్రం ఉంది. అది పోతేగానీ నువ్వు గట్టెక్కవ్ పుష్ప’’ అంటూ పెట్టిన ఒక పోస్టు సోషల్‌మీడియాను షేక్ చేస్తోంది.
నీ వెనుక 11 అనే దరిద్రం ఉందన్న ఆ వ్యాఖ్య.. జగన్ నాయకత్వంలోని వైసీపీకి గత ఎన్నికల్లో వచ్చిన 11 సీట్లను గుర్తు చేస్తున్నట్లు అర్ధమవుతూనే ఉంది. అంటే నంద్యాలలో వైసీపీ అభ్యర్ధి ప్రచారానికి వెళ్లిన దగ్గర నుంచి, అర్జున్‌కు దరిద్రం పట్టిందన్నది సోషల్‌మీడియా సైనికుల కవి హృదయంగా కనిపిస్తోంది.