(మార్తి సుబ్రహ్మణ్యం)
‘నీ మిత్రులెవరో చెప్పు. నువ్వు ఎలాంటివాడివో నేను చెబుతా’నంటాడు ఓ మేధావి అవతలివ్యక్తితో. ఇప్పుడు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ఏడాదిపాలన చూసిన తర్వాత, మీడియాను ఫాలో అయ్యేవర్గాలకు, మేధావులు, విద్యావంతులకు వచ్చే ప్రశ్న కూడా ఇలాంటిదే. రేవంత్ రెక్కల కష్టంతో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వంపై, సామాన్య-మధ్య తరగతి ప్రజలు ఎన్నికల ముందు పెట్టుకున్న ఆశలు వేగంగా ఆవిరవడం ఆందోళకరం.
దానికి కారణం రేవంత్‌రెడ్డి పూర్వాశ్రమంలో ఏనాడూ పాలనలో భాగస్వామి కాదు. అలాగని ఆయన పక్కన నిత్యం ఫొటోల్లో కనిపించే వారు, అంతకంటే అనుభవం ఉన్నవారు కాదు. ఇంకా రేవంతకయినా.. స్థానిక సంస్థల ప్రతినిధి నుంచి, చట్టసభల పార్లమెంటు ప్రజాప్రతినిధి వరకూ వివిధ స్థాయిలో పనిచేసిన అనుభవం ఉంది. మరి జగన్‌రెడ్డి, కేజ్రీవాల్ అండ్ అదర్స్ కూడా.. ఎలాంటి అనుభవం లేకపోయినా సీఎంలయ్యారు కదా? అని ప్రశ్నించవచ్చు.
వారి కథ, నేపథ్యం వేరు. వారివి ప్రాంతీయపార్టీలు. రాజు-భటులూ వారే. కేజ్రీవాల్‌కు అధికారిగా ప్రభుత్వంలో పనిచేసిన అనుభవం ఉంది. ఇక జగన్‌రెడ్డిది రాజకీయ వారసత్వం. వారి వద్ద రాజకీయాలలో అనుభవం గడించిన వారున్నారు. వైఎస్‌కు కెవిపి ఒక తిరుగులేని ఆస్తి.
లెక్కకుమించిన సీనియర్ నాయకులు కుడి ఎడమ ఉండనే ఉన్నారు.
మరి రేవంత్‌రెడ్డి దగ్గర అలా చెప్పుకునేందుకు, కష్టాల నుంచి గట్టెక్కించే బృహస్పతులు ఇప్పటిదాకా ఎవరున్నారు? సలహాదారుగా నియమితులైన వేం నరేందర్‌రెడ్డి రాజకీయ అనుభవం, స్థాయి ఏమిటో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ఆయన కోసమే ఓటుకునోటు కేసులో రేవంత్ జైలుకు వెళ్లినందున, ఆ ‘సానుభూతి కోటా’లోనే సలహాదారు పదవి దక్కించన్నది నిష్ఠుర నిజం. ఆయన టీడీపీలో ఎమ్మెల్యేగా చేసినప్పుడు, కనీసం తన జిల్లాను కూడా ప్రభావితం చేసిన నేత కూడా కాదు. ఇదే కేసులో మరో సహచరుడైన ఉదయసింహకు, ఎలాంటి పూర్వానుభవం లేకున్నా, ఢిల్లీలో పదవి దక్కిందంటే అది కూడా సానుభూతి కోటాలోనే అన్నది నిర్వివాదం. అంటే ఇవన్నీ ప్రతిభ కోటాతో కాకుండా రేవంత్ వ్యక్తిగత కోటా కింద దక్కిన పదవులే. సీనియర్ నేత కేకే ఉన్నప్పటికీ ఆయన సలహాలు, అనుభవం ఎంతవరకూ వాడుకుంటున్నారో తెలియదు.
ఇక ప్రతిరోజూ రేవంత్చుట్టూ కనిపించే ఒకరిద్దరి స్ధాయి ఏమిటన్నది బహిరంగ రహస్యమే. ఇవన్నీ ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే.. వారి మేధస్సు రేవంత్ పాలనకు ఏమాత్రం సహకరించడం లేదని, వారి ఎంపికలో మెరిట్ లేదని చెప్పడానికే. నిజానికిది పార్టీ వర్గాల్లో బహిరంగంగా జరుగుతున్న చర్చనే. అందుకే రేవంత్ నిర్ణయాలు ప్రజలను మెప్పించకపోగా, వ్యతిరేక పోగయ్యేందుకు కారణమవుతున్నాయన్నది కాంగ్రెస్‌లో జరుగుతున్న ఒక చర్చ.
కాకపోతే.. మునుపటి మాదిరిగా కాంగ్రెస్‌లో నోరుపారేసుకున్న సీనియర్లు, ఇప్పడు క్రమశిక్షణలో ఉన్నారు. అది కాంగ్రెస్‌కు సంబంధించినంత వరకూ అద్భుతమే. వైఎస్, రోశయ్య లాంటి ప్రముఖులకే తలనొప్పి సృష్టించిన వారిని, మౌనంగా ఉంచడం రేవంత్‌కే చెల్లింది. ఈ రకంగా కాంగ్రెస్‌ను క్రమశిక్షణలో పెట్టిన ఒక్క సీఎం కూడా చరిత్రలో కనిపించరు. ఆ ఘనత యువనేత రేవంత్‌కే దక్కడమే విశేషం. కారణం.. మంత్రుల శాఖల్లో జోక్యం చేసుకోకపోవడమేనంటున్నారు.
ఇటీవల నిర్వహించిన దివంగత మాజీ సీఎం రోశయ్య సంస్మరణ సభలో, ‘‘ఇప్పుడు రోశయ్య లాంటి సహచరులు లేకపోవడం పెద్ద లోటు’’ అని స్వయంగా రేవంత్‌రెడ్డి, తన మనసులో మాట బయటపెట్టడాన్ని విస్మరించకూడదు. బహుశా తన వద్ద రోశయ్య లాంటి తిమ్మరసు లాంటి సమర్ధులు లేరన్న ఆవేదన, ఆయన కవి హృదయంగా అర్ధమవుతుంది.
రేవంత్ సమర్ధుడైన నేత. మాటలమరాఠా. తెలంగాణలోని ఇద్దరు ముగ్గురు క్రౌడ్పుల్లర్లలో ఒకరు. ఆయనకు సొంత చరిష్మా, యంత్రాంగం ఉంది. సుదీర్ఘకాలం టీడీపీలో స్వేచ్ఛ ‘తీసుకుని’.. సుదీర్ఘకాలం పనిచేసిన రేవంత్ ప్రతిభాపాటవాలు, అప్పట్లో ఆయనతో సాన్నిహిత్యంగా వ్యవహరించిన మా లాంటి జర్నలిస్టులకు తెలిసిందే. డిమాండ్-సప్లయ్ సూత్రం ప్రకారం పనిచేసే రేవంత్.. ఏనాటికైనా ఉన్నత స్థానానికి చేరుకుంటారని, అప్పుడే చాలామంది అంచనా వేసేవారు.
ఇవన్నీ నిజమే. కానీ పార్టీ మారి వచ్చిన ఆయనకు, కాంగ్రెస్‌లో తనకంటూ సొంత బలం లేదు. ఎందుకంటే రేవంత్ ‘పుట్టు కాంగ్రెస్‌వాది’ కాదు. పీసీసీ చీఫ్ మహేష్, మంత్రి పొన్నం మాదిరిగా పార్టీ ఆర్గనైజేషన్‌లో అనుభవం ఉన్న నేత కాదు. వారంతా పుట్టు కాంగ్రెస్ నేతలు.
ఇప్పుడు మంత్రివర్గంలో ఉన్న సీనియర్లంతా ‘పుట్టు కాంగ్రెస్’ నేతలే.
అలాంటి పార్టీలో.. సీఎం రేసులో ఉన్నవారందరనీ, తన మేధస్సు-చాకచక్యంతో వెనక్కినెట్టి ఆ పదవి సాధించినప్పటికీ, రేవంతుది ఇప్పటికీ అభద్రతాభావమేనన్నది సీనియర్ల ఉవాచ. సీనియర్ మంత్రులను శాసించలేని మొహమాటం. ఒక సీఎంగా వారి శాఖల్లో నేరుగా జోక్యం చేసుకోలేని ఇరకాటం. కాకపోతే సీఎం కావాలన్న తన జీవితలక్ష్యం నెరివేరింది కాబట్టి, కాంగ్రెస్ భాషలో చెప్పాలంటే.. ఇక ఇప్పటినుంచి ఆయనకు, మిగిలిన కాలం బోనస్ కిందే లెక్క.
ఈ కారణంగానే సీనియర్ మంత్రులెవరూ ‘ఇది రేవంత్ ప్రభుత్వం సాధించిన విజయం’గా చెప్పరు. కాంగ్రెస్ ప్రభుత్వ విజయం, రాహుల్ ఆదేశాలతో అమలుచేస్తున్నామనే చెబుతారు. ఏడాదిలో 55 వేల ఉద్యోగాలు, 21 వేల కోట్ల రుణమాఫీ, మహిళలకు ఉచిత బస్సు, పేదలకు ఉచిత విద్యుత్ పథకాలు అమలుచేస్తున్నప్పటికీ.. వాటిని అమలుచేసిన రేవంత్‌కు, రావసినంత మైలేజీ రాకపోవడానికి సీనియర్ల సహకారం లేకపోవడమేనన్నది నిర్వివాదం. ఇది సోనియమ్మ ప్రభుత్వమనే చెబుతున్నారే తప్ప, రేవంత్ ప్రభుత్వమని చెబుతున్న వారు లేరు.
ఇటీవల రుణమాఫీ ప్రకటించిన తర్వాత.. జిల్లాల్లో రేవంత్ చిత్రపటాలకు పాలాభిషేకాలు చేస్తారని చాలామంది ఊహించారు. జిల్లాల్లో పార్టీ నేతలు దాన్నో పండుగలా చేస్తారని ఆశించారు. కానీ రేవంత్‌తో వ్యక్తిగత సంబంధాలున్న నేతలు మాత్రమే, కాస్త హడావిడి చేయడాన్ని విస్మరించకూడదు. సీనియర్ల నియోజకవర్గాల్లో ఆ ఛాయలేవీ కనిపించకపోవడాన్ని విస్మరించకూడదు.
ఇక సీఎంపై వ్యక్తిగతంగా విపక్షాల మాటలదాడిని ఎదుర్కొనే మంత్రులూ లేరు. ఎంతసేపటికి రేవంత్‌తో పార్టీలో చే రిన మంత్రి సీతక్క, కొంతమంది ఎమ్మెల్యేలు, అరడజను కార్పొరేషన్ చైర్మన్లు తప్ప, సీనియర్లెవరూ దన్నుకు రాని పరిస్థితి. గత కొద్దికాలం నుంచి రేవంత్‌రెడ్డి సోద రుల లక్ష్యంగా విపక్షాలు విరుచుకుపడుతున్నాయి. లగచర్లలో భూ సేకరణ, సొంత గ్రామమైన కొండారెడ్డిపల్లెలో సోదరుల దాష్టీకానికి కాంగ్రెస్ మాజీ సర్పంచ్ సాయిరెడ్డి ఆత్మహత్య చేసుకున్న వైనం వివాదం సృష్టించింది.
ఆ ఘటనలో కూడా రేవంత్ వల్ల వ్యక్తిగతంగా లబ్థిపొందిన వారు, బీఆర్ఎస్పై ఎదురుదాడి చేశారే తప్ప, మంత్రివర్గంలో ఉన్న పెద్ద తలలెవరూ రేవంత్‌కు దన్నుగా నిలబడి ఎదురుదాడి చేయలేదు. బహుశా ఈ కారణంతోనే.. రోశయ్య లాంటి సహచరుడు లే కపోవడం లోటని, రేవంత్ నిర్వేదంగా వ్యాఖ్యానించినట్లు అర్ధమవుతుంది.
నిజానికి ఇప్పుడున్న సీనియర్ల స్ధాయి కూడా అది కాదు. అరడజను మంది మంత్రులు సీఎం స్థాయి నాయకులే. ఢిల్లీతో నిరంతర సంబంధాలున్న ‘పుట్టు కాంగ్రెస్’ వాదులే. కాబట్టి, రేవంత్ సీఎంగా ఉన్నంత మాత్రాన, ఆయన సోదరులపై విపక్షాల ఆరోపణలను మీదేసుకుని ఖండించలేరు. కాకపోతే కోమటిరెడ్డి, పొన్నం ప్రభాకర్ వంటి ఒకరిద్దరు మంత్రులు మాత్రమే, ఇటీవల అల్లు అర్జున్‌కు వ్యతిరేకంగా, రేవంత్‌ను సమర్ధిస్తూ మాట్లాడటం కొద్దిగా ఊరట.
సరే ముందుగా అనుకున్నట్లు.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందే రేవంత్ రెక్కల కష్టంమీదన్నది, మనం మనుషులం అన్నంత నిజం. రేవంత్ లేకపోతే.. తుపాకికి సైతం దొరకని, నిర్జీవంగా ఉన్న కాంగ్రెస్‌కు ఊపిరిపోసి, ఐసియులో ఉన్న పార్టీకి ఆక్సిజన్ ఇచ్చి మారథాన్ క్రీడాకారుడి మాదిరిగా జనక్షేత్రంలో పరుగులు పెట్టేది కాదు. ఈ ఘనత నిస్సందేహంగా రేవంత్‌దే.
ఏడాది పాలనలో అన్నింటా బాహుబలి మాదిరిగా రేవంతే కనిపిస్తారు. ఇప్పటికీ కాంగ్రెస్‌కు రేవంతే దిక్కు. బహుశా ఆ కారణంతోనే ఆయనపై యుద్ధం చేస్తున్న బీఆర్ఎస్.. ‘రేవంత్‌లో మార్పు తీసుకురండి . లేకపోతే రేవంత్‌ను మార్చండ’ని రాహుల్‌గాంధీని కోరుతున్నారు. అంటే పార్టీకి బాహుబలిగా ఉన్న ఒక్క రేవంత్‌ను తప్పిస్తే చాలు.. కాంగ్రెస్ సర్కారు కుప్పకూలడం, తాము అధికారంలోకి రావడం ఖాయమన్నది గులాబీదళాల అసలు ఆశ. అందుకే విపక్షమైన బీఆర్ఎస్ నాయకులు..అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని కాకుండా, ఆ పార్టీ నియమించిన సీఎం రేవంత్‌ను లక్ష్యంగా చేసుకుని అస్త్రాలు సంధిస్తున్నారు.
ఇక ఎన్నికల ముందు ఇచ్చిన ప్రధాన హామీలలో, ఇంకా ప్రధానమైనవి అసంపూర్తిగానే మిగిలిపోయాయి. ప్రజలు ఐదేళ్లకు అధికారం ఇచ్చినందున, ఆ కాలవ్యవధిలో వాటిని పూర్తి చేయాల్సి ఉంది. అలాగని ‘‘ఐదేళ్లలో ఎప్పుడైనా వాటిని పూర్తి చేస్తాం. అడగటానికి మీరెవర’’ని ఎదురుదాడి చేసే అవకాశం లేదు. అయితే ప్రస్తుత ఒట్టిపోయిన ఖజానా చూస్తే.. ఇచ్చినామీలన్నీ సంపూర్ణంగా అమలుచేయడం ప్రశ్నార్థకంగానే కనిపిస్తోంది. అటు ఢిల్లీ నుంచి సహకారం శూన్యం.
రేవంత్ ఢిల్లీకి వెళ్లివస్తున్నా, ఒక్క పనీ సాధించలేకపోతున్నారన్న విమర్శలు ఇప్పటికే లేకపోలేదు. ‘రేవంత్ ఢిల్లీ ఖర్చులకు సరిపడా కూడా నిధులు రావడం లేద’ని విపక్షాలు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్న పరిస్థితి. ఈవిధంగా మరో నాలుగేళ్లు సర్కారు బండిని నడపడం రేవంత్‌కు కత్తిమీద సామే.
ఈ సందేహాలకు స్వయంగా రేవంత్ తెరదించారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో చేసిన అప్పుల వల్లే మా ఆరుగ్యారెంటీలు అమలుచేయలేకపోతున్నామని రేవంత్ అసెంబ్లీ సాక్షిగా మనసులోమాట బయటపెట్టారు. కాబట్టి.. మిగిలిన పథకాల అమలు చేయడం కష్టమేనని సీఎం హోదాలో చెప్పకనే చెప్పినట్లన్నమాట. అంటే ఇక మిగిలిన నాలుగేళ్లు రాజకీయ వ్యవహారాలు, ఎత్తుగడలతోనే లాగించేస్తారేమో చూడాలి.
ఇక విపక్షనేతగా ఉన్నప్పుడు రేవంత్ చేసిన లెక్కలేనన్ని డిమాండ్లు.. సీఎం అనే వ్యక్తి అమలుచేయడం ఎంత కష్టమోనన్నది ఇప్పుడు అనుభవంలోకి గానీ తెలిసిరాలేదు. అదానీతో కుదుర్చుకున్న ఒప్పందాలను ఒక్కసారిగా రద్దు చేసుకోవడం అంత సులభం కాదని, దానికి పాలనాపరమై సమస్యలున్నాయని చెప్పకనే చెప్పారు. అంటే అనుభవమైతే గానీ తత్వం బోధపడలేదన్నమాట. విపక్షనేత-సీఎం పాత్రల్లో తేడా అదే మరి!
విపక్షాలు అధికారంలోకి వచ్చిన పార్టీని, మీ హామీలు ఏమయ్యాయని నెలరోజులు నుంచే వెంటపడుతుండటం సహజం. ఆ పని గతంలో కాంగ్రెస్ కూడా చేసిందే. ఇప్పుడు బీజేపీ,బీఆర్ఎస్ ఆ పని చేస్తున్నాయి. అంతే తేడా! ప్రధానంగా రైతులకు ఇచ్చిన హామీల అమలు కాంగ్రెస్‌కు ప్రమాదకరమే. కాకపోతే బీజేపీలోని రెండువర్గాల్లో ఒక వర్గం బీఆర్ఎస్కు వ్యతిరేకంగా ఉంటే, మరో వర్గం రేవంత్‌కు అనుకూలంగా ఉండటం కొంత ఊరట.
ఎందుకంటే జనం ఆశలు అనంతం. కేసీఆర్ విజటబుల్బిర్యానీ పెట్టారు. నేను చికెన్ బిర్యానీ పెడతానని రేవంత్ ఆశచూపితేనే, జనం కాంగ్రెస్‌కు జైకొట్టారు. ఇప్పుడు కనీసం ఆ విజటబుల్ బిర్యానీ కూడా పెట్టడం లేదని, జనం పెదవి విరుస్తున్న వైనం. రైతుబంధును క్రమం తప్పకుండా తీసుకున్న వారికి.. ఇప్పుడు సెల్ఫోన్లలో ఠంగుఠంగుమని వచ్చే ‘డబ్బు సౌండ్లు’ రావడం లేదు. రైతుల్లో నెలకొన్న ఈ అసంతృప్తి రాను రాను పెరిగేదేగానీ తరిగేది కాదు.
హాస్టళ్లలో గత కొద్దినెలల నుంచి శరపరంపరగా జరుగుతున్న విషాద ఘటనలు, రేవంత్ సర్కారుకు మాయనిమచ్చ అన్నది నిర్వివాదం. హాస్టల్ పిల్లలు ఎలుకలు కొరకడంతో ఆసుపత్రి పాలైన ఘటన దారుణం. గత కొద్ది నెలల నుంచి ఫుడ్‌పాయిజన్‌తో చిన్నారులు ఆసుపత్రుల్లో చేరుతున్న విషాదాలు, రేవంత్‌పై ఉన్న నమ్మకాన్ని దారుణంగా దెబ్బతీస్తున్నాయి. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారులను మీడియాలో చూసే ప్రజలకు, రేవంత్ పాలనపై ఆగ్రహం కలగడం సహజమే కదా? రేవంత్ స్థానంలో ఎవరున్నా అంతే.
అల్లు అర్జున్ ఎపిసోడ్లో నగర నడిబొడ్డులో, ఆయన ఇంటిపైకి దాడి చేసిన వైనం.. రాష్ట్ర రాజధానిలోనే లా ఆర్డరులోలేదని చెప్పకనే చెబుతుంది. ఆ కేసుతో సంబంధం లేని పోలీసు అధికారి నిర్భయంగా ప్రెస్‌మీట్ పెట్టి హెచ్చరికలు జారీ చేసిన వైనం, రేవంత్‌కు పాలనపై పట్టుతప్పుతుందన్న సంకేతాలిచ్చేవే. కాకపోతే అర్జున్ ఎపిసోడ్లో ఇకపై సినిమాలకు రేట్ల పెంపు, అదనపు షోలు ఉండవని ప్రకటించటం మెచ్చదగిందే. అసలు ఈ ఎపిసోడ్ తర్వాత సినిమా వాళ్ల పొగరు అణచివేసిన మగాడు అన్న ప్రశంసలు కూడా వినిపించకపోలేదు. అది వేరే విషయం.
అసలు హాస్టళ్ల భవనాలకు అద్దె చెల్లించే దిక్కు లేని సర్కారు, భవన యజమానులను బెదిరించడమే వింత. అలా బెదిరించే నైతిక హక్కు-అర్హత పాలకులకు ఉందా అన్నదే ప్రశ్న. వినియోగదారులు బిల్లులు చెల్లించకపోతే, విద్యుత్ శాఖ కరెంట్ కట్ చేస్తుంది. మున్సిపల్ కాంప్లెక్సుల్లో కిరాయిదారులు అద్దె చెల్లించకపోతే నోటీసులిచ్చి ఖాళీ చేయిస్తారు. మరి తమ భవనాలకు ఏళ్ల నుంచి అద్దెలు కట్టనందున, హాస్టళ్లకు తాళాలు వేస్తే తప్పేమిటన్నది ఒక వాదన. వారికి అద్దెలు చెల్లిస్తే ఈ అవమానం ఉండేది కాదు కదా? అలాకాకుండా, దానిని ప్రతిష్ఠగా భావించడమే అవివేకం.
అద్దెలు కట్టని హాస్టల్ భవనాలకు యజమానులు తాళాలు వేస్తే, పిల్లలు రోడ్డునపడుతున్న దారుణ దృశ్యాలు మీడియాలో దర్శిస్తున్నవే. ఈ అంశాన్ని తెరపైకి వచ్చి, సర్కారు మెడలు వంచడంలో బీఆర్ఎస్ సక్సెస్ అయింది. అద్దెలు కట్టకుండా, మెస్ బిల్లులు చెల్లించకుండా హాస్టళ్ల పిల్లలను ఆరోగ్యవంతులను ఎలా చేస్తారు? ఆసుపత్రులపాలు కాకుండా ఎలా ఆపుతారు?
అదొక్కటే కాదు. లక్షల రూపాయల్లో ఉన్న బిల్లులు కూడా మంజూరుకానంత భయానకస్థితి ఖజానాను వెక్కిరిస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్లో, కొత్తగా పనులు చేసేందుకు ఏ కాంట్రాక్టరూ సాహసించడం లేదు. ఇప్పటికే వారికి వందలకోట్ల బకాయిలు పెండింగ్‌లో ఉండటమే దానికి కారణం. రాజధాని నగరంలో ఏరియా ఆసుపత్రుల్లో దూదికి కూడా దిక్కులేని దుస్థితి. కొన్ని ప్రభుత్వ విభాగాల్లో అయితే.. గత నాలుగు నెలల నుంచి జీతాలు రాని దుస్థితి ఉందంటే, ప్రభుత్వ ఖజనా ఎంత వట్టిపోయిందో అర్ధం చేసుకునేందుకు మేధావులే కానక్కర్లేదు. చటాకంత తెలివుంటే చాలు.
అయితే పాలకులకు కావలసిన బడా కాంట్రాక్టర్లకు వందలకోట్లు ఎలా చెల్లిస్తున్నారంటే, దానికి కారణం ‘మామూలే’. బిల్లుల చెల్లింపుల్లో కమిషన్ల రాజ్యం ఏలుతోందని, 8 నుంచి 15 శాతం కమిషన్లు తీసుకుని బిల్లులు ఇస్తున్నారన్న విమర్శలు బహిరంగ రహస్యమే. అధికార వియోగంలో ఉన్న జాతీయ కాంగ్రెస్ పార్టీ ‘మంచి చెడ్డ’లన్నీ, కర్నాటక-తెలంగాణ రాష్ట్రాలే చూసుకోవాలి మరి! అయినా ఆ బాదరబందీలన్నీ, రేవంత్ ఇద్దరు మంత్రులకే వదిలేశారని వినిపిస్తున్న వార్త.
బీఆర్ఎస్ రోడ్డెక్కిన తర్వాతనే, సీఎం, మంత్రులు హాస్టళ్లకు వెళ్లి పిల్లలతో కలసి భోజనం చేయడమే దానికి నిదర్శనం. ఆ తెలివేదో ముందే ఉంటే, విపక్షాలకు అస్త్రాలు ఇచ్చేవారు కాదుకదా? మరి అలాంటి సలహాలిచ్చే బృహస్పతులు రేవంత్ టీములో ఎవరున్నారు? అంటే క్యాబినెట్ లో- బయట ఉన్న కాంగ్రెస్ పెద్దతలలు, రేవంత్‌కు సలహాలు ఇవ్వడం లేదా? లేదా ఆయనే ఎవరినీ అడగడం లేదా? మరి ఏరికోరి నియమించుకున్న తన మిత్ర సలహాదారు ఏం సలహాలిస్తున్నట్లు?.. ఇవీ ఇప్పుడు సహజంగా మెదడున్న ప్రతి ఒక్కరికీ వచ్చే సందేహాలు.
హాస్టళ్లపై బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కుట్ర ఉందంటూ, మంత్రి సీతక్క ప్రకటన.. విద్యావంతులు, యువకులు, మేధావులు, తటస్థులను ఏమాత్రం మెప్పించదు. ఒకవేళ ప్రవీణ్ అనే నాయకుడు హాస్టళ్లపై కుట్రలు చేస్తుంటే, దాన్ని అడ్డుకోకుండా మీ ప్రభుత్వం ఏం చేస్తోంది? దానిని కనిపెట్టి పాలకులను హెచ్చరించకుండా, మీ నిఘా విభాగం గుడ్డిగుర్రానికి పళ్లుతోముందా? అదే నిజమైతే ఒక్క సాక్ష్యం కూడా ఎందుకు ప్రవేశపెట్టలేకపోయారు?
నిజంగా అంత భారీ కుట్ర జరిగి ఉంటే, ప్రభుత్వంగా-పార్టీగా కాంగ్రెస్ ఇప్పటిదాకా మౌనంగా ఎందుకుంది? అన్న ప్రశ్నలు మెడపై తల ఉన్న ఎవరికయినా రావడం సహజం. పౌరసమాజం అంత సుషుప్తావస్ధలో ఉందని భ్రమిస్తే ఎలా? ఇక రేవ ంత్ నుంచి మంత్రుల వరకూ.. గత కేసీఆర్ సర్కారు వైఫల్యాలనే రామకోటిగా జపించడమే వింత. ఆయన పాలన దారుణంగా ఉందనే కదా రేవంత్‌ను చూసి జనం కాంగ్రెస్‌ను గెలిపించింది? ఆయన కుటుంబపాలన చేశారన్న కోపంతోనే కదా మీకు అధికారం అప్పగించింది?
మరి ఈ ఏడాదిలో మీరేం చేశారో, ఏం చేస్తారో చెప్పకుండా.. అధికారంలోకి వచ్చి ఏడాదయినా, ఇంకా కేసీఆర్ నామస్మరణ చేయడమే ఆశ్చర్యం. జనాలకు ఆ వాదన నచ్చదు. మిమ్మల్ని గెలిపించాం కాబట్టి, మీరు ఏం చేసైనా సరే మా బాధలు తీర్చాలన్నదే జనం సైకాలజీ. అందుకు భిన్నంగా.. కేసీఆర్ తప్పులను సరిదిద్దుతున్నాం.. కేసీఆర్ చేసిన అప్పులకు వడ్డీలకే సరిపోతుంది.. మోదీ సహకరించడం లేదంటే జనం ఒప్పుకోరు. అయినా ఒక ప్రభుత్వం చేసిన అప్పులను, వచ్చే ప్రభుత్వం తీర్చడం సహజం. అంతోటిదానికి మీరెందుకు? ఆ కేసీఆరే ఉంటే పాత పథకాలయినా కొనసాగించేవాళ్లు కదా? అని అనుకోరూ?!
వీటితో కాంగ్రెస్‌కు వచ్చే నష్టమేమీలేదు. వ్యక్తిగతంగా రేవంత్ ఇమేజీకే డ్యామేజీ. ఎందుకంటే రేవంత్‌ను చూసి కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకువచ్చారే తప్ప, కాంగ్రెస్‌ను చూసి జనం ఓటేయలేదన్నది నిష్ఠుర నిజం. కాబట్టి ఈ ఏడాదిలో లాభనష్టాలన్నీ రేవంత్ ఖాతాలోకే వెళ్లడం సహజం.
వ్యూహరచనలో దిట్టగా పేరున్న కాంగ్రెస్.. ఎందుకో గత ఏడాది నుంచి సరైన వ్యూహం లేక, చతికిలపడుతున్న వైచిత్రి. అందుకే బీఆర్ఎస్, బీజేపీకి వ్యతిరేకంగా పన్నిన ఒక్క వ్యూహం కూడా ఫలించలేదు. ఫోన్ ట్యాపింగ్, సినిమా నటుల డ్రగ్స్, ఫార్ములా ఈ- కార్ రేస్ వంటి కుంభకోణాలన్నీ లీకులకే పరిమితయ్యాయి తప్ప, ఇప్పటిదాకా ఫలితం తేలలేదు.
తాజాగాకేటీఆర్ మంత్రిగా ఉన్నప్పుడు జరిగిందంటున్న ఫార్ములా ఈ కార్ రేస్ కుంభకోణంలో, కాంగ్రెస్ వ్యూహలేమి బయటపడింది. దానికి సంబంధించి తన వద్ద అన్ని ఆధారాలు ఉన్నప్పుడు.. వాటిని ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే చర్చకు పెట్టి, బీఆర్ఎస్ను తెలంగాణ సమాజం ముందు దోషిగా నిలబెట్టే మహదవకాశాన్ని.. రేవంత్ వంటి గొప్ప మేధావి-వ్యూహకర్త ఎందుకు జారవిడుచుకున్నారో అర్ధం కాని ప్రశ్న.
అవుటర్ రింగ్‌రోడ్‌పై విచారణ జరపాలన్న హరీష్, కేటీఆర్ డిమాండ్ మేరకే, తాము సిట్ వేస్తున్నామని చెప్పిన రేవంత్..మరి ఫార్ములా ఈ రేస్కారు అంశంపై సభలో చర్చించాలన్న అదే ఇద్దరి డిమాండ్‌ను మాత్రం, అంగీకరించకపోవడమే వింత. అటు హాస్టళ్లపై బీఆర్ఎస్ నేత ప్రవీణ్ కుట్ర ఉందని స్వయంగా మంత్రి ఆరోపించారు. వాటికి ఆధారాలను సభలో పెట్టి ఉంటే బీఆర్ఎస్ జనం ముందు ముద్దాయిగా నిలిచేది కదా? నిజానికి బీఆర్ఎస్ అవినీతిని నగ్నంగా ఆవిష్కరించి, ఆ పార్టీని రాజకీయంగా అప్రతిష్టపాలుచేసేందుకు వచ్చిన బ్రహ్మాండమైన అవకాశం అది. వాటిని బయటపెట్టి.. తమ సర్కారు దానిపై ఏసీబీతో విచారణ జరిపిస్తుందని, రేవంత్ సభలోనే ప్రకటించి ఉంటే బీఆర్ఎస్ అడ్డంగా ఇరుక్కునేది. కాంగ్రెస్ ప్రతిష్ఠ పెరిగేది.
కానీ ఇప్పుడు ఫార్ములా ఈ-రేస్‌పై సభలో చర్చించాలని అదే బీఆర్ఎస్ రివర్సులో గళమెత్తడమే ఆశ్చర్యం. దీన్నిబట్టి పాలకుల దగ్గర దానికి సంబంధించి ఆధారాలు లేవని, ఇదంతా కేవలం కేటీఆర్‌ను జైలుకు పంపించే వ్యూహమేనని మెడపై తల ఉన్న ఎవరికయినా అర్ధమవుతుంది.
ఈ ఏడాదిలో జరిగిన శాసనసభ సమావేశాలు పరిశీలిస్తే.. అధికారపక్షంపై విపక్షాలు పైచేయి సాధించినట్లు కనిపిస్తోంది. నిజానికి అధికారపక్షమే, విపక్షాలపై అధిపత్యం ప్రదర్శించాలి. అదానీ వ్యవహారం రచ్చయిన సందర్భంలో.. ఆయన స్కిల్ యూనివర్శిటీకి ఇచ్చిన వందకోట్ల రూపాయల అంశంపై బీఆర్ఎస్ గత్తర చేసింది. ఫలితంగా ఆ డబ్బులు మాకొద్దని సర్కారు లేఖ రాయాల్సి వచ్చింది.
దాన్ని ఆయుధంగా అందుకుని.. వందకోట్లు సరే.. మరి అదానీతో కుదుర్చుకున్న ఆ 12,400 కోట్ల ఒప్పందాలు, సిమెంట్ ఫ్యాక్టరీ అనుమతులు ఎందుకు రద్దు చేయటం లేదన్న బీఆర్ఎస్ మెలికతో, దానికి జవాబు చెప్పలేక కాంగ్రెస్ అష్టవంకర్లు పోతోంది. బీఆర్ఎస్ నేతలు హాస్టళ్లలో సౌకర్యాలపై విరుచుకుపడి, గురుకుల పాఠశాలలను సందర్శించి రేవంత్ సర్కారు వైఫల్యాలను తూర్పారపట్టిన తర్వాత గానీ, సీఎం-మంత్రులు మేల్కొనలేదంటే.. కాంగ్రెస్-బీఆర్ఎస్ పనితీరు, రాజకీయ వ్యూహరచన ఎలా ఉందో అర్ధమవుతుంది.
సభలో సీఎం రేవంత్‌రెడ్డి తప్ప, పాలనా-రాజకీయపరమైన అంశాల్లో విపక్షాలకు, ధీటైన సమాధానం ఇచ్చేవారే కరవయ్యారు. శాసనసభ వ్యవహారాల శాఖమంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఒక్కరే దన్నుగా ఉన్నట్లు కనిపిస్తున్నారు. అప్పుడప్పుడు భట్టి, పొన్నం, కోమటిరెడ్డి గొంతులు వినిపిస్తున్నాయంతే! అసెంబ్లీ సమావేశాలు సాధారణంగా సామాన్యులకు పెద్దగా పట్టవు. కానీ విద్యాధికులు,మేధావులు, తటస్ధులు, ఉద్యోగ వర్గాలు నిశితంగా పరిశీలిస్తుంటాయి. ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా వీరే ముఖ్యం. అంటే పాలకుల కొంప ముంచాలన్నా, కొత్తవారిని కనికరించాలన్నా ఈ వర్గాలే ముఖ్యమన్నమాట.
ఇప్పుడు సీనియర్, సమర్ధుడిగా పేరున్న మహేష్‌కుమా గౌడ్ పీసీసీ అధ్యక్షుడిగా వచ్చిన తర్వాత, రేవంత్‌పై పార్టీకి సంబంధించిన భారం తగ్గినట్లే. అంటే అటు పార్టీ-ఇటు ప్రభుత్వంలో రేవంత్‌రెడ్డే రాజు-భటుడు పాత్ర పోషిస్తున్నట్లు స్పష్టమవుతోంది. సరైన వ్యూహబృందం, అనుభవజ్ఞులు ఆయన పక్కన లేకపోవడమే దానికి కారణమన్నది కాంగేయుల ఉవాచ.
ఇక ఏడాదిలో రేవంత్ సర్కారు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి సాహసోపేత నిర్ణయాలు అమలు చేస్తున్నప్పటికీ.. ఆటో డ్రైవర్లు సర్కారు దూరమైన పరిస్థితి. 200 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్ పూర్తి స్థాయిలో అమలవుతున్న దాఖలాలు కనిపించడం లేదు. గతంలో కాంగ్రెస్, టీడీపీ, బీఆర్ఎస్ ప్రభుత్వాలు షరతులతో పథకాలు అమలుచేయలేదు. కేసీఆర్ జమానాలో ఒక్కో ఇంటికి ఇన్ని లీటర్ల మంచినీరు ఫ్రీ అని ప్రకటించారు. అందులో ఎలాంటి షరతులు లేకుండానే చెప్పినమాట ప్రకారం ఉచిత మంచినీరు ఇచ్చారు.
కానీ ఇప్పుడు ఉచితవిద్యుత్‌కు, రేషన్‌కార్డును ప్రాతిపదికగా పెట్టారు. కరెంట్ బిల్లు పెండింగ్‌లో లేకపోతేనే ఉచితవిద్యుత్ ఇస్తామన్న షరతులతో.. లక్షలమంది పేదలు ఉచిత విద్యుత్ పథకానికి దూరమవుతున్న పరిస్థితి. హైదరాబాద్, వరంగల్ వంటి పెద్ద నగరాల్లో ఈ షరతులు లక్ష లమంది పేదలను ఈ పథకానికి దూరం చేస్తోంది.
రేవంత్ తన సొంత నియోజకవర్గంలోనే పట్టు కోల్పోతున్నారని చెప్పేందుకు, చాలా ఘటనలు కళ్లెదుటె కనిపిస్తున్నాయి.ప్రధానంగా లగచర్లలో కలెక్టర్‌ను అడ్డుకున్న గిరిజన రైతులను జైలుకు పంపించడం.. తన సొంత గ్రామంలో సొంత పార్టీకి చెందిన సర్పంచ్ సాయిరెడ్డి, తన చావుకు రేవంత్ సోదరులే కారణమంటూ సూసైడ్ నోట్ రాయడం వ్యక్తిగతంగా రేవంత్ ఇమేజీకి డ్యామేజీనే. కాంగ్రెస్‌లో రెండుసార్లు సర్పంచిగా చేసిన మృతుడి ఇంటికి వెళ్లేందుకు వీల్లేకుండా, గోడ కట్టిన వైనమే ఆయన ఆత్మహత్యకు దారితీసిన వైనం.. స్థానిక ఎమ్మెల్యేగా రేవంత్‌కు అప్రతిష్ఠనే.
సహజంగా ముఖ్యమంత్రుల కుమారులపైనో, కుమార్తెలపైనో, అల్లుళ్లపైనో అవినీతి ఆరోపణలు రావడం మాత్రమే చూశాం. కానీ ఇప్పుడు రేవంత్ సీఎం అయిన తర్వాత తొలిసారిగా, ఆయన సోదరులపై అవినీతి ఆరోపణలు రావడ ం చూస్తున్నాం. రేవంత్ సోదరులు రాజ్యాంగేతరశక్తిలా మారారంటూ.. బీఆర్ఎస్-బీజేపీ చేస్తున్న ఆరోపణలకు, క్యాబినెట్‌లోని సీనియర్లెవరూ ఎదురుదాడి చేయకపోవడం చూస్తే.. సీనియర్లు ‘ఎక్కడికక్కడే వెంకటలక్ష్మి’ అన్న చందాన వ్యవహరిస్తున్నారని కనిపిస్తూనే ఉంది.
రైతురుణ మాఫీ 25 లక్షలకు మించి అయిన దాఖలాలు లేవు. ప్రాధమిక సహకార సొసైటీలకు ఆశతో వెళుతున్న రైతులు.. రుణాలు మాఫీ కాకపోవడంతో, నిరాశతో కాళ్లు ఈడ్చుకుంటూ బయటకు వస్తున్న వైనం, సర్కారుపై రైతుల అసంతృప్తిని మరింత పెంచేదే. రైతుకు బేడీలు వేసి తీసుకువెళ్లిన వైనం దానికి అదనం. రుణమాఫీ కాక ఆత్మహత్యలు చేసుంటున్న రైతుల విషాదం సర్కారుకు శాపమే.
మహలక్ష్మి పథకం కింద నెలకు 2500 రూపాయలిస్తామన్న హామీపై, ఎవరి నుంచీ స్పష్టత లేదు. 39,568 మంది అంగన్వాడీ టీచర్లకు 14రోజులయినా జీతాలివ్వని దుస్థితి. ఎస్సీ గురుకుల పాఠశాలల్లో అక్టోబర్, నవంబర్ మెస్‌బిల్లులు ఇంకా పెండింగ్‌లో ఉన్నా, డబ్బులు లేక వాటిని విడుదల చేయలేని నిస్సహాయత. ఆరు నెలల నుంచి అదే గురుకుల పాఠశాలల్లో కాస్మొటిక్ చార్జీలు పెండింగ్‌లో ఉన్నాయి. కేవలం 9 లక్షల 50 వేల రూపాయల పెండింగ్ బిల్లులు కూడా చెల్లించలేని భయంకర ఆర్థిక సంక్షోభం నుంచి, తెలంగాణను గట్టెంచకడం రేవంత్‌కు కత్తిమీదసామే.
ఎన్నికల హామీలు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నందున, వచ్చే నాలుగేళ్లు ఆయనకు ముళ్లబాటనే. అయినా తమ ప్రభుత్వం ఇన్నేసి విజయాలు సాధించిందంటూ, కోట్ల రూపాయల ప్రకటనలు ఇవ్వడమే ఆశ్చర్యం. అన్నట్లు.. ప్రింట్-ఎలక్ట్రానిక్ మీడియాకూ బిల్లుల చెల్లింపులు లేవు. కేసీఆర్ కూడా ఇదేవిధంగా గతంలో పత్రికల్లో యాడ్స్ ఇచ్చి డబ్బాలు కొట్టుకున్నారు. అప్పుడు ప్రజాధ నం వృధా చేస్తున్నారంటూ పీసీసీ అధ్యక్షుడి పాత్రలో గర్జించిన ఇదే రేవంత్.. ఇప్పుడు సీఎం పాత్రలో కేసీఆర్ బాటలోనే నడవడమే వింత.
రేవంత్‌కు జిల్లాల్లో ఎమ్మెల్యేలపై పట్టులేదన్న ప్రచారం బహిరంగంగానే జరుగుతుండటం ఆందోళకరం. ప్రధానంగా ఆయన నిఘా విభాగాన్ని అతిగా నమ్ముతున్నారన్న ఆగ్రహం సీనియర్ మంతుల్లో లేకపోలేదు. డీఎస్పీ, ఏసీపీ, సీఐల పోస్టింగులలో తమ మాట వినడం లేదని, ఇంటలిజన్స్ అధికారులే వారి పోస్టింగులు నిర్ణయిస్తున్నారన్న అసంతృప్తి మంత్రుల్లోనే కాదు. ఎంపీల్లోనూ కనిపిస్తోంది.
గత కేసీఆర్ సర్కారులో కీలకపాత్ర పోషించిన డీఎస్పీ, సీఐలకే మళ్లీ మంచి పోస్టింగులు ఇస్తున్నారంటే.. పోలీసు శాఖలో ఎస్ఐబీ మాజీ బాస్ ప్రభాకర్‌రావు ప్రభావం ఏ స్థాయిలో కొనసాగుతోందో అర్ధమవుతోంందని, స్వయంగా ఎంపీలే అసంతృప్తి వ్యక్తం చేస్తుండటం విశేషం.
ఇక రాజేందర్‌నగర్‌కు చెందిన ఓ కార్పొరేషన్ ప్రముఖుడు, హైదరాబాద్ జిల్లాకు చెందిన పార్టీ ప్రమఖుడొకరు అన్ని విషయాల్లో చక్రం తిప్పుతుండటాన్ని పలువురు సీనియర్ మంత్రులు జీర్ణించుకోలేక పోతున్నారు. వారిద్దరికీ స్థానికంగా ఎలాంటి పట్టులేకపోయినా, కేవలం రేవంత్ మిత్రులన్న కారణంతోనే ప్రభుత్వంలో లాబీయింగ్ చేస్తున్నారన్నది వారి ఆగ్రహానికి అసలు కారణం.
ప్రధానంగా.. రేవంత్ ఎవరికీ అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని, పార్టీ నాయకులు ఆయననను కలవడమే గగనమవుతోందన్న అసంతృప్తి సర్వత్రా వ్యక్తమవుతోంది. ఈ విషయంలో ఆయన గతంలో జడ్పీటీసీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, ఎంపీగా ఉన్నప్పుడు సన్నిహితంగా మెలిగిన నాయకులు, మిత్రులు, జర్నలిస్టులకు సైతం అపాయింట్మెంట్ ఇవ్వకపోవడమే ఆశ్చర్యం.
కీలకమైన అంశాలను సలహాదారు వేం నరేందర్‌రెడ్డికి అప్పగించినందున, సీఎం ఎవరినీ కలవడం లేదంటున్నారు. దానితో సీనియర్లు వేం నరేందర్‌రెడ్డిని కలిసేందుకు పెద్దగా ఇష్టపడటం లేదు. ఎప్పటినుంచో పార్టీలో ఉన్న తాము, ఒక జూనియర్‌ను కలవడం ఏమిటన్న అహమే దానికి కారణంగా కనిపిస్తోంది. గతంలో కేసీఆర్ ఫాంహౌస్ నుంచి పాలిస్తే, ఇప్పుడు తమ సీఎం ఇంటి నుంచి పరిపాలిస్తున్నారని సొంత పార్టీ సీనియర్లే వ్యాఖ్యానిస్తున్న వైచిత్రి.
ఇక ఎన్నికల ముందువరకూ సీఎం రేసులో ఉండి, సోనియాతో సన్నిహిత సంబంధాలున్న ఓ సీనియర్ మంత్రి అయితే.. రేవంత్ పనితీరు, ఆయన చుట్టూ జరుగుతున్న వ్యవహారాలపై.. నిత్యం మెయిల్స్ పంపిస్తున్నారన్న ప్రచారం లేకపోలేదు. లక్కీభాస్కర్ తరహాలో.. పార్టీకి పంపిస్తున్నది కొంతయితే, అందుతున్నది మరికొంత అన్న వివరాలు ఆ ఫిర్యాదులో పేర్కొంటున్నారన్న ప్రచారం పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. తన మెయిల్స్‌ను ట్యాప్ చేస్తారన్న అనుమానంతో, ఆయన ఇటీవలే తన ఐపి అడ్రసును కూడా మార్చుకున్నట్లు తెలుస్తోంది.
జిల్లాల్లో పార్టీ ఎమ్మెల్యేలపై వస్తున్న అవినీతి ఆరోపణలపై, చ ర్యలు తీసుకోలేని నిస్సహాయ స్థితిలో సీఎం ఉన్నారన్న చర్చ జరుగుతోంది. ప్రధానంగా ఇసుక, మైనింగ్‌లో విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతున్నారన్న ఆరోపణలు వస్తున్నా, ఎవరినీ నియంత్రించలేని నిస్సహాయ స్థితి. ఉమ్మడి నల్లగొండ, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, కరీంనగర్, వరంగల్ జిల్లాలకు చెందిన అధికారపార్టీ ఎమ్మెల్యేలపైనే ఇలాంటి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ప్రధానంగా సోషల్‌మీడియాలో కాంగ్రెస్ కంటే, బీఆర్ఎస్ జనంలోకి వేగంగా దూసుకుపోవడం పార్టీని ఆందోళన కలిగించే అంశమే. విపక్షంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్పై విరుచుకుపడిన కాంగ్రెస్ సోషల్‌మీడియా సైనికులు, అధికారంలోకి వచ్చిన తర్వాత చడీచప్పుడు లేకుండా ఉండటంతో, గులాబీ సైనికులు విరుచుకుపడుతున్న పరిస్థితి. చివరకు రేవంత్ సైతం సోషల్‌మీడియాలో కాంగ్రెస్ వెనుకబడిందని వ్యాఖ్యానించడాన్ని విస్మరించకూడదు. బీఆర్ఎస్ సోషల్‌మీడియా విదేశాలనుంచి కూడా యాక్టివ్‌గా పనిచేయడం గమనార్హం.
ఇక కాంగ్రెస్ వైపు జర్నలిస్టులను ఆకర్షించే సమర్ధులు కూడా ఆయన దగ్గర లేకపోవడం, ఒక మైనస్ పాయింటే అంటున్నారు. సీనియర్ జర్నలిస్టులను తరచూ సీఎంతో భేటీ వేయించి, సానుకూల వాతావరణం సృష్టించే వ్యూహకర్తలు లేరని చెబుతున్నారు. గతంలో వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు, ఆయన ఓఎస్డీ రవిచంద్ అలాంటి బాధ్యతలే నిర్వహించేవారని గుర్తు చేస్తున్నారు. కేసీఆర్ సర్కారులో పీఆర్వోలుగా ఉన్నవారిని తీసుకోవద్దని రేవంత్ స్పష్టమైన ఆదేశాలిచ్చినా, సీనియర్లు దానిని ఖాతరు చేయకుండా, గత సర్కారులో పనిచేసిన పీఆర్వోలనే నియమించుకున్నారంటే.. సీనియర్లతో రేవంత్ సంబంధాలు ఏ స్థాయిలో ఉన్నాయన్నది సుస్పష్టం. ఇలాంటి ఘటనలతో.. తన రెక్కల కష్టంతో పార్టీని గద్దెనెక్కించిన రేవంత్ వ్యక్తిగత ప్రతిష్ఠ ..తరిగిపోతోందన్న ఆందోళన ఆయన అభిమానులలో వ్యక్తమవుతోంది.