బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ తాజాగా జైలు నుంచి విడుదల అయ్యాడు. షారుఖ్ ఖాన్, గౌరీ కుమారుడు త్వరలో మన్నత్ చేరుకోనున్నారు. కాసేపటి క్రితమే ఆర్యన్ ఖాన్‌ను జైలు నుంచి విడుదల చేసే ప్రక్రియ పూర్తయింది. షారుఖ్ తన కుమారుడిని జైలు నుంచి ఇంటికి తీసుకెళ్లడానికి జైలుకు చేరుకున్నాడు. ఆర్యన్ బయటకు రాగానే అతన్ని బాడీగార్డ్ వెంటనే కారులోకి పంపాడు. ఆర్యన్ తో పాటు మరో ఇద్దరు నిందితులు అర్బాజ్ మర్చంట్, మున్మున్ ధమేచాలను అక్టోబరు 3న క్రూయిజ్ షిప్‌లో డ్రగ్స్ ఆరోపణలపై నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అరెస్టు చేసింది.
అనంతరం 3 వారాల పాటు ఆర్థర్ రోడ్ జైలులో గడిపిన ఆర్యన్ ఎట్టకేలకు ముంబయి హైకోర్టు ఆదేశాల మేరకు బెయిల్‌పై విడుదలయ్యారు. గురువారం నాడు హెచ్‌సి నుండి బెయిల్ పొందినప్పటికీ, అతని విడుదలకు సంబంధించిన పత్రాలు శుక్రవారం జైలు అధికారులకు సకాలంలో చేరకపోవడంతో ఆర్యన్, మరో రాత్రి జైలులో ఉండవలసి వచ్చింది. అయితే హైకోర్టు ఆయనకు బెయిల్ ఇవ్వడానికి లక్ష రూపాయల బాండ్ చెల్లింపుతో సహా 14 షరతులు విధించింది. కాగా ఆర్యన్ బెయిల్ కు సీనియర్ నటి జూహీ చావ్లా ష్యురిటీ ఇచ్చింది. ఇక ఇప్పటికే ఆర్యన్ ను స్వాగతించడానికి వారి ఇల్లు ‘మన్నత్’ను అలంకరించినట్టు సమాచారం.