Suryaa.co.in

Editorial

కమ్యూనిస్టులతోని… అట్లుంటది!

– నిన్నటి వరకూ కేసీఆర్ పాలనపై చేసిన విమర్శలు తూచ్చేనా?
( మార్తి సుబ్రహ్మణ్యం)

‘‘ పోలవరంపై మీరు చేసేది మీరు చేయండి. మేము అడ్డుకున్నట్లు పోరాటాలు చేస్తాం. ఎందుకంటే మాకు తెలంగాణలో బలం ఎక్కువ. ప్రాజెక్టు ఎత్తు తగ్గించాలన్నది మా పార్టీ తెలంగాణ శాఖ అభిప్రాయం’’
– సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మొన్నామధ్య పోలవరంపై కేవీపీ రామచంద్రరావు పుస్తకావిష్కరణ సభలో చెప్పిన మాటలివి.
‘కేసీఆర్.. మా జగన్ కాళ్ల కింద దూరినా నీకు సిగ్గురాదు’
-టీఆర్‌ఎస్ పార్టీ ఫిరాయింపులపై నారాయణ ఉగ్ర రూపం
‘ప్రపంచంలో అబద్ధాలు చెప్పే ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్. పోలీసులతో తెలంగాణ పాలిస్తున్నారు’
– తెలంగాణ ఆర్టీసీ సమ్మె సందర్భంగా సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ
‘దేశంలో మోదీ, రాష్ట్రంలో కేసీఆర్‌ను గద్దె దించకపోతే ప్రజాస్వామ్యం బతకదు. దానికోసం రాజకీయ ఐక్యతతో నిలబడాలి. ఈ ఉద్యమం అటు బీజేపీకి, ఇటు టీఆర్‌ఎస్‌ను గద్దెదించేందుకు అంకురార్పణ జరిగింది’
– కాంగ్రెస్‌తో కలసి నిర్వహించిన ఓ సభలో నారాయణ
‘ కేసీఆర్‌కు కమ్యూనిస్టుల చరిత్ర ఏం తెలుసు? ప్రాజెక్టులు కాంట్రాక్టర్లకు అప్పుడు కాంగ్రెస్‌కయినా,kcr-tammini ఇప్పుడు టీఆర్‌ఎస్‌కయినా వరంలా మారాయి. బీజేపీని ఓడించాలనే తపనలో కమ్యూనిస్టులు కొన్ని తప్పులు చేశాయి’
– తెలంగాణ సీపీఎం నేత తమ్మినేని వీరభద్రం
‘మునుగోడు ఉప ఎన్నికలో మేం టీఆర్‌ఎస్‌కు మద్దతునిస్తున్నాం. బీజేపీని వ్యతిరేకించే ఏ పార్టీతోనయినా కలసి పనిచేస్తాం’
– సీపీఎం నేత తమ్మినేని

ఏమాటకామాట. నారాయణ అప్పుడప్పుడూ నిజాలు చెబుతుంటారు. దానికి ధైర్యం కూడా కావాలి మరి. కానీ వాటివల్ల వచ్చే లాభ నష్టాల గురించి ఆయన పెద్దగా ఆలోచించరు. ఇప్పుడు అలాంటి ఒక పచ్చి నిజం చెప్పి, కమ్యూనిస్టు ఉద్యమాలకు ‘తెర వెనుక’ ఒక లెక్క ఉంటుందని.. పైకి ఒకటి చెప్పినా, లోపల అసలు కథ మరొకటి ఉంటుందన్న రహస్యాన్ని వెల్లడించారు.

పోలవరం ఎత్తు తగ్గించాలన్నది తెలంగాణ సర్కారు కూడా కోరుతోంది. దానివల్ల తెలంగాణకు నష్టం అన్నది అధికారుల వాదన. అయితే.. ఆంధ్రాలో సీపీఐ నేతలు దానిపై అభ్యంతరం వ్యక్తం చేస్తే ఇబ్బంది. అందుకే సహజంగా తెలంగాణ పార్టీ దానిపై అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. బహుశా ఈ కిటుకు కనిపెట్టే.. నారాయణ అప్పట్లో వైఎస్‌కు ఈ సూత్రం చెప్పి ఉంటారు. అంటే ‘నేను కొట్టినట్లు నటిస్తా. మీరు ఏడ్చినట్లు నటించమని అన్నట్లన్న మాట.

దీన్నిబట్టి కమ్యూనిస్టులు చేసే ప్రతి ఉద్యమం వెనుక.. ఏదో ఒక అర్ధం- పరమార్ధం ఉంటుందని కామ్రేడ్ నారాయణ చెప్పకనే చెప్పేశారన్నమాట. పోలవరం లాంటి భారీ ప్రాజెక్టు విషయంలో ఈ సర్దుబాటు.. అవగాహన వైఖరి ఇలా ఉందంటే, ఇక మిగిలిన వ్యవహారాల్లో సీపీఐ వైఖరి ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ఎన్నికల ముందు బూర్జువా పార్టీలని విమర్శించే కమ్యూనిస్టులు.. ఎన్నికల సమయంలో అదే బూర్జువా పార్టీలతో కలసి పోటీ చేస్తుంటాయి. వాటికి అవగాహన, సర్దుబాటు లాంటి ముద్దుపేర్లు పెడుతుంటారు. దాని దుంపతెగ… ఇన్ని దశాబ్దాల్లో ఆ పదాలకు అర్ధమేమిటో.. మీరు విమర్శించే అదే బూర్జువా పార్టీలతో ఎలా కలసి పోటీ చేస్తారన్న ప్రశ్నలకు, ఏ ఒక్క కమ్యూనిస్టు నేత సమాధానం చెబితే ఒట్టు.

TRS-CPMఇక తెలంగాణ రాష్ట్రం మునుగోడు నియోజకవర్గంలో జరిగే ఉప ఎన్నికలో.. తాము తెరాసకు మద్దతునిస్తామని, ఉభయ కమ్యూనిస్టు పార్టీలూ ఈపాటికే ప్రకటించేశాయి. కారణం.. బీజేపీని వ్యతిరేకించే ఏ పార్టీతోనయినా తాము కలసి చేస్తామన్నది వారి సూత్రకరణ. మరి ఆ లాజిక్కు ప్రకారమే… కాంగ్రెస్ పార్టీ కూడా భాజపాకు వ్యతిరేకంగా పోరాడుతోంది. ఆ క్రమంలో ఆ పార్టీ చాలా నష్టపోయింది. రెండేళ్ల క్రితం వరకూ తెరాస- భాజపా హమ్‌సబ్ ఏక్‌హై అన్నట్లే కలసి పనిచేశాయి. పార్లమెంటులో బీజేపీ సర్కారు బిల్లులకు ఎలాంటి ఆటంకాలు లేకుండా, ప్రత్యక్షంగా-పరోక్షంగా తెరాస సహకరించిందన్నది వాస్తవం.

అందాకా ఎందుకు? ఇటీవల ముగిసిన పార్లమెంటు సమావేశాల్లో… పార్లమెంటు ఆవరణలో, కాంగ్రెస్ నిర్వహించిన ఆందోళనలో తెరాస కూడా పాల్గొంది. ఆ సందర్భంలో ఒక్కో పార్టీ ఒక్కో రకంగా ఆ దీక్షకు సహకారం అందించగా, తెరాస కూడా తన వంతు సహకారం అందించింది. అంటే ఒక పార్టీ బ్రేక్‌ఫాస్ట్, మరొక పార్టీ లంచ్, ఇంకో పార్టీ స్నాక్స్, మరొక పార్టీ డిన్నర్ వంటివి స్పాన్సర్ చేశాయన్నమాట. మరి ఇప్పటివరకూ బీజేపీతో ప్రత్యక్షం-పరోక్షంగా ఎలాంటి దోస్తీ చేయని కాంగ్రెస్‌ను వదిలేసి.. మునుగోడులో కమ్యూనిస్టులు, తెరాసకు ఎలా మద్దతు ప్రకటించారన్న ప్రశ్నకు.. సమాధానం ఇచ్చే కామ్రేడ్లే కరువయ్యారు. అయినా మన అమాయకత్వం గానీ.. కామధేనువు లాంటి తెరాస కళ్లెదుట ఉండగా..శివాలయం లాంటి కాంగ్రెస్‌కు మద్దతునిస్తే కామ్రేడ్లకు వచ్చే లాభమేమిటి?

సరే.. తాజా పొత్తు వల్ల సీపీఐ-సీపీఎం ఆధ్వర్యంలో నడిచే మీడియాకు, సర్కారు యాడ్స్ ఇకపై ధారాళంగా వచ్చే అవకాశాలుంటాయని, మునుపటి మాదిరిగానే సర్కారు ఆర్డరు కాంట్రాక్టులు, కమ్యూనిస్టు పత్రికల ప్రింటింగ్ ప్రెస్సులకు అంతే ధారాళంగా దక్కుతాయని ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ఉమ్మడి రాష్ట్రంలో కూడా పాలకులు ఇలాగే.. కామ్రేడ్ల ప్రింటింగ్ ప్రెస్సులకు ‘గవర్నమెంటు వర్కుల శ్రమదానం’ చేశారని, ఈ తరం వారికి తెలియకపోతే దానికి మనమేమీ చేయలేం. నిజానికి ఇప్పటివరకూ వాటి పై కేసీఆర్ శీతకన్నేశారు. అంటే రేట్ కార్డు-ప్రకటనల జారీ వంటివన్నమాట. ఇప్పుడు పొత్తు పొడిచింది కాబట్టి.. ఇక కమ్యూనిస్టుల మీడియాపై కేసీఆర్ రాముడి కన్నేస్తారేమో చూడాలి. ఏదైనా కామ్రేడ్ నారాయణ మాటల ప్రకారమే.. కామ్రేడ్ల పోరాటాలకు ఒక ‘లెక్క’ ఉంటుంది. ఊరకరారు మహానుభావులన్నట్లు.. కామ్రేడ్లు ఏదీ ఊరకనే చేయరన్నది గిట్టనివారి విమర్శ.

అంతా బాగానే ఉంది. గత ఎనిమిదేళ్ల నుంచి కేసీఆర్ కుటుంబపాలన-అవినీతి పాలన- నియంతృత్వ పాలన అంటూ గొంతు పగిలేలా యాగీ చేసి, ప్రాజెక్టుల్లో జరిగిన అవినీతి గురించి, ఢిల్లీ వరకూ ఎలుగెత్తిన కమ్యూనిస్టుల ఆరోపణల మాటేమిటన్నది బుద్ధిజీవుల ప్రశ్న. అవినీతిపరులు బీజేపీతో కలిస్తే పునీతులయిపోతారా? అని ప్రశ్నించే కామ్రేడ్లు.. మరి తమ లెక్కల ప్రకారమే.. తాము మద్దతునిస్తే, గతంలో తాము ఆరోపణలు చేసిన అదే పార్టీలు పుణ్యాత్ములయి, పులుకడిగిన ముత్యాలవుతాయా? అన్న ప్రశ్నలకూ జవాబివ్వాలి కదా?!

అన్నట్లు.. ఇక్కడ మరో మతలబు. తెలంగాణలో కేసీఆర్ పల్లకీ ఎత్తుతున్న కామ్రేడ్లు.. పక్కనే ఆయన రాజకీయ శిష్యుడైన జగన్ పాలనపై మాత్రం, పిడికిలి బిగించడం ఒక ఆశ్చర్యం. అంటే ఎక్కడికక్కడే వెంకటలక్ష్మి సామెతలా అన్నమాట. రేపు ఒకవేళ బీజేపీ-టీడీపీ మళ్లీ కలిస్తే.. కామ్రేడ్లు వైసీపీతో జతకట్టినా ఆశ్చర్యపడాల్సిన పనిలేదు. జతకట్టడమంటే.. పొత్తు-అవగాహన-సర్దుబాటు లాంటి పదాల బాటలో అన్నమాట. హేమిటో… ‘ఎర్రన్న’ల మాటలకు అర్ధాలే వేరు!

LEAVE A RESPONSE