ఎండ మండిపోతోంది..
పంజాగుట్ట సెంటర్లో
ఆ రోజున ట్రాఫిక్ కూడా పల్చగా నడుస్తోంది..లంచ్ టైం కావడంతో సిటీ బస్సుల రాకపోకలు కూడా పెద్దగా కనిపించడం లేదు..నేను గొడుగు పట్టుకుని బస్ స్టాప్ చేరుకుని మా ఏరియా
వెళ్లే బస్ కోసం ఎదురుచూస్తున్నాను.
బస్ రాకపోవటంతో అప్పుడప్పుడే నాలో అసహనం మొదలవుతోంది.
అప్పుడు వచ్చిందా అమ్మాయి.నిండా పదేళ్ళయినా ఉండవేమో.పక్కనే ఇంకాస్త చిన్న కుర్రోడు..బహుశా తమ్ముడై ఉంటాడు..
అడుక్కునే అమ్మాయనుకున్నాను.
మొహం పక్కకు తిప్పి
ఎటో చూస్తున్నట్టు ఉండిపోయాను. అయినా
ఆ అమ్మాయి నా దగ్గరకి రానే వచ్చింది.
నా చెయ్యి తడుతూ తన దగ్గర ఉన్న పెన్నులు కొనమని అడిగింది.
పది రూపాయలకు నాలుగు పెన్నులంట..
నాకు పెన్నులు వద్దని చెప్పాను. మీరు పెన్నులు కొంటేనే కదా నాకు..తమ్ముడికి
ఈ రోజు బువ్వ అంది..
ఈ మధ్య బస్ స్టాపుల్లో..జంక్షన్లలో
ఇలా చెయ్యడం పరిపాటైపోయింది..
ఇదిగో ఈ అమ్మాయిలా పెన్నులో.. పెన్సిల్లో..
ఇయర్ బడ్స్..కొందరైతే సాంబ్రాణి ధూపంతో..
ఇంకా రకరకాల
మార్గాలు కూటి కోసం!
అయినా చిన్న పిల్ల కదా..!తినడానికి ఏమైనా ఇద్దామని నా దగ్గర ఉన్న బ్యాగ్ లో రెండు బిస్కట్ ప్యాకెట్లు తీసి ఇవ్వబోయాను..
నాకు పట్టరాని ఆశ్చర్యం కలిగేలా ఆ అమ్మాయి
పెన్నులు కొని డబ్బులు ఇస్తే చాలు..ఫ్రీగా వద్దని అంది.అయినా నేను
ఆ అమ్మాయి భుజం తడుతూ రెండు ప్యాకెట్లు తన చేతిలో పెట్టాను..
ఆ అమ్మాయి నుంచి ఎదురు చూడని మరో షాక్..!
రెండు వద్దని..ఒకటి చాలని..
అదేమలా..అడిగాను..
మాకే రెండూ ఇచ్చేస్తే మీరేమి తింటారు..ఈసారి ఆ పిల్లలో మరింత విజ్ఞత..తన కళ్ళలో వెలుగు..నా కళ్ళలో ఆశ్చర్యం..!!
ఈ ఒక ప్యాకెట్ మేమిద్దరం షేర్ చేసుకుంటామని చెప్పింది.ఆ అమ్మాయిలో
నాకు ఆత్మవిశ్వాసం కనిపించింది..
అంతే కాదు..తను నాకు..ఆమాటకొస్తే అందరికీ ఏదో పాఠం చెబుతున్నట్టు అనిపించింది.
ఒక బిస్కెట్ ప్యాకెట్ తనకు వదిలి రెండో పాకెట్ పట్టుకుని బ్యాగులో పెట్టడం మర్చిపోయి బస్ కోసం ఎదురు చూడ్డం మాని అలా అనాలోచితంగా
నడుచుకుంటూ ముందుకి సాగాను.
పొట్ట నింపుకునేందుకు అడుక్కోకుండా
పెన్నులు అమ్ముతూ సంపాదించుకోవడంలో
ఒక నీతి..ఊరికే ఇచ్చే బిస్కెట్ ప్యాకెట్లు వద్దనడంలో ఆత్మాభిమానం..
సరే..ఒప్పించి రెండు ప్యాకెట్లు చేతిలో పెట్టబోతే రెండూ మాకే ఇచ్చేస్తే మీరేమి తింటారని అడగడంలో మానవత.
మొత్తానికి ఒక ప్యాకెట్ మాత్రమే తీసుకోవడంలో దొరికిన దానితోనే
తృప్తి పడాలన్న పాఠం..అవసరమైన దాని కంటే ఎక్కువ సంపాదించి పోగులు పెట్టుకునే ఎందరికో ఓ గుణపాఠం..
ఆ ఒక్క క్షణంలో
ఆ ముక్కుపచ్చలారని అమ్మాయి నాకు ఎన్ని నీతి సూత్రాలు నేర్పిందో చూడండి..!
– ఎలిశెట్టి సురేష్ కుమార్
9948546286