Suryaa.co.in

Andhra Pradesh

అధికార మదంతోనే టీడీపీ ఆఫీసుపై దాడి!

• లక్షలాది కార్యకర్తలకు ఇది ఒక దేవాలయం
• జగన్ రెడ్డికి, సజ్జలకు తెలియకుండానే దాడి జరిగిందా..?
• టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య సూటి ప్రశ్న

మంగళగిరి: అధికార మదంతోనే మంగళగిరి తెలుగుదేశం పార్టీ(టీడీపీ) కేంద్ర కార్యాలయంపై దాడి జరిగిందని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఆరోపించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే… ‘‘లక్షలాది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు పార్టీ కేంద్ర కార్యాలయాన్ని ఒక దేవాలయంగా భావిస్తారు. ఇటీవల మాజీ ఎంపీ నందీగం సురేష్ ను మంగళగిరి పోలీసులు హైదరాబాద్ లో అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.

ఆయన పాత్రధారి మాత్రమే.. సూత్రధారులు ఎవరో తేల్చి, వారిని త్వరగా అరెస్టు చేయాలి. అసలు కార్యాలయంపై దాడి జరుగుతుందని అప్పటి సీఎం జగన్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జలకు తెలియకుండా జరిగిందా..? వారి అధికారాన్ని అడ్డం పెట్టుకుని దాడి చేశారు… కేసును సరిగ్గా విచారణ చేయకుండా పక్కన పడేశారు. 2024 ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చాక ఆ కేసును దర్యాప్తు వేగవంతమైంది. పార్టీ కార్యాలయంపై దాడి పెద్ద కుట్ర.. హిందు దేవాలయాలపై దాడి హిందువులు ఎంత బాధపడతారు. మసీద్ పై దాడి చేస్తే ముస్లింలు ఎంత బాధపడతారు. ఒక చర్చిపై దాడి జరిగితే క్రైస్తవులు ఎంత బాధపడతారు. ఆ రకంగానే దేవాలయం లాంటి తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి చేస్తే లక్షలాది మంది పార్టీ కార్యకర్తలు, సానుభూతిపరులు బాధపడరా..?

ఈ దాడి పక్కా ప్రణాళిక ప్రకారం జరిగిన దాడి…. దీని వెనుక ఉన్న అసలు సూత్రధారులను బయటకు తీయాలని డిమాండ్ చేస్తున్నాం. అరెస్టు అయిన వారిని, అరెస్టు కాబోతున్న వారిని కూడా పోలీసు కస్టడీలోకి తీసుకోవాలి. ఈ కుట్రలో అసలు సూత్రధారులు ఎవరు..? దాడి చేయమని చెప్పిన వారు ఎవరు..? పోలీసులు వ్యవస్థ బయటకు తీయాలి. దాడి సమయంలో అందరీ చేతుల్లో బీరు బాటిల్స్ ఉన్నాయి.. ఆ రోజు నేను చూశాను. ఎవరు పోయించారు వారికి ఆ మందు.. ఎంత తాగకపోతే వారు కేంద్ర కార్యాలయంపై బీరు బాటిల్స్ లో మందు ఉండగానే విసిరికొడతారు… డ్రగ్స్ సైతం సేవించి ఉన్నారు. అరెస్టు చేసిన వారందరికీ డ్రగ్స్ టెస్టులు కూడా నిర్వహించాలి. ఇందులో జగన్ రెడ్డి పాత్ర ఏంటి..? సజ్జల పాత్ర ఏంటి..? ఇంటెలిజెన్స్ వారి పాత్ర ఏంటి..? నిగ్గు తేల్చాలి. ఈ కుట్ర మొత్తం బయటకు రావాలి’’ అని అన్నారు.

LEAVE A RESPONSE