– మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు
పల్నాడు ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలపై రోజురోజుకి దాడులు అధికమయ్యాయని మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు స్పష్టంచేశారు. శనివారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.ఆ వివరాలు ఆయన మాటల్లోనే క్లుప్తంగా మీకోసం…!
7గురిని ఫ్యాక్షన్ రాజకీయాల్లో హత్య చేశారు. 80 మందికి పైగా టీడీపీ నాయకులపై దాడులు జరిగాయి. అక్రమ మైనింగ్ తవ్వకాల్లో భాగంగా ఏడుగురు పసిపిల్లలు మైనింగ్ గుంతల్లో పడి చనిపోయారు. తమ ఇష్టానుసారంగా దాడులు చేస్తున్నారు. కళ్లూ, చేతులు విరగ్గొట్టటం, మనుషులని చంపడంలాంటివి కూడా చేస్తున్నారు. వారి ఆస్తులను ధ్వంసం చేయడం కూడా నిరంతర ప్రక్రియ అయింది. రెండున్నర సంవత్సరాల నుండి ఈ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే మాచర్ల, గురజాల నియోజకవర్గాల్లో దాష్టికాలు పెరిగాయి. తుమ్మలచెరువు గ్రామానికి చెందిన సైదా టీడీపీ ఆవిర్భావం నుంచి కూడా మంచి కార్యకర్త. పిడుగురాళ్ల వెళ్లి వస్తుండగా పిడుగురాళ్ల పరిసర ప్రాంతాల్లో వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఆయనపై దాడి చేసి విచక్షణారహితంగా కొట్టారు. ఓపక్క అల్లా అల్లా అని వేడుకుంటున్నప్పటికినీ కొడుతున్న వీడియో నేడు రాష్ట్ర వ్యా్ప్తంగా వైరల్ అయింది. రాళ్లతో, రాడ్లతో కొట్టడం దుర్మార్గం. దీన్ని బట్టి ఈ వైసీపీ దాష్టికం, దుర్మార్గం ఏ విధంగా ఉందో తెలుస్తోంది. వారిలో కనికరమనేదే లేకుండాపోయింది.
పల్నాడులోనే కాక రాష్ట్ర వ్యాప్తంగా దాడులు జరుగుతున్నాయి. ప్రశ్నిస్తే దాడులు చేస్తున్నారు.బయటికొచ్చి మాట్లాడే హక్కు లేకుండా చేస్తున్నారు. రాష్ట్రంలో ఒక నియంత పరిపాలన సాగుతోంది. ప్రజాస్వామ్య పద్ధతిలో అసెంబ్లీ సాగడంలేదు. మంత్రులు, ఎమ్మెల్యేలు మాట్లాడే తీరు బాలేదు. టీడీపీ, చంద్రబాబుల పట్ల, మహిళలను కించపరిచే విధంగా మాట్లాడారు. వైసీపీ పాలన పట్ల ఐదుకోట్ల ఆంధ్ర ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. నేడు అధికారం మీదుంది, రేపు మాదవుతుంది, అప్పుడు మీ పరిస్థితేంటి? రాష్ట్రంలో నియంత పాలన సాగుతోంది. అసెంబ్లీలో అంబేద్కర్ రాజ్యాంగంలేదు, రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తోంది. వైసీపీ నాయకులు విజ్ఞత కోల్పోయి, బరితెగించారు. మనుషులపై దాడులు చేసి మీరు ఏం సాధిస్తారు? కొడాలి నానీ, వంశీ, ద్వారంపూడి చంద్రశేఖర్, అంబటి రాంబాబు లు అసెంబ్లీలో మాట్లాడిన విధానం, భువనేశ్వరమ్మ, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల పట్ల మాట్లాడిన మాటలు చాలా జుగుత్సాకరంగా ఉన్నాయి. సమాజానికి ఏం చెప్పదలచుకున్నారో అర్థం కావడంలేదు. టీడీపీకి 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉంది. అలాంటి పార్టీపట్ల అందరికి గౌరవ, మర్యాదలున్నాయి.
వైసీపీలో చంద్రబాబు అంతటి రాజకీయ అనుభవం కలవారున్నారా? మీ భాష మేమూ మాట్లాడగలం, కానీ మా పార్టీ కుటుంబ సభ్యులు ఒప్పుకోవడంలేదు. రాష్ట్రాన్ని లూటీ చేశారు. ఇష్టానుసారంగా అప్పులు తెస్తున్నారు. ఒక్క సరైన సంక్షమ పథకం లేదు. గుంతలు పడితే పూడ్చలేని స్థితి రాష్ట్రంలో నెలకొంది. తెలుగుదేశం ప్రభుత్వంలో చేసిన అభివృద్ధి పనులు తప్ప ఈ రెండున్నర సంవత్సరాల్లో ఒక్క అభివృద్ధి పని చేయలేకపోయారు. అధికారమందనే అహంకారంతో కళ్లు నెత్తికెక్కాయి. ఇష్టానుసారంగా మాట్లాడితే ప్రజలు ఊరుకోరు. ఘోరీ కట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఎప్పడు ఎన్నికలు జరిగినా మిమ్మల్ని, మీ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు సిద్ధంగా ఉన్నారు. మీలా నియంతలా పాలన చేసినవారంతా పతనమయ్యారు. ప్రస్తుతం ఏ ఇబ్బందులు పెడుతున్నారు, ఆ ఇబ్బందులు భవిష్యత్తులో వైసీపీ నాయకులు పడాల్సి వస్తుంది. దుశ్శాసన ప్రభుత్వాన్ని కూకటివేళ్లతో పెకలించే రోజు, ప్రజలు ఛీకొట్టే రోజులొస్తాయని మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు హెచ్చరించారు.