Suryaa.co.in

Andhra Pradesh

ప్రభుత్వ పాఠశాలల, కళాశాలల విద్యార్థులకు అవార్డులు,నగదు పురస్కారాలు

• టెన్త్, ఇంటర్ ఫలితాల్లో తొలి మూడు స్థానాల్లో నిలిచిన ప్రభుత్వ పాఠశాలల, కళాశాలల విద్యార్థులకు అవార్డులు, నగదు పురస్కారాలు
• ఈనెల 23న నియోజకవర్గ, 27న జిల్లా, 31న రాష్ట్రస్థాయిలో మూడంచెల్లో అవార్డుల ప్రదానోత్సవం
• రాష్ట్రవ్యాప్తంగా 2831 మంది విద్యార్ధులకు అవార్డులు, నగదు బహుమతి అందించనున్నాం
• మెరుగైన విద్యార్థులుగా తీర్చిదిద్ది ప్రపంచంతో పోటీ పడేలా చేస్తున్నాం
• ప్రతిభను ప్రోత్సహించేందుకే మెరిట్ అవార్డులు..ఇది ఆరోగ్యకరమైన పోటీ
• ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీల వైపు అందరి దృష్టి మల్లేలా అడుగులు
– రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ

రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగంలో చేపట్టిన విప్లవాత్మక సంస్కరణలు, మార్పులతో ప్రభుత్వ పాఠశాలల్లో, కళాశాలల్లో విద్యాప్రమాణాలు పెరిగాయని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి .బొత్స సత్యనారాయణ అన్నారు. ఈ మేరకు పదవ తరగతి, ఇంటర్మీడియట్ నందు అత్యధిక మార్కులు సాధించిన ప్రభుత్వ పాఠశాలల, కళాశాలల విద్యార్థులను సన్మానించే అంశంపై బుధవారం సమగ్ర శిక్ష రాష్ట్ర కార్యాలయం పటమట నందు మీడియా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ..ఈ ఏడాది టెన్త్, ఇంటర్ ఫలితాల్లో తొలి మూడు స్థానాల్లో నిలిచిన ప్రభుత్వ పాఠశాలల, కాలేజీల విద్యార్థులకు అవార్డులు, నగదు పురస్కారాలతో సత్కార కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. విద్యారంగాన్ని మరింత ప్రోత్సహిస్తూ, పేదలు అధికంగా చదివే ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులను ప్రపంచంతో పోటీ పడేలా నిలపాలన్నదే జగనన్న ప్రభుత్వ ధ్యేయమన్నారు.

ఈ మేరకు మౌలిక వసతుల కల్పన, దీర్ఘకాలిక ప్రయోజనాలు కల్పించే దిశగా అధునాతన వసతులు, డిజిటల్ విద్యా బోధన తదితర అంశాలపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందన్నారు. ఇంతవరకు అమలు చేసిన వినూత్నమైన, విప్లవాత్మకమైన కార్యక్రమాలకు తోడుగా ఈ సంవత్సరం నుంచి పబ్లిక్ పరీక్షల్లో టెన్త్, ఇంటర్ పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించిన వారిని ప్రోత్సహించే కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నామన్నారు.

విద్యార్థులకు నగదు ప్రోత్సాహకం, మెరిట్ సర్టిఫికేట్ అందించడంతో పాటు ఆయా విద్యార్థుల తల్లిదండ్రులను, పాఠశాలల ప్రధానోపాధ్యాయులను, కళాశాలల ప్రిన్సిపాళ్లను కూడా సత్కరిస్తామన్నారు. అంతిమంగా ప్రతి విద్యార్థి, విద్యార్థిని మెరుగైన ఫలితాలు సాధించాలన్న తపన, ఆసక్తి, పట్టుదల పెరిగేలా చూడాలన్నదే ప్రభుత్వ ఆశయమన్నారు.

అందులోభాగమే ఇటీవల 10వ తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల్లో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన ప్రభుత్వ యాజమాన్యంలోని విద్యా సంస్థల విద్యార్థులకు ప్రోత్సాహకాలను అందించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఇంటర్మీడియట్ లో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, హెచ్ఈసీ, ఎంఈసీ గ్రూపుల్లో అగ్రస్థానాల్లో నిలిచిన వారికి ఈ మెరిట్ అవార్డులను ప్రదానం చేస్తామన్నారు.

అవార్డులను ప్రదానం చేసే తేదీలు:
ఈ మెరిట్ అవార్డులను నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో మూడు అంచెల్లో అవార్డులు అందించేలా కార్యాచరణను రూపొందించామన్నారు. అసెంబ్లీ స్థాయిలో మే 23వ తేదీన మండల కేంద్రంలో, మే 27వ తేదీన జిల్లా స్థాయిలో అనగా జిల్లా కేంద్రంలో, మే 31న రాష్ట్ర స్థాయిలో అందజేస్తామన్నారు.

జెడ్పీ /గవర్నమెంట్ / మున్సిపల్, ఏపీ మోడల్, బీసీ రెసిడెన్షియల్, ఏపీ రెసిడెన్షియల్, సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్, ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్, జిటిడబ్ల్యు ఆశ్రమ్ స్కూళ్లు, కెజిబివి ఇలా వివిధ ప్రభుత్వ విభాగాల ఆధ్వర్యంలోని అన్ని విద్యా సంస్థల్లోని విద్యార్థుల ఫలితాలను పరిగణనలోనికి తీసుకున్నామని పేర్కొన్నారు. నియోజకవర్గస్థాయిలో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన విద్యార్థులను పతకం, సర్టిఫికెట్ తో సన్మానిస్తామన్నారు.

జిల్లా స్థాయిలో టాప్-3 సాధించిన వారికి పతకం, సర్టిఫికెట్ తో పాటు రూ.50వేలు, రూ.30వేలు, రూ.10వేలు నగదు పురస్కారాలతో సత్కరిస్తామన్నారు. రాష్ట్రస్థాయిలో తొలిమూడు స్థానాల్లో నిలిచినవారికి పతకం, సర్టిఫికెట్ తో పాటు రూ.1లక్ష, రూ.75 వేలు, రూ.50 వేలు చొప్పున నగదు పురస్కారాలతో సన్మానించడం జరుగుతుందని ఈ కార్యక్రమానికి గౌరవ ముఖ్యమంత్రి .వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యేలా ఆలోచన చేస్తున్నామన్నారు.

ప్రభుత్వ పాఠశాలల, కళాశాలల చిన్నారులను మెరుగైన విద్యార్థులుగా తీర్చిదిద్ది పోటీ ప్రపంచంలో నిలబడేలా రాష్ట్ర ప్రభుత్వం విప్లవాత్మక మార్పులు తీసుకుంటోందన్నారు. ఇది ఆరోగ్యకరమైన పోటీ అని, ప్రతిభను ప్రోత్సహించేందుకే మెరిట్ అవార్డులని స్పష్టం చేశారు. ప్రతి తల్లిదండ్రులు ప్రైవేట్ బడులు, కాలేజీల వైపు కాకుండా ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల వైపు చూసేలా ప్రభుత్వం అడుగులు వేస్తోందన్నారు. ఈ మూడు అంచెల కార్యక్రమంలో మొత్తంగా 10వ తరగతి, ఇంటర్మీడియట్ స్థాయిల్లో కలిపి 2831 మంది విద్యార్ధులను సత్కరించనున్నామన్నారు.

ఈ సమావేశంలో పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్, పాఠశాల విద్యాశాఖ కమిషనర్ .ఎస్.సురేష్ కుమార్, ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి .ఎం.వి.శేషగిరిబాబు, ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ .డి.దేవానందరెడ్డి, కేజీబీవీ కార్యదర్శి డి.మధుసూదనరావు, ఏపీ రెసిడెన్షియల్ స్కూల్స్ సెక్రటరీ ఆర్.నరసింహారావు, సమగ్ర శిక్షా ఏఓ కె.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE