– అయోధ్య అడిగారు.. జగన్ ఇచ్చారు
– నామ్ ఎక్స్‌ప్రెస్ టోల్‌ప్లాజా భూదోపిడీ
– అద్దె చెల్లింపులు నిలిపివేసిన కంపెనీ
– జడ్పీని కాదని నామ్‌వే ఎక్స్‌ప్రెస్‌వేకు కేటాయింపు
– జడ్పీ అనుమతి లేకుండానే బదలాయింపు
– క్యాబినెట్లో చర్చించకుండానే నిర్ణయం
– జీఓ నెంబర్ 76ను రద్దు చేయాలని ఎమ్మెల్యే యరపతినేని లేఖ
– కూటమి వచ్చినా వైసీపీ నేలతదే హవా
– రాీం ఫార్మాపై చర్యల కొరడా ఝళిపించని పీసీబీ
– నోటీసులతోనే సరి పెట్టిన పీసీబీ
– యరపతినేని లేఖకు సర్కారు స్పందిస్తుందా?
– అయోధ్యతో సయోధ్య కుదిరిందన్న ప్రచారం
( మార్తి సుబ్రహ్మణ్యం)
లక్షలాది పసుపు సైనికుల పోరాటం.. ఆత్మత్యాగాలు.. వైసీపీ వేధింపులపై తిరుగుబాటు.. కేసులు.. జైళ్ల ఫలితంగా అధికారంలోకి వచ్చిన కూటమికి ఇప్పుడు అగ్నిపరీక్ష ఎదురయింది. కూటమి అధికారంలోకి వచ్చినా, ఇంకా వైసీపీ నాయకుల హవానే కొనసాగుతోందన్న విమర్శల నేపథ్యంలో.. గురజాల టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు రాసిన లేఖపై, సర్కారు చర్యల కొరడా ఝళిపిస్తుందా? లేక తనపై వస్తున్న విమర్శలను నిజం చేస్తుందా?.. ఇప్పుడు కూటమి ముందున్న అతి పెద్ద సవాల్ ఇది. కారణం.. వైసీపీ ఎంపి అయోధ్యరామిరెడ్డి!
ఏ పార్టీ అధికారంలో ఉన్నా ‘రెడ్డి’కార్పెట్ వే యించుకునే ఆయన హవాకు, కూటమి బ్రేకులేస్తుందా? లేదా యధావిథిగా ‘రెడ్డి’కార్పెట్ వేస్తుందా? ఈ మొత్తం వ్యవహారంలో అయోధ్య రెడ్డి పై చేయి సాధిస్తారా? యరపతినేని మాట నెగ్గుతుందా? అంటే.. కూటమి విజయమా? కార్యకర్తల విజయమా? వైసీపీ ఎంపీ అయోధ్య విజయపరంపరనా? అదే ఇప్పుడు హాట్ టాపిక్.
కూటమి అధికారంలోకి వచ్చినా, ఇంకా వైసీపీ నాయకుల హవానే కొనసాగుతోంది.. సీఎంఓ నుంచి మంత్రుల వరకూ వారి భుజమే తడుతున్నారు.. అదే కాంట్రాక్టర్లు రాజ్యమేలుతున్నారు.. టెండర్లు వాళ్లే దక్కించుకుంటున్నారన్న పసుపు సైనికుల ఆత్మఘోషకు, ఇప్పటివరకూ సమాధానం ఇచ్చిన వారే లేరు. పసుపుదళాల మానసిక భావన తొలగించే ప్రయత్నాలు ఇప్పటిదాకా జరిగిన దాఖలాలు లేవు.
ఈలోగా పల్నాడు జిల్లాలో జరిగిన ఘటన ‘అదనపు అవమానం’! అది కూడా వైసీపీ అధినేత జగన్‌కు అత్యంత సన్నిహితుడు, పారిశ్రామికవేత్తయిన ఎంపి అయోధ్య రామిరెడ్డిరూపంలో ఎదురైన సందర్భం!! ఆయనపై టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస్ ఫిర్యాదు చేసిన వైనం!!!
మరి ఇందులో అధికారంలో ఉన్న కూటమి గెలుస్తుందా? అంటే టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని నిలుస్తురా? వైసీపీ ఎంపి అయోధ్య గెలుస్తారా? అదే సస్పెన్స్. సస్పెన్స్ ఒక్కటే కాదు. ఇది కూటమి సర్కారు విశ్వసనీయతకు పెను సవాల్.
గత వైసీపీ హయాంలో ఆ పార్టీయ ఎంపి అయోధ్య రామిరెడ్డి ప్రోత్సాహంతో, 2 కోట్ల రూపాయల ఖరీదైన జడ్పీ స్థలాన్ని నార్కెట్‌పల్లి-అద్దంకి-మేదరమెట్ల(నామ్) ఎక్స్‌ప్రెస్‌కు కేటాయిస్తూ ఇచ్చిన 76ను రద్దు చేయాలని కోరుతూ.. గురజాల టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు తాజాగా ముఖ్యమంత్రికి రాసిన లేఖ, సర్కారుకు సవాలుగా పరిణమించింది.
నాటి జగన్ సర్కారు జడ్పీ భూమిని నామ్‌కు కేటాయిస్తూ 2023 ఫిబ్రవరి 21న జీఓ నెంబర్ 76ను జారీ చేసింది. నిజానికి పిడుగురాళ్ల మండలం తుమ్మలచెరువు చెట్టు సమీపంలో, నామ్ ఎక్స్‌ప్రెస్‌వేకి చెందిన టోలాప్లాజా ఉన్న విషయం తెలిసిందే. సర్వే నెంబర్ 251లో జడ్పీకి చెందిన భూమిలో, టోల్‌ప్లాజాకి చెందిన షెడ్లు నిర్మించారు. 2.71 ఎకరాల భూమికి, 2013 నుంచి అద్దెచెల్లిస్తూ వస్తున్నారు. అంతవరకూ బాగానే ఉంది.
ఆ తర్వాతనే కథ అడ్డం తిరిగింది. 2018 తర్వాత అద్దెకట్టడం మానేశారు. ఆమేరకు 12.64 లక్షల అద్దె బకాయిలు చెల్లించాల్సి ఉందన్నది జడ్పీ అధికారుల వాదన. దానికి సంబంధించి జడ్పీ నామ్ ఎక్స్‌ప్రెస్‌వేకు ఎన్ని లేఖలు రాసినా బేఖాతరు చేసింది. వైసీపీ అధికారంలోకి రావటం, నాటి సీఎం జగన్‌కు అయోధ్య రామిరెడ్డిఅత్యంత సన్నిహితుడు కావడంతో.. ఈ వ్యవహారంలో నామ్ఎక్స్ప్రెస్వే పైచేయి సాధించడం, జడ్పీ ప్రేక్షకపాత్ర పోషించడం జరిగిపోయింది.
అసలు ఓపెన్ మార్కెట్లో ఆ జడ్పీ భూమి విలువ 2 కోట్ల రూపాయలు పైమాటానేట. అలాంటి భూమిని కారు చౌకగా కోట్టేసే ప్రయత్నాల్లో భాగంగా.. తమకు అడ్డుగా ఉంటూ, తలనొప్పి సృష్టిస్తున్న జడ్పీని పక్కనపెట్టి, ఆర్‌అండ్‌బీని తెరపైకి తీసుకువచ్చారు. ఆ ప్రకారంగా 2023 మార్కెట్ ధర ప్రకారం.. ఎకరాకు 9.50 చెల్లించేలా ఆర్అండ్ బి అధికారులు ప్రతిపాదనలు పంపించారు. ఇంకేముంది? ఆ జడ్పీ భూమిని నామ్‌వే ఎక్స్‌ప్రెస్‌కు కేటాయిస్తూ, 2023 ఫిబ్రవరి 21న జీఓ నెంబర్ 76ను జారీ చేయడం చకా చకా జరిగిపోయింది.
ఈ మొత్తం వ్యవహారంలో నాటి వైసీపీ సర్కారు అన్ని నిబంధనలనూ అడ్డగోలుగా అతిక్రమించిందని, గురజాల టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని సీఎంకు రాసిన లేఖలో ఫిర్యాదు చేసినట్లు సమాచారం. క్యాబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకోకుండానే ఏకపక్షంగా తీసుకున్న ఈ నిర్ణయాన్ని రద్దు చేయాలని, ఆయన సీఎంకు రాసిన లేఖలో ఫిర్యాదు చేశారట.
నిజానికి ఇలాంటి నిర్ణయం తీసుకోవాలంటే సంబంధిత శాఖల అనుమతి తప్పనిసరి. జీఓ నెంబర్ 323 ప్రకారం.. 2 లక్షల రూపాయల పైన ఉన్న ప్రభుత్వ భూమిని ప్రైవేటు సంస్థలకు బదలాయించాలంటే, దానికి మంత్రివర్గ నిర్ణయం అవసరం. కానీ అలాంటివేమీ లేకుండానే ధారాదత్తం చేసిన ఆ జీఓను రద్దు చేయాలని టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని సీఎంకు రాసిన లేఖలో విజ్ఞప్తి చేశారు.
మరి..జడ్పీ అనుమతి లేకుండానే జారీ అయిన జీఓ నెంబర్ 76ను రద్దు చేయాలన్న యరపతినేని లేఖకు సర్కారు స్పందిస్తుందా?.. లేక అయోధ్యకు జగన్ సర్కారు మాదిరిగానే ‘రెడ్డి’కార్పెట్ వేస్తుందా? చూడాలి. ఎందుకంటే.. ఇప్పటికే అయోధ్యరామిరెడ్డి, మిగిలిన వైసీపీ నేతల మాదిరిగానే కూటమి పెద్దల టచ్‌లోకి వెళ్లారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఇది సత్యమా? అసత్యమా? అన్నది సర్కారు తీసుకునే చర్యలపైనే ఆధారపడి ఉంది. సూటిగా చెప్పాలంటే.. ఇది కూటమి విశ్వసనీయతకు.. లక్షలాదిమంది కార్యకర్తల నమ్మకం గెలిగే అగ్నిపరీక్ష!
రాంకీ ఫార్మాలోనూ ఉత్తుత్తి చర్యలే
కాగా ఉమ్మడి విశాఖ జిల్లాలోని కెమికల్ కంపెనీలపై.. దశాబ్దాల నుంచి గుత్తాధిపత్యం కొనసాగిస్తున్న అయోధ్య రామిరెడ్డికి చెందిన రాంకీ ఫార్మాపై, చర్యల కొర డా ఝళిపించే ధైర్యం సర్కారులో కొరవడిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇటీవల పర్యావరణ నిబంధ నలు అడ్డగోలుగా ఉల్లంఘిస్తూ పట్టుబడిన ఆ కంపెనీకి నోటీసు ఇచ్చిన పీసీబీ అధికారులు, ఇప్పటివరకూ క్రిమినల్ చ ర్యలు తీసుకోలేకపోయారు. తామిచ్చిన నోటీసులకు రాంకీ ఏమి సమాధానం ఇచ్చిందో కూడా, పీసీబీ చెప్పేందుకు భయపడుతున్న పరిస్థితి. విశాఖలో పాతుకుపోయిన పీసీబీ అధికారుల అలసత్వం కారణంగానే రాంకీ వంటి ఉల్లంఘనులు తప్పించుకుంటున్నాయన్నది కార్మిక సంఘాల ఆరోపణ.
సమాచారశాఖలో మాత్రం అలా..
కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న చిత్ర విచిత్ర నిర్ణయాలు విస్మయం కలిగిస్తున్నాయి. నచ్చినవారికి ఒకలా.. నచ్చనివారికి మరోలా తీసుకుంటున్న నిర్ణయాలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. పులివెందులలో కాంట్రాక్టులు చేసిన వైసీపీ నేతల బిల్లులు క్లియరెన్స్.. జగన్ జమానాలో సీనరేజీ వసూళ్లు చేసిన ఏఎంఆర్, తెలంగాణ మంత్రి పొంగులేటికి చెందిన రాఘవ కనస్ట్రక్షన్స్‌కు.. వేలకోట్ల కాంట్రాక్టులు చేసిన షిర్డిసాయి ఎలక్ట్రికల్స్, మేఘా కంపెనీ.. వైద్యశాఖలో సజ్జల రామకృష్ణారెడ్డి అనుచరులకు సెక్యూరిటీ టెండర్లు.. గత ఎన్నికల ప్రచారంలో జగన్ సీఎం కావడం అవసరం అని చెప్పిన నాటి ఆర్టీసీ ఈడీకి రవాణాశాఖమంత్రి ఓఎస్డీ పదవి.. గన్నవరం ఎయిర్‌పోర్టులో బంగారంతో దొరికిపోయి, ధనంజయరెడ్డి జోక్యంతో బయటపడ్డ ఓ మహిళ భర్తకు.. రిటైరయినా మళ్లీ సాంస్కృతిక శాఖలో పదవి ఇచ్చిన కూటమి ప్రభుత్వం.. ఒక్కొక్కరి విషయంలో ఒక్కోలా వ్యవహరించడమే వింత.
సమాచార శాఖలో జాయింట్ డైరక్టర్‌గా పనిచేసిన మాదిగ వర్గానికి చెందిన తేళ్ల కస్తూరిని కూటమి సర్కారు వచ్చిన తొలినాళ్లలో ఆ పదవి నుంచి తొలగించి, డైరక్టర్‌కు అటాచ్ చేసింది. అప్పటి నుంచి ఇప్పటి వరకూ ఆమెకు జీతం లేదు. ఇంతకూ ఆమెపై ఉన్న అభియోగాలేమిటంటే.. జగన్ హయాంలో ఆంధ్రజ్యోతికి ప్రకటనలు ఇవ్వకపోవడం, ఈనాడు టారిఫ్ తగ్గించడమేనట. ఆ మేరకు ఆమెపై విజిలెన్స్ విచారణ జరిగింది. అందులో ఆమెను దోషిగా తేల్చలేకపోయింది.
ఇక్కడ విశేషమేమిటంటే.. ప్రకటనల బిల్లులకు సంబంధించి జగన్ సర్కారు అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా, ఈనాడు సంస్థ తమకు ప్రకటనలు వద్దని లిఖితపూర్వకంగా రాసిచ్చింది. అటు జగన్ ఆదేశాలతో ఆంధ్ర జ్యోతికి ప్రకటనలివ్వవద్దని ఆదేశించడంతో, నాటి కమిషనర్ దానిని అమలుచేశారు. నిజానికి ఈ విషయంలో కమిషనర్ కూడా నిమిత్తమాత్రుడే. గత టీడీపీ ప్రభుత్వంలో సాక్షికి ప్రకటనలు ఇవ్వవద్దన్న ఆదేశాలను.. అప్పటి సమాచార శాఖ కమిషనర్ ఏవిధంగా అమలుచేశారో, జగన్ హయాంలో పనిచేసిన సమాచార శాఖ కమిషనర్ కూడా, నాటి ప్రభుత్వ ఆదేశాలు పాటించారు. అయితే జెడి కస్తూరి వైసీపీకి అనుకూలంగా పనిచేసినందున, ఆమెను పక్కనపెట్టమని ఒక యువనేత ఆదేశించారన్నది జరుగుతున్న ప్రచారం.
అంతవరకూ బాగానే ఉంది. కానీ ఏ పత్రికకు ప్రకటనలు ఇవ్వాలి? ఏ ఏజెన్సీలకు అవుట్డోర్ ఏజెన్సీలు ఇవ్వాలని నిర్ణయించే కమిషనర్‌ను మాత్రం.. కూటమి సర్కారు క్షేమంగా తిరిగి ఢిల్లీ సర్వీసుకు పంపించేసింది. జాయింట్ డైరక్టర్లకు సొంతగా ప్రకటనలు జారీ చేసే అధికారం ఉండదని తెలిసినా, ఒక దళిత మహిళా అధికారిని ఈ అంశంలో బలి చేసి, సీఎం ఆదేశాలు పాటించి సాక్షికి వందలకోట్ల ప్రకటనలిచ్చిన కమిషనరును మాత్రం వదిలేయడమే వింత.
లిక్కర్ కుంభకోణంలో ీ లక నిందితుడిగా ఉన్న వాసుదేవరెడ్డి, సాక్షి కి వందలకోట్ల ప్రకటనలిచ్చిన సమాచార శాఖ కమిషనర్ విజయకుమార్‌రెడ్డి, వైసీపీ కాంట్రాక్టర్ల బిల్లులను పవ్వులో పెట్టి అప్పగించిన నాటి ఫైనాన్స్ సెక్రటరీ సత్యనారాయణను కేంద్ర సర్వీసులకు క్షేమంగా పంపిన సర్కారు.. గత 13 నెలల నుంచి, కమిషనర్ ఆదేశాలు పాటించిన ఒక మాదిగ మహిళను మాత్రం వెయిటింగ్లో ఉంచడమే వింత. ఈ 13 నెలల కాలంలో వైసీసీకి అనుకూలంగా పనిచేశారన్న పలువురు ఐఏఎస్,ఐపిఎస్‌లకు 8 నెలలల తర్వాత పోస్టింగులివ్వడం మరో వింత.