కథ..మొదలు..తుది లేని సినిమా
పేరేమో మూడు రాజధానులు..!!
ఇంకా అదే దారా..
ఇదంతా ప్రజల కోసమేనా..
ఇప్పుడు కూడా అదే తీరా..
ఇలాగే సాగితే ముగింపు ఉంటుందా..
ఇప్పటికీ మారరా..!?
ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో జగన్ సర్కార్ వైఖరి పూర్తిగా వ్యక్తిగత పంతమేనన్న అభిప్రాయం నానాటికీ బలపడేలా పరిణామాలు సాగుతున్నాయి.
మంచిదో..చెడ్డదో గత ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుని 2014..19 మధ్య కాలంలో ఆ దిశగా చాలా దూరం నడిచేసింది.కోట్లాది రూపాయల ప్రజాధనం వ్యయం అయింది.
వాస్తవానికి అప్పటి అసెంబ్లీ తీసుకున్న నిర్ణయంలో నేటి అధికార పార్టీ కూడా భాగస్వామిగానే ఉంది.అప్పుడు అనుకూలంగా ఓటేసి అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చి మూడేళ్ల పాటు రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారు.
అప్పుడే పుట్టిన బిడ్డకు ఎన్నో నేర్పాల్సింది పోయి ఎదుగుదలకు ప్రతిబంధకంగా గుండెల్లో కన్నం పెట్టినంత పరిణామం
ఇది..సరే..మూడు రాజధానులు అన్న నిర్ణయం తీసుకున్న తర్వాత ప్రస్తుత ప్రభుత్వం దానిని కార్యరూపంలోకి తెచ్చేందుకు చిత్తశుద్ధితో చేసిన కృషి ఏంటి..కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి..మెప్పించి అటు నుంచి అనుకూల నిర్ణయాలు తీసుకురాగలిగిందా..
ప్చ్..లేదే..
నిజానికి పరిపాలనా సౌలభ్యం కోసం వికేంద్రీకరణ అని చెబుతున్న ప్రభుత్వం మూడేళ్లకు పైగా అమరావతిలోనే కూర్చుని అధికారం చేస్తోందే..
వికేంద్రీకరణ లేకుండా పాలన సాగిస్తున్న సర్కార్ ఏలుబడిలో కష్టాలు ఎదుర్కొందా..?ఈ ప్రశ్నకు ప్రభుత్వంలోని పెద్దలు గనక ఔను అని సమాధానం చెబితే తమ వైఫల్యాన్ని ఒప్పుకున్నట్టే..!నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఎన్ని ప్రతిబంధకాలు ఎదురైనా
నిర్ణయించుకున్న మేరకు ఈపాటికి విశాఖలో రాజధాని ఉండాలి.లేదే మరి..భూముల రేట్ల కోసం జరుగుతున్న ఓ పెద్ద ప్రహదనంలా మారింది ఇదంతా..ఒక నిర్దిష్ట లక్ష్యంతో సాగుతున్న హై డ్రామా అనిపించడం లేదూ..
అలా కాకపోయి ఉంటే ప్రభుత్వం మీది..మెజారిటీ ఉంది..కేంద్రంతో సత్సంబంధాలు ఉన్నట్టే మీరే చెప్పుకుంటున్నారు.మరి ఇంత జాప్యం దేనికో..
ఎన్ని పథకాలు ముఖ్యమంత్రి మనసులో ఆలోచన పుట్టగానే కార్యరూపం దాల్చేయడం లేదు.రాజధాని విషయంలోనే ఈ తేడాలు దేనికో..చిత్తశుద్ధి లోపం కాదూ..!
నిజానికి.. పాలనా సౌలభ్యం కోసం మూడు రాజధానులు అనే కారణంలోనే బలమైన వాదన లేదు..అలా అయితే నువ్వే మూడేళ్లుగా ఒకే చోటు నుంచి పాలన ఎలా సాగిస్తున్నావు..
అంటే నీ కంటే ముందు ఏలిన ప్రభువు నీ కన్నా బాగా ప్రభుత్వం నడిపాడనా..పోనీ ఆ సంగతి పక్కన బెడితే అంతకు ముందు అనేక సంవత్సరాల పాటు ఇంతకంటే పెద్ద రాష్ట్రాన్ని ఎంతో మంది ముఖ్యమంత్రులు ఒకటే రాజధానితో చక్కగా పాలించలేదా..వారిలో ఇప్పుడు నువ్వు బద్ధ శత్రువుగా పాలించే వ్యక్తితో పాటు స్వయంగా నీ కన్న తండ్రి కూడా ఉన్నాడే..
మూడు రాజధానులు లేదా వికేంద్రీకరణ లేని కారణంగా వారంతా విఫలమయ్యారని నువ్వు అనగలవా..అలా అంటే నువ్వు మహానేతగా పేర్కొనే నీ తండ్రి కూడా విఫలం అయినట్టేగా..
అప్పుడు నువ్వు ఆయన పేరు చెప్పుకుని కాయలు అమ్ముకోవడం న్యాయమేనా…అలాంటి పరిస్థితుల్లో ఇన్ని పథకాలకు నీ తండ్రి పేరు పెట్టడం తగునా..!!??
సరే…మన రాష్ట్రం సంగతి పక్కన పెడితే మిగిలిన రాష్ట్రాలు ఒకే రాజధానితో దశాబ్దాల తరబడి ఏలుబడి సాగించడం లేదా..వాటిలో చాలా వరకు మన కంటే ఎంతో పెద్ద రాష్ట్రాలు.మరి కేంద్రం సంగతి ఏంటి..దేశం మొత్తాన్ని ఒకే రాజధానితో ఒకే తాటిపై నడిపించడం లేదా..!?
సరే..ఇప్పటికే మూడేళ్లకు పైగా జాప్యం..రాజధాని విషయంలో అయామయం నడిచాయి.నిజానికి ఒక రాష్ట్రం నుంచి విడివడి కొత్త రాష్ట్రంగా ఏర్పడినప్పుడు చకచకా అడుగులు వేస్తూ అవసరమైనవన్నీ సమకూర్చుకుని బాలారిష్టాలు అధిగమించి ఎదగాల్సిన అవసరం ఉంటుంది.ఒప్పే చేశారో..తప్పే చేశారో చంద్రబాబు నాయుడు ఆ దిశగానే అడుగులు వేశారు.రాష్టం విడిపోయిన తర్వాత పదేళ్ల పాటు హైదరాబాదును ఉమ్మడి రాజధానిగా వాడుకోడానికి సర్వ హక్కులూ ఉన్నా ఎప్పటికైనా తప్పదు కదాని అతి తక్కువ కాలంలోనే నవ్యాంధ్రకు సొంత రాజధానిని ఏర్పాటు చేసి మొత్తం వ్యవస్థని సొంత రాష్ట్రానికి తెచ్చేసారు.
ఆ క్రమంలో తీసుకున్న కొన్ని చర్యలు ప్రస్తుత ప్రభుత్వానికి నచ్చలేదనే అనుకుందాం. ఒకరి కంటే బాగా పని చేయడం అంటే వారు చేసినవన్నీ రద్దు చేసి కొత్తవి చెయ్యడం కాకుండా ఆ పనులనే ఇంకా బాగా చెయ్యడం అనే లాజిక్ మిస్సయి ప్రస్తుత సర్కార్ పరిస్థితిని ఇంత వరకు తెచ్చింది.ఇప్పుడేమైంది.. గత మూడేళ్లుకు పైగా రాజధాని లేని రాష్ట్రంగా మార్చి ప్రగతిని త్రిశంకు స్వర్గంలో పడేసింది.
ఇప్పటికే ఆలస్యం జరిగింది..ఈ మూడేళ్లలో మూడు రాజధానులకు అనుకూలంగా..లేదా అమరావతికి వ్యతిరేకంగా కేంద్రం నుంచి సరైన నిర్ణయం లేదు.అది జరక్కపోగా అమరావతినే ఆంధ్రప్రదేశ్ రాజధానిగా గుర్తిస్తున్నట్టు కేంద్రం పలు సందర్భాల్లో చెప్పకనే చెప్పింది.
గోరు చుట్టుపై రోకటి పోటులా కోర్టు తీర్పులు..
సరే..ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా గాని మరింత జాప్యం జరగడమే గాని తాననుకున్నట్టు మూడు రాజధానుల సినిమా ఇంత త్వరగా వెండి తెరపై మెరిసే సూచనలు కనుచూపు మేరలో ఉంటాయా..!?
ప్రజాభిప్రాయం లేకుండా జరుగుతున్న ఈ మొత్తం ప్రక్రియ కోసం ప్రజలంతా సంవత్సరాల తరబడి ఎదురు చూసే పరిస్థితిని
ఆ ప్రజలే అఖండ మెజారిటీతో గెలిపించిన ప్రభుత్వం తీసుకురావడం..చిత్రమే..!
ఇ.సురేష్ కుమార్
జర్నలిస్ట్
9948546286