Home » బాబుకు ఇప్పట్లో ప్రత్యామ్నాయం లేదు… కానీ!

బాబుకు ఇప్పట్లో ప్రత్యామ్నాయం లేదు… కానీ!

“వైసీపీ కి వై నాట్ 175?” అంటూ ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి పదవి లో ఉన్న వై. ఎస్. జగన్మోహనరెడ్డి పాడిన పాట – జనం దృష్టిని విశేషం గా ఆకర్షించింది.

“అవును. టీడీపీ కూటమి కి వై నాట్ 175?” అని ఓటర్లు అనుకున్నారు. 164 ఇచ్చారు. పులివెందుల మినహా మిగిలిన 10 కూడా ఇద్దామని అనుకున్నారు. చంద్రబాబే వారి మనసులోని ఉద్దేశాన్నిసరిగ్గా కనిపెట్టలేక పోయారు. దాంతో, ఓ పదకొండు మంది వైసీపీ నేతల కు అసెంబ్లీ మొహం చూసే మహద్భాగ్యం కలిగింది. అయినప్పటికీ ; జగన్ పిలుపుకు ఆంధ్రప్రదేశ్ ప్రతిస్పంచిందనే చెప్పాలి.

ఈ తీర్పు, జగన్ – సజ్జల రామకృష్ణారెడ్డి నడమంత్రపు, కృత్రిమ ——–(డ్యాష్…. డ్యాష్…. డ్యాష్…. డ్యాష్…) కు వ్యతిరేకం గా రాష్ట్రం ఏకగ్రీవంగా ఇచ్చిన తీర్పు.

కనీ వినీ ఎరుగని ఈ ప్రజాగ్రహం వల్ల, సహజం గానే టీడీపీ కూటమి కి అధికారం లభించింది. మామూలు అధికారం కాదు, అవధులు లేని అధికారం. ఎవరూ ప్రశ్నించడానికి అవకాశం లేని అధికారం. ప్రతిపక్షం కూడా లేని, శాసనసభకు సైతం ప్రతిపక్షం రాలేని అధికారం.

అధికారం లో ఉన్న మాఫియా గ్యాంగుల నిలువు దోపిడీలను ,అరాచకాలను , దౌర్జన్యాలను గత నాలుగేళ్లుగా తీవ్రం గా విమర్శిస్తూ ఊరూరా తిరుగుతున్న చంద్రబాబు ఏం చేస్తారో చూద్దామని ఇచ్చిన అధికారం ఇది.

ఎక్కడ ప్రేమ, అభిమానం ఉంటుందో ; అక్కడే ద్వేషం, ఆగ్రహం కూడా ఉంటాయి అనడానికి ; జగన్ కు 2019 లోను, 2024 లోనూ ప్రజలు ఇచ్చిన సీట్లే నిదర్శనం.

“మనందరి ప్రభుత్వం ” అంటూ 2019 ఎన్నికలకు ముందు ఊదర గొట్టిన జగన్, గెలిచిన తరువాత – ఆంధ్రప్రదేశ్ అనే అమృత భాండాగారాన్ని నలుగురు రెడ్లకు వదిలేసి, ఆయన మానాన ఆయన క్యాంపు ఆఫీస్ లో తలుపులేసుకుని ఫిడేలు వాయించుకుంటూ ఉండి పోయారా అన్నట్టుగా… ఎవరికీ అందుబాటులో లేకుండా ఉండిపోయారు. దానితో, ప్రభుత్వం… వ్యవస్థలు…. పాలన అంటే ఏమిటో జగన్ కు తెలియదనే నిర్ధరణకు ప్రజలు వచ్చేశారు.

అందుకే, 2019 లో 151 సీట్లు ఇచ్చిన వైసీపీ కి 2024 లో 11 మాత్రమే ఇచ్చారు.
ఇప్పుడు కూటమి వంతు వచ్చింది.
164 సీట్లు ఇచ్చిన ప్రజలు చంద్రబాబు వ్యవహార శైలి, పాలనా తీరు తెన్నులు , మాట్లాడే మాటలు, తీసుకునే నిర్ణయాల లోని ఔచిత్యం మొదలైన వాటిని నిశితం గా పరిశీలిస్తుంటారు. వారి అంచనాలను అందుకోలేకపోతే ; వారు ఇప్పుడు ఇచ్చిన మూడు అంకెలలో…. ఒక అంకెను లేపేస్తారు. జన సామాన్యపు రాజకీయ చైతన్యం ఆ స్థాయిలో ఉంది అనే స్పృహతో కూటమి నేతలు పని చేయాలి. *పబ్లిక్ పెర్సెప్షనే ఆక్సిజన్!*

ప్రభుత్వ మనుగడను “ప్రజాభిప్రాయం” ప్రభావితం చేస్తుంది. దానిని డబ్బు, మందు, ప్రలోభాలు, కులం మతం, ప్రాంతం ప్రభావితం చేయలేవు అనే విషయం మొన్నటి ఎన్నికల్లో సందేహాతీతం గా రుజువయ్యింది.

ఆ విషయం తెలియని నేత కాదు, చంద్రబాబు నాయుడు. 2004 లో ఆయన ఓడిపోయారు. 2019 లోనూ ఓడిపోయారు. ఎందుకు ఓడిపోయారో… ఆయనకు ఒకరు చెప్పాల్సిన పని లేదు.

తను, తన పాలన గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకోకపోవడం వల్ల ఓడిపోయారు. అలా తెలుసుకునే ప్రత్యేక యంత్రాంగం లేకపోవడం వల్ల ఓడిపోయారు. అయినప్పటికీ ; ఇప్పుడు, ప్రజలు, మూడో సారి ఆయనకు మళ్ళీ రాష్ట్ర పాలనాధికారం అప్పగించారు.

చంద్రబాబు బ్రహ్మాండం గా పని చేస్తున్నారు. అందులో సందేహం లేదు.రోజుకు 18 గంటలకు పైగా పనిచేస్తున్నారు. (అలా పనిచేయడం ఆయనకు ఓ వ్యసనం. జెనిటిక్ ప్రాబ్లెమ్ కూడా అయితే అయి ఉండవచ్చు .) అయినప్పటికీ ;

1.చంద్రబాబు ఇమేజ్ పై ప్రజలలో ఎటువంటి భావం వ్యక్తమవుతోంది?
2.మంత్రివర్గ కూర్పు ఎలా ఉంది?
3. దాదాపు 10 సీనియర్లను పక్కన బెట్టి, అంతమంది యువకులు, కొత్తవారికి మంత్రి పదవులు ఇవ్వడాన్ని జనం హర్షిస్తున్నారా?
4.మొన్న ఓటింగ్ లో పాల్గొన్నవారిలో దాదాపు 40 శాతం మంది కూటమి కి ఓటు వెయ్యలేదు. ఎందుకని? వారు ఎవరు?
5.కూటమి ప్రభుత్వానికి వారు కూడా మద్దతు ఇచ్చేందుకు ప్రభుత్వం ఏమి చేయాలి?
6.జనసేన కు కేటాయించిన శాఖల పట్ల పవన్ కళ్యాణ్ మద్దతు దారుల స్పందన ఏమిటీ?
7.గతం లో మూడు సార్లు ముఖ్యమంత్రిత్వం నిర్హహించిన చంద్రబాబు కు, ఇప్పుడు నాలుగోసారి ముఖ్యమంత్రిత్వం నిర్వహిస్తున్న చంద్రబాబుకు మధ్య మార్పు ఏమైనా ప్రజలు గమనిస్తున్నారా?

ఇటువంటి అనేకానేక ప్రశ్నలపై ఎప్పటికప్పుడు ప్రజాభిప్రాయం ఎలా ఉంటున్నదో తెలుసుకునే అంతర్గత విభాగం ఒకటి ఏర్పాటు చేసుకోవలసిన అవసరం ప్రభుత్వాధినేత కు ఉంది. కేవలం ప్రభుత్వాధినేత కు మాత్రమే జవాబుదారీగా ఈ విభాగం – సీఎంఓ లో ఒక భాగం గా పనిచేసే ఏర్పాటు ఉండాలి.

ప్రభుత్వం పట్ల ఆపేక్ష, సమాజ శ్రేయస్సు పట్ల సద్భావన కలిగిన ఒక పదవీ విరమణ చేసిన…. ఆరోపణలు లేని చీఫ్ సెక్రటరీ / డీజీపీ స్థాయి అధికారి నేతృత్వం లో ఒక అంతరంగిక బృందాన్ని ఏర్పాటు చేసుకోవలసిన అవసరం చంద్రబాబు నాయుడు కు ఉంది.

2024 లో ప్రజలు… తీర్పు చెప్పేశారు. అయిపోయింది.
ఇక, 2029 ఎన్నికలు…. తెలుగు దేశం కు, చంద్రబాబు నాయుడు కు, నారా లోకేష్ తో పాటు పవన్ కళ్యాణ్ కూ చాలా చాలా ముఖ్యం.

చంద్రబాబు నాయుడు వారసుడుగా నారా లోకేష్ – తనను తాను ప్రూవ్ చేసుకోవలసిన ఎన్నికలు అవి. అందుకే, తన క్షేమం కోరే అధికారులను చంద్రబాబు తన చుట్టూ మోహరింప చేసుకోవాలి. ఎప్పటికప్పుడు ప్రజాభిప్రాయానికి అనుగుణం గా పాలన సాగించాలి.

ఆయన – ఆంధ్రప్రదేశ్ కు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కాదు. ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి. ఆయనను మెచ్చుకోవలసింది…. అమెరికాలోని బిల్ గేట్స్, దావోస్ లోని ఎకనామిక్ ఫోరమ్ సభ్యులూ కాదు. అమలాపురం లో ఉండే అడపా అప్పారావు.

-భోగాది వేంకట రాయుడు

Leave a Reply