– బాబు అరెస్ట్ వెనుక బీజేపీ ఉందంటూ చర్చ
– అమిత్‌షా ఆదేశం లేకుంటే అరె స్టు చేయడం అసాధ్యమని చర్చ
– అదే మాట చెప్పిన సీపీఐ నారాయణ
– బీజేపీతో కొనసాగుతున్న బాబు పొత్తు చర్చలు
– ఇటీవల అమిత్‌షాతో చంద్రబాబు భేటీ
– ఎన్నికల్లో టీడీపీ-బీజేపీ-జనసేన కలసి పొటీ చేస్తాయన్న ఊహాగానాలు
– బీజేపీతో పొత్తు వద్దన్న టీ డీపీ నేతలు
– ముస్లింలు దూరమవుతారని సీనియర్ల ఆందోళన
– జగన్‌తో బీజేపీ బంధం కొనసాగుతోందన్న అనుమానం
– జగన్‌కు మోదీ రక్షకుడిగా ఉన్నారంటున్న పార్టీ నేతలు
– బీజేపీ ఇద్దరితో డబుల్‌గేమ్ ఆడుతోందన్న విశ్లేషణ
– ఈలోగా చంద్రబాబునాయుడు అరెస్ట్
– బీజేపీతో పొత్తు తేల్చుకునే సమయం వచ్చిందంటున్న తమ్ముళ్లు
– చంద్రబాబు.. కింకర్తవ్యం?
( మార్తి సుబ్రహ్మణ్యం)
అమిత్‌షా ఆదేశాలు లేకపోతే చంద్రబాబును అరెస్ట్ చేసే ధైర్యం జగన్‌రెడ్డి చేయడు- సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తాజాగా చేసిన ఆరోపణ ఇది. చంద్రబాబునాయుడు అరెస్టు తర్వాత ఇప్పుడు అందరి వేళ్లూ బీజేపీ వైపే చూపిస్తున్నాయి. కేంద్ర అనుమతి-ఆదేశాలు లేకపోతే.. చంద్రబాబు వంటి కీలక నేతను, సీఎం జగన్ సర్కారు అరెస్టు చేసే ధైర్యం చేయదన్నది, ఇప్పుడు సామాన్యుల్లో జరుగున్న చర్చ.
టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ వెనుక బీజేపీ హస్తం ఉందన్న ప్రచారంపై, రాజకీయవర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. కొద్దికాలం క్రితమే కేంద్రహోంమంత్రి అమిత్‌షాతో భేటీ అయి, పొత్తుపైచర్చించిన చంద్రబాబును, హటాత్తుగా జగన్ సర్కారు అరెస్ట్ చేయటంపై రాజకీయ వర్గాల్లో విస్మయం వ్యక్తమవుతోంది. బీజేపీతో పొత్తుకు సిద్ధమవుతున్న చంద్రబాబును అరెస్టు చేసే ధైర్యం, జగన్‌కు ఉండదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
అయితే.. అమిత్‌షాతో భేటీ తర్వాత, బీజేపీతో పొత్తుపై బాబు తన పార్టీ సీనియర్ల అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఆ సందర్భంలో మెజారిటీ నేతలంతా, బీజేపీతో పొత్తు పెట్టుకుంటే నష్టపోతామని స్పష్టం చేశారు. పొత్తు కంటే, ఎన్నికల తర్వాత బీజేపీకి మద్దతునిస్తామని చెబితే బాగుంటుందని సూచించారు. మైనారిటీలు వ్యక్తిగతంగా మోదీపై ఆగ్రహంతో పాటు, మోదీకి జగన్ మద్దతునిస్తున్నారన్న అసంతృప్తితో ఉన్నారని బాబుకు గుర్తు చేశారు. ఈ పరిస్థితిలో మైనారిటీలను మనం దూరం చేసుకుంటే, రాజకీయంగా నష్టపోతామని హెచ్చరించారు.
అదీగాక బీజేపీ రాష్ర్టానికి ఏమీ చేయలేదన్న ఆగ్రహం కూడా ప్రజల్లో ఉందన్నారు. ప్రధానంగా విశాఖ స్టీల్, రైల్వే జోన్‌కు సంబంధించి.. ఉత్తరాంధ్రకు చెందిన మూడు జిల్లాల ప్రజలు, బీజేపీ-దానితో సత్సంబంధాలున్న వైసీపీని వ్యతిరేకిస్తున్నారని, బాబు వద్ద విశ్లేషించినట్లు తెలుస్తోంది.
దానికితోడు.. జగన్‌ను బీజేపీ అన్ని విధాలా ప్రోత్సహిస్తోందని, ప్రధానంగా మోదీ ఆయనపై, పుత్రవాత్సల్యంతో ఉన్నారని సీనియర్లు బాబుకు గుర్తు చేశారు. ఇటీవల టీటీడీ బోర్డులో కూడా బీజేపీ నేతలు సిఫారసు చేసిన వారినే నియమించారని గుర్తు చేశారు. నిజంగా బీజేపీకి టీడీపీతో పొత్తు పెట్టుకోవాలన్న ఆలోచన ఉంటే, జగన్ కు ఎలాంటి రాజకీయ-ఆర్ధిక సహకారం అందించకూడదని విశ్లేషిస్తున్నారు.
కేంద్రమంత్రులు, పార్టీ అగ్రనేతలు జగన్‌తో సత్సంబంధాలు కొనసాగిస్తున్నారంటే.. బీజేపీ ఏపీలో డబుల్‌గేమ్ ఆడుతోందని గ్రహించాలని, చాలామంది టీడీపీ సీనియర్లు బాబు వద్ద విశ్లేషించినట్లు తెలుస్తోంది.
నిజానికి చంద్రబాబు కూడా అమిత్‌షా-నద్దా భేటీలో.. పొత్తుకు సంబంధించి వారికి ఎలాంటి హామీ ఇవ్వలేదని, పార్టీనేతలతో చర్చించి చెబుతామన్నట్లు టీడీపీ వర్గాల సమాచారం. ప్రధానంగా వారి చర్చ, తెలంగాణలో పొత్తు గురించే జరిగినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దానిపై కూడా చంద్రబాబు హోంమంత్రి అమిత్‌షాకు ఎలాంటి స్పష్టత ఇవ్వలేదంటున్నారు.
ఈ క్రమంలో హటాత్తుగా చంద్రబాబును.. బీజేపీకి సన్నిహితంగా ఉండే జగన్ సర్కారు అరెస్టు చేయడంపై, భిన్నాభిప్రాయాలు-అనేక అనుమానాలు తెరపైకి వస్తున్నాయి. బీజేపీతో పొత్తుపై బాబు ఇప్పటివరకూ ఎలాంటి స్పష్టత ఇవ్వని నేపథ్యంలో.. బాబును లొంగదీసుకునే ఎత్తుగడలో భాగంగా, బెదిరించేందుకే బాబును అరెస్టు చేశారా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. టీడీపీ వర్గాల్లో ఇలాంటి అనుమానాలే వినిపిస్తున్నాయి.
కేంద్రానికి అన్నీ చెప్పే చేస్తున్న జగన్.. కీలకనేత చంద్రబాబును అరెస్టు చేసే విషయంలో మాత్రం, బీజేపీకి చెప్పకుండా ఎలా ఉంటారన్న ప్రశ్నలు తెరపైకొస్తున్నాయి. అమిత్‌షా ఆదేశాలు-అనుమతి లేకపోతే, చంద్రబాబు వంటి కీలక నేతను అరెస్ట్ చేయడం అసాధ్యమన్నది, చిన్నపిల్లాడికి సైతం తెలుసన్న చర్చ క్షేత్రస్థాయిలో జరగడం గమనార్హం. సీపీఐ నేత నారాయణ కూడా అమిత్‌షా ఆదేశాలతోనే బాబును అరెస్టు చే శారని సంచలన ఆరోపణలు చేశారు.
అయితే బీజేపీ నేతలు మాత్రం.. చంద్రబాబు అరెస్ట్‌తో బీజేపీకి సంబంధం లేదని, కేంద్రం వేరు-పార్టీ వేరన్న పడికట్టు పదాలతో తప్పించుకున్నా.. బీజేపీ అనుమతి లేకుండా, బాబును అరెస్టు చేయటం అసంభవమన్న చర్చ జరుగుతోంది.
ఈనేపథ్యంలో జైల్లో ఉన్న చంద్రబాబుకు.. బీజేపీతో పొత్తుపై ఏదో ఒక నిర్ణయంపై, లాభనష్టాలు బేరీజు వేసుకునే సమయం కలసి వచ్చిందంటున్నారు. ఎలాగూ జైల్లో వేసినందున, ఇక అంతకుమించిన అవమానం లేదు. కాబట్టి ఇక బీజేపీకి భయపడాల్సిన పనిలేదు. అందువల్ల ఆ పార్టీతో సంధా? సమరమా? అన్నది నిర్ణయించుకునేందుకు ఇదే తగిన సమయని, అటు టీడీపీ సీనియర్లు కూడా స్పష్టం చేస్తున్నారు. మరి చంద్రబాబు నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలి.