– జగన్ కి ఒక క్లారిటీ ఉంది.. మరి నీ సంగతేంటి..?
– చంద్రబాబు ఏ రాష్ట్రంలో రాజకీయం చేయాలనుకుంటున్నాడు..?
– ఏపీలో బీజేపీతో దోస్తీ కోసం తెలంగాణలో బాబు తంటాలు
-తెలంగాణలో సరే.. మరి ఏపీ బీజేపీలో ఉన్న స్లీపర్ సెల్స్ సంగతేంటి..?
-పల్నాడును వల్లకాడు చేయాలన్నదే బాబు కుట్ర
-చంద్రబాబు బటన్ నొక్కితేనే.. డీఎల్ మాట్లాడాడు
-ఆర్ధిక మంత్రి ఏమన్నారో కానీ.. వీళ్ళది మాత్రం పైశాచిక ఆనందం
-రుషికొండపై కమిటీ వేస్తే మంచిదేగా.. అందులో దాచుకోవాల్సింది ఏమీ లేదు
– ప్రభుత్వ సలహాదారు (ప్రజావ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి
బాబూ.. నీవు ఎక్కడ ఉండాలనుకుంటున్నావ్.?
చంద్రబాబు ఏ రాష్ట్రంలో రాజకీయం చేయాలనుకుంటున్నాడో తెలియడం లేదు. 2014లో తెలంగాణాలో యాక్టివ్‌గా ఉన్న చంద్రబాబు అకస్మాత్తుగా ఎందుకు మారిపోయాడో అర్ధం కావడం లేదు. ఇప్పుడు ఉన్నట్లుండి మళ్ళీ తెలంగాణాలో మా పార్టీ ఉంది అని ఎందుకు చెప్పదలుచుకున్నాడో… ఎటువంటి ప్రయోగం చేయాలనుకుంటున్నాడో ముందుగా ప్రజలకు చంద్రబాబు వివరించాలి. ఆయనకు హైదరాబాద్‌లోనే ఇళ్లు ఉంది…మొన్నటి వరకూ ఆయన ఓటు కూడా అక్కడే ఉంది. ఆయన తెలంగాణా రాజకీయాల్లో ప్రజలకు సేవ చేయాలనుకుంటే మంచిదే. కానీ ఎన్నికలొచ్చే సమయానికి అక్కడికి వెళ్లి ప్రజలతో ఆడుకోవడం, రాజకీయాలంటే ఒక ఆట అనుకునే అలవాటు చంద్రబాబుకు ఉంది. అదే ఇప్పుడు అనుసరిస్తున్నాడు.
ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి మళ్లీ తెలంగాణా వెళ్లి హడావుడి చేస్తున్నాడు. గత ఎన్నికలను గమనిస్తే రాహుల్ గాంధీని ప్రధానిని చేయాలని, యూపీఏకు కన్వీనర్ కావాలనుకున్నాడో ఏమో కానీ, దేశంలో చక్రం తిప్పుతానంటూ ఆయనతో తిరిగి చతికిలపడ్డాడు. అసలు చంద్రబాబు ఎక్కడ ఉండాలనుకుంటున్నాడో, ఏం చేయాలనుకుంటున్నాడో స్పష్టత ఇవ్వడు. జగన్ గారికి ఒక స్పష్టత ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రానికి సేవ చేయాలనుకున్నారు. అనివార్యంగా, అన్యాయంగా విభజన జరిగింది. ఆ తర్వాత ఏపీలో సేవ చేయాలని జగన్ నిర్ణయం తీసుకున్నారు.
ముందు చంద్రబాబు కూడా ఈ విషయంలో తనకు, ఏవిధమైన క్లారిటీ ఉందో చెప్పాలి. గతంలో కాంగ్రెస్‌తో ప్రయోగం చేశాడు..ఇప్పుడు ఏదోవిధంగా తెలంగాణలో తమతో బీజేపీ కలిస్తే.. వారికే ప్రయోజనమనే భావన కలిగించే ప్రయత్నం చేస్తున్నాడు. తద్వారా తెలంగాణలో బీజేపీతో పొత్తు పెట్టుకుని, దాన్ని ఆంధ్రప్రదేశ్ కు కూడా విస్తరించేలా చంద్రబాబు పావులు కదుపుతున్నట్టు ఉన్నాడు. తన ప్రణాళికలో భాగంగానే, చంద్రబాబునాయుడు నిన్నటి ఖమ్మం సభ పెట్టినట్లుంది. తన ఈ ప్రతిపాదనకు బీజేపీని ఒప్పించేందుకు, ఆ పార్టీలోని తన మనుషుల ద్వారా శతవిధాలా చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నాడు.
మరి బీజేపీలో ఉన్న స్లీపర్ సెల్స్ సంగతేంటి..?
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా చంద్రబాబుది రెండు కళ్ల సిద్ధాంతమే. రాత్రికి ఒక మాట..పగలు ఒక మాట…ఒక్కో పార్టీ వద్ద ఒక్కో మాట మాట్లాడుతూనే ఉన్నాడు. ఆయన మాటలకి, చేతలకు విలువ ఉండదు. తెలంగాణా వెళ్లి రెండు రాష్ట్రాలు విడివిడిగానే ఉండాలని మాట్లాడుతున్నాడు తప్ప, ఆంధ్రప్రదేశ్‌లో ఆ మాట మాడ్లాడటం లేదు. అక్కడికి వెళ్లి పాత తెలుగుదేశం వాళ్లంతా రండి అంటున్నాడు. ఇక్కడ ఏపీలో బీజేపీ స్లీపర్ సెల్స్‌గా ఉన్నవారిని మాత్రం పిలవడం లేదు. బహుశా తెలంగాణాలో టీఆర్‌ఎస్‌లో ఉన్నవాళ్లు రావాలని పిలుపునిస్తున్నాడా లేక కాంగ్రెస్‌లో తన స్లీపర్ సెల్స్ గా ఉన్న వాళ్లని రావాలని పిలుపునిస్తున్నాడో కూడా అర్ధం కావడం లేదు. మొత్తానికి మాత్రం తనకు తెలంగాణాలో డిమాండ్ ఉంది..ఆంధ్రాలో మీరు మాతో పొత్తు పెట్టుకుంటే… బీజేపీకి తెలంగాణాలో ఉపయోగపడతాం అని బీజేపీతో చెప్పుకోడానికి, అక్కడి తన అనుచరులతో మద్దతు ఇప్పిస్తానని చెప్పుకోడానికే చంద్రబాబు సభ జరిపినట్లు ఉంది.
చంద్రబాబు బటన్ నొక్కితే డీఎల్ మాట్లాడారు..!
డీఎల్ రవీంద్రారెడ్డి వైఎస్సార్సీపీలోనే ఉన్నానని ఇప్పుడెందుకు అనుకుంటున్నారో మాకు అర్ధం కాలేదు. 2019 ఎన్నికల సమయంలో మా పార్టీలోకి వచ్చాడు. ఆ రోజే ఫీల్ఢ్‌లో ఏం జరిగిందో అక్కడి ఎమ్మెల్యే చెప్తారు. ఆయన పార్టీలో ఉంటే ఇన్నాళ్లు ఎక్కడున్నారు.. మధ్యలో చాలా జరిగాయి.. ఆయన పార్టీలో ఉన్నట్లయితే ఎప్పుడో యాక్షన్ తీసుకునేవాళ్లం. ఆయన పార్టీలో ఉన్నారని ఎవరూ అనుకోవడం లేదు. మరో వైపు చంద్రబాబు మాత్రమే రాష్ట్రాన్ని కాపాడతాడు అన్నప్పుడే ఆయన ఎవరు మాట్లాడిస్తే మాట్లాడుతున్నాడో అర్ధం అవుతుంది. మరో వైపు నిన్న మా నాయకుడు పుట్టినరోజు వేడుకలు జరుగుతున్నాయి…విద్యార్థులకు టాబ్స్ పంపిణీ చేసే గొప్ప కార్యక్రమం జరుగుతున్నప్పుడు ఏదో ఒకటి మాట్లాడాలి…చంద్రబాబు బటన్ నొక్కితే ఇక్కడ డీఎల్ మాట్లాడినట్లు కన్పిస్తోంది.
బైజూస్ నష్టాలకు.. ఉచితంగా ఇస్తున్న కంటెంట్ కు సంబంధం ఏమిటి..?
ట్యాబ్‌ల పంపిణీలో వాళ్లిష్టం వచ్చినట్లు విమర్శిస్తున్నారు. ట్యాబ్స్ విలువే 500, 600 కోట్లు ఉంటుంది. కంటెంట్ ను బైజూస్ ఫ్రీగా ఇస్తోంది. అది కూడా తెలియకుండా 1400 కోట్ల అవినీతి అని టీడీపీ నేతలు సిగ్గులేకుండా మాట్లాడుతున్నారు. టెండర్ల విధానంలో ఒక స్టాండర్డ్ కంపెనీ శాంసంగ్ ముందుకు వచ్చింది. వారిచ్చిన కోట్ కంటే మరింత తగ్గించేలా చర్చలు కూడా జరిపాం. ఆ ట్యాబ్స్ లో ఫీచర్స్ అధికంగా ఇస్తున్నారు. అవే ఫీచర్లతో అలాంటి ట్యాబ్ లు ఇంకా తక్కువ ధరకు ఇప్పించగలిగితే.. టీడీపీ వాళ్లు అన్నట్లు 12 వేలకు ఇప్పించగలిగితే వాళ్లే టెండర్‌లో పాల్గొనొచ్చు. ఇక్కడ అవినీతి జరగడానికి అవకాశం ఎక్కడుంది.
రివర్స్ టెండరింగ్ కూడా ఉంది. రివర్స్ టెండర్ లో శాంసంగ్ ఎల్ 1 గా వచ్చింది. ఆ తర్వాత కూడా చర్చలు జరిపి ఫీచర్లు పెంచేలా చేశాం. దీంట్లో కూడా వందల కోట్ల అవినీతి ఉందంటూ విమర్శిస్తున్న పార్టీ, పత్రికలు ఏ ఉద్దేశంతో అంటున్నాయో అర్ధం చేసుకోవచ్చు. వాళ్లు ఉచితంగా ఇస్తున్న కంటెంట్‌కి బైజూస్ నష్టానికి సంబంధం ఏముంటుంది..? మరోవైపు మార్గదర్శి మీద కేసు నడుస్తోంది…మరి అందులో ఈనాడు పత్రిక లేదని అంటామా..?. మార్గదర్శి ద్వారా ప్రజల సొమ్ము అంతా ముంచిన పెద్ద కేసు నడుస్తోంది కదా..? అలా అని ఈనాడు నడవడం లేదా..? బాలల హక్కుల కమిషన్ పిలిచింది అంటూ ఆంధ్రజ్యోతి వార్తలు రాసింది..అసలు కంటెంట్‌కి దానికి సంబంధం ఏముంది…అందులోనూ బైజూస్ ఉచితంగా కంటెంట్ ఇచ్చింది. టీడీపీ పొలిటికల్ ఎజెండాను ఎల్లో పత్రికల్లో చొప్పిస్తున్నారు.
అవి కుల ప్రాతిపదికన ఇచ్చే రిజర్వేషన్లు కావని సుప్రీం ఆనాడే చెప్పింది
కాపు రిజర్వేషన్లలో టీడీపీ, వారి అనుకూల పత్రికలు ప్రచారం చేస్తున్నట్లు కేంద్రం ఏమీ చెప్పలేదు. నిర్ణయం రాష్ట్ర పభుత్వం ఇష్టం అని మాత్రమే అన్నారు. ఒక వేళ 5 శాతం రిజర్వేషన్లు ఇచ్చే అవకాశమే ఉంటే ఆనాడే చంద్రబాబు అమలు చేసి ఉండోచ్చు కదా… చేయలేదంటే అర్ధం ఏమిటో ప్రజలు గమనించాలి. అప్పట్లో సుప్రీం కోర్టు క్లారిటీ ఇచ్చింది..ఇది కుల ప్రాతిపదికన కాకుండా ఆర్ధిక పరిస్థితిని బట్టి ఇవ్వాలని చెప్పింది. కుల ప్రాతిపదికన తీసుకోవడానికి వీల్లేదని స్పష్టం చెప్పింది. టీడీపీ వాళ్లు అడిగిన ప్రశ్నకు కేంద్రం ఇచ్చిన సమాధానంలోనూ స్పష్టత లేదు. మనం సాధారణంగా ఆలోచించినా, ఆర్ధిక పరిస్థితి ప్రాతిపదిక అయినప్పుడు కులం ప్రాతిపదిక కాదనేది అర్ధం అవుతుంది. దానికి భిన్నంగా ఏదన్నా ఉంటే చర్చకు దారి తీస్తుంది.. న్యాయ సమీక్షకు వెళ్లే పరిస్థితి వస్తుంది.
పల్నాడును వల్లకాడు చేయాలన్నదే బాబు కుట్ర
పల్నాడును.. చంబల్ వ్యాలీ అని ఒకడు …తాలిబాన్ రాజ్యం అని మరొకడు చిత్రీకరిస్తూ, విద్వేషాలు రెచ్చగొడుతున్నారు. పల్నాడును వల్లకాడు చేయాలనే దురాలోచనతో చంద్రబాబు మొదలు పెట్టిన కుట్ర అది. అటువంటి దాన్ని ఈ ప్రభుత్వం ఎప్పుడూ అనుమతించదు. పల్నాడు ఎప్పుడూ ప్రశాంతంగానే ఉంటుంది. వైఎస్సార్సీపీ అక్కడ బలంగా ఉంది కాబట్టి అక్కడ ప్రశాంతతే ఉంటుంది. ఏదో జరిగిపోతోంది అనే వాతావరణం క్రియేట్ చేసేందుకు టీడీపీ నేతలు ప్రయత్నం చేస్తున్నారు. వారి కుట్రలు సాగవు. మాచర్లలో టీడీపీ ఇన్ చార్జిగా బ్రహ్మారెడ్డిని దించినప్పటి నుంచీ ఈ అరాచకాలు జరుగుతున్నాయి.
వారు జనంలో ఎక్కడున్నారు..?
ఉత్తరాంధ్ర పర్యటనకు వెళ్తున్న చంద్రబాబును అడ్డుకోవడానికి మాకేం అవసరం లేదు. ఆయన వెళ్తే అక్కడేమన్నా పెద్ద ఎత్తున జనం వస్తారా..? ఆయన్ను అడ్డుకుంటే మాకేం వస్తుంది…పోలీసులకు మాకూ పని లేదా…? ఆయన గాని, ఆయన కొడుకు గాని, ఆయన దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ గానీ జనంలోకి వెళ్తే మాకే మంచిది. అసలు చంద్రబాబు జనంలో ఉండటం లేదనేదే మా ఫిర్యాదు. వాళ్లు జనంలో ఉండి ఇక్కడ లోపం ఉందని చెప్తే దాన్ని సరిదిద్దుకోడానికి మేము ఎప్పుడూ సిద్ధంగానే ఉన్నాం. కానీ చంద్రబాబు హైదరాబాద్‌లో ఉండి అప్పుడప్పుడు టూరిస్టులా ఇక్కడికి వస్తుంటారు. వచ్చినప్పుడు నడిరోడ్డులో ట్రాఫిక్ ఉన్న చోట కారు పైకెక్కి ఒక క్లోజప్ ఫోటో తీసి ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికల్లో ప్రచురించుకుంటారు. వెంటిలేటర్‌పై ఉన్న పార్టీ గురించి ఆలోచించాల్సినంత అవసరం మాకు లేదు.
ఆర్థిక మంత్రి ఏమన్నారో కానీ, వీళ్ళది మాత్రం పైశాచిక ఆనందం..
నిర్మలా సీతారామన్ మాటలను ఎవరికి వారుగా అన్వయించుకుంటే మేం ఏమీ చేయలేము. మా ప్రభుత్వం జాతీయ స్థాయిలో విపరీతంగా ప్రకటనలు ఇస్తున్నదైతే ఎక్కడా లేదు. కేంద్రం ఇచ్చిన విధివిధానాల ప్రకారమే ఇక్కడి పథకాలు గురించి మేం చెప్పుకుంటున్నాం. ప్రతి పథకంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు నిర్ణీత శాతం మేర ప్రకటనలు ఇవ్వాలని కేంద్రమే విధివిధానాలు పెట్టింది. వాళ్లు ఏ ఉద్దేశంతో అన్నారో తెలియదు కానీ వీళ్లు మాత్రం కార్టూన్లు వేసి పైశాచిక ఆనందం పొందాలని చూస్తే అది వారి ఖర్మ. కేంద్రం కూడా అప్పులు చేస్తుంది..గతంలో ఎన్నడూ లేని విధంగా అప్పులు చేస్తున్నారు. కోవిడ్ తర్వాత వాళ్లు కూడా ఖర్చు చేయాల్సి వస్తోంది. బ్యాలెన్స్ తప్పితే ప్రజలు ఇవ్వాల్సిన తీర్పు ఇస్తారు. ఈ ప్రత్యేక అంశంలో కేంద్ర ఆర్ధిక మంత్రి ఏ విషయంలో మాట్లాడారో తెలుసుకోకుండా మేం ఉలిక్కి పడాల్సిన అవసరం లేదు.
రుషికొండపై కమిటీ వేస్తే మంచిదేగా.. దాచుకోవాల్సింది ఏమీ లేదు
రుషికొండ విషయంలో కోర్టు ఇచ్చిన తీర్పు వాళ్ల స్వేచ్ఛ. ఏం చేసినా అదేం రహస్యంగా జరిగేది కాదు కదా..? కొండ అక్కడే ఉంది..అక్కడ బిల్డింగ్ కట్టాలంటే ఖచ్చితంగా రోడ్డు వేయాల్సి వస్తుంది. గుట్టలు ఉన్న చోట అలానే వస్తుంది. మిలీనియం టవర్స్ కట్టేటప్పుడు కూడా అదే చేశారు. కోర్టు అక్కడ వాస్తవం ఏమిటో చూడాలని కమిటీ వేసినట్లు ఉంది. వాళ్లు వచ్చి చూసి అక్కడి వాస్తవాలు తెలుసుకుంటారు. అక్కడ రహస్యంగా దాచిపెట్టుకోడానికి ఏమీ లేదు.