-పేదలకు చోటు లేదు. రైతుల జాడే లేదు
-బాబు బినామీల డ్రామాలకు ‘సరుకు’ లేని పార్టీల మద్దతు
-చంద్రబాబు రాజకీయమే ‘అమరావతి ఉద్యమం’
-అలాంటి ఉద్యమాల్ని లక్ష రోజులైనా నడిపించవచ్చు
-అరసవల్లి పాదయాత్ర మధ్యలోనే తోక ముడిచారు
-అప్పుడే అది ఫేక్ ఉద్యమం అని నిజమైంది
-తొడేళ్ల మందకు నాయకుడుగా చంద్రబాబు
-బాబు ఉచ్చులో కమ్యూనిస్టులు, బీజేపీ, ఇతర పార్టీల నేతలు
-న్యాయ రాజధాని కర్నూలులో ఉండాలన్న బీజేపీ
-ఇప్పుడేమో అన్నీ అమరావతిలోనే ఉండాలనడం ఏమిటి?
-ప్రపంచం ఆమోదించిన వికేంద్రీకరణను ఎందుకు వ్యతిరేకిస్తున్నారు?
-బాబు లక్షల కోట్ల భూకుంభకోణాలపై స్పందన ఏది?
-వైఎస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి
లక్ష రోజులైనా ‘కృతిమమే’:
అమరావతి పేరిట జరుగుతున్నది ఉద్యమం కాదు. కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు, బాబు బినామీలు ఆశించిన అవినీతి కుంభకోణం సఫలం కాలేదు. దీంతో ఒక కృతిమ ఉద్యమం నడుపుతున్నారు. ఈ విషయాన్ని మేము ముందు నుంచే చెబుతున్నాం. అమరావతి–అరసవెల్లి పాదయాత్ర మధ్యలోనే తోక ముడవడంతో అది రుజువైంది. వాస్తవానికి అమరావతిలో భూములు ఇచ్చిన రైతులంతా వాళ్ల మిగిలిన భూములు కూడా ఎప్పుడో అమ్మేసుకున్నారు. ఇంకొందరు తమకు వచ్చిన ప్లాట్లు కూడా అమ్మేసుకుని వేరే చోట భూములు కొనుక్కున్నారు. చంద్రబాబు చూపిన గ్రాఫిక్స్‌లో రాజధాని అమరావతి చూసి వ్యాపారం కోసం భూములు కొన్న వారే ఈ కృతిమ ఉద్యమంలో పాల్గొంటున్నారు. అదంతా చంద్రబాబు రాజకీయం. అది 1200 రోజులైందని కాదు.. ఒక ఆర్గనైజ్డ్‌గా 200 మందో, లేక 500 మందితోనో లక్ష రోజులు కూడా జరుపుకోవచ్చు.
బాబుకు బంగారు గుడ్ల బాతు:
చంద్రబాబు హయాంలో కరకట్ట రోడ్డు కూడా విస్తరించలేదు. ఇప్పుడు సీఎం వైయస్ జగన్ ఆ పని చేస్తున్నారు. నిజానికి అప్పుడు ఆ రోడ్డు విస్తరణను ఎవరూ వద్దనలేదు? అయినా చంద్రబాబు ఆ రోడ్డును పట్టించుకోలేదు. దాని అర్థం ఏమిటంటే.. 20, 30 ఏళ్లపాటు అలా రాజధాని ప్రాంతంలో నిర్మాణాలు, అభివృద్ధి పనులు చేస్తూ ఉండాలనేదే చంద్రబాబు వ్యూహం.
పోలవరంను చంద్రబాబు ఏటీఎంలా వాడుకున్నాడని ప్రధాని మోదీ స్వయంగా చెప్పారు. అలాగే రాజధాని అమరావతి కూడా బంగారు గుడ్లు పెట్టే బాతుగా చంద్రబాబు భావించారు. కానీ, ఆయన కలలన్నీ కూలిపోవడంతో.. కొందరు పెత్తందార్లను ఉసిగొల్పి మిగిలిన రాజకీయ పార్టీలను కూడగట్టిన చంద్రబాబు కృతిమ ఉద్యమంతో రాజకీయం చేస్తున్నాడు.
తొడేళ్ల మందకు నాయకుడు:
తెలుగుదేశం ఎజెండాలో ప్రజలు అనే పదమే లేదు. ప్రజల అభివృద్ధి. ప్రజా సంక్షేమం ప్రధాన లక్ష్యాలుగా మా ప్రభుత్వం పని చేస్తోంది. దీన్ని జీర్ణించుకోలేని చంద్రబాబు తోడేళ్ల మందగా అందరినీ కూడగట్టుకుని, దానికి నాయకత్వం వహిస్తూ.. ఏవేవో కథలు అల్లుతూ.. వాటినే నిజమని భ్రమింప చేసే ప్రయత్నం చేస్తున్నారు.
అలా మాట్లాడితే ప్రతిఘటన సహజమే:
అమరావతి ప్రాంతంలో ఈరోజు దాడులు జరిగాయనడంలో అర్ధం లేదు. అసలు, అక్కడ దాడులు జరగాల్సిన పనేంటి? చంద్రబాబు రాజకీయ కుట్రలో భాగంగా, రెచ్చగొట్టడం వల్ల అక్కడ జరిగే కృతిమ ఉద్యమాలకు వచ్చిన పార్టీల నాయకులు ఇష్టానుసారం బూతులు మాట్లాడుతున్నారు. ఆ విధంగా మాట్లాడే నేతల్ని కట్టడి చేయడానికి అభ్యంతరపెట్టిన వారిపై దౌర్జన్యం చేయడం.. మరలా తిరిగి తమపైనే దాడి చేశారంటూ బాబు, ఆయన బినామీలు నానా యాగీ చేస్తున్నారు. అందులో భాగంగానే ఈరోజు దాడులంటూ విమర్శిస్తున్నారు. ప్రజాస్వామ్యవాదులు ప్రశ్నిస్తే.. మమ్మల్ని ఎలా నిలదీస్తారంటూ.. బాబు, ఆయన కొడుకు వ్యవహరిస్తున్న సంగతి అందరూ చూస్తూనే ఉన్నారు.
చంద్రబాబు ఉచ్చులో..:
అమరావతిలో కృతిమ ఉద్యమం నడుపుతున్న చంద్రబాబు ఉచ్చులో వామపక్షాలు, బీజేపీతో పాటు, కొన్ని పార్టీల నాయకులు కూడా పడ్డారు. ఈ సందర్భంగా ఆ పార్టీలను కొన్ని ప్రశ్నలు అడుగుతున్నాం.
లక్ష కోట్లు ఎలా?:
అమరావతిలో రాజధాని నిర్మాణంలో మౌలిక వసతులకే 5 లక్షల కోట్లు కావాలని ఆనాడు కేంద్రాన్ని అడిగిన చంద్రబాబు, చివరకు లక్ష కోట్లకు పైగా ఖర్చు చేయాలని ప్రతిపాదించాడు. కానీ ప్రభుత్వపరంగా ఖర్చు చేసింది కేవలం రూ.1500 కోట్లు కాగా, కేంద్రం ఇచ్చింది మరో రూ.1200 కోట్లు. ఇంకా కొన్ని అప్పులతో పనులు చేశారు. అన్నీ కలిపి చూసినా, రాజధాని నిర్మాణంలో చంద్రబాబు తన హయాంలో కనీసం ఐదారు వేల కోట్లు కూడా ఖర్చు చేయలేదు. కానీ ఇప్పుడేమో ఏమీ లేకుండానే రాజధానిని నడపొచ్చని అంటున్నారు. అంటే, రోడ్లు, భవనాలు ఏవీ సరిగ్గా లేకపోయినా ఇక్కణ్నుంచే పరిపాలన చేయాలా? లేక లిబియాలో గడాఫీ టెంట్లు వేసుకుని పాలించినట్లు ఇక్కడా చేయాలా?
మరి అలాంటప్పుడు చంద్రబాబు ఆనాడు ప్రతిపాదించిన లక్ష కోట్లు ఏడాది, రెండేళ్లలో ఎక్కణ్నుంచి తేవాలి? ఇది మా మొదటి ప్రశ్న.
వికేంద్రీకరణపై ఎందుకు వ్యతిరేకత?:
ఈరోజు వికేంద్రీకరణ అనేది ‘ఆర్డర్ ఆఫ్ ది డే’ అయ్యింది. వికేంద్రీకరణ అనేది ప్రపంచం అంతా సమర్థిస్తున్న విధానమైనప్పుడు ఇక్కడ అసాధ్యమైంది. వికేంద్రీకరణ అనేది సహజమైనది. దాని వల్ల ఆర్గానిక్ గ్రోత్ కూడా ఉంటుంది. ప్రజల ఆకాంక్షలు కూడా నెరవేరుతాయన్న ఉద్దేశంతో సీఎం వైయస్ జగన్ వికేంద్రీకరణ ప్రతిపాదించారు. మరి దాన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్న దానికి రాజకీయ పార్టీలు సమాధానం చెప్పాల్సిన అవసరముంది.
అప్పుడో మాట. ఇప్పుడో మాట:
కమ్యూనిస్టు పార్టీలు ఆనాడు ఒక రీతిగా, ఈరోజు మరో విధంగా వ్యవహరిస్తున్నాయి. ఆనాడు చంద్రబాబు రాజధాని పేరిట రైతుల భూముల్ని లాక్కున్నప్పుడు, వ్యవసాయం మీద ఆధార పడిన లక్షలాది కుటుంబాలు.. తమ ఉపాధి పోతుందని రోడ్డెక్కి ఉద్యమించినప్పుడు ఇదే కమ్యూనిస్టులు ఏమాత్రం స్పందించ లేదు. ఈరోజు మా ప్రభుత్వం వ్యవసాయ కూలీలకు పెన్షన్లు, కౌలు సకాలంలో చెల్లిస్తోంది. అయినా కృతిమ ఉద్యమాలు నడిపిస్తున్న వారికే కమ్యూనిస్టులు మద్దతు ఇస్తున్నారు. గతంలో కమ్యూనిస్టు పార్టీలు ఏయే అంశాలపై ఉద్యమాలు, ఆందోళన చేసేవో.. వాటన్నింటినీ ఈరోజు సీఎంగారు అమలు చేస్తున్నారు. దీంతో పార్టీ అజెండానే లేకుండా పోయే పరిస్థితుల్లో వారికి దిక్కు తోచడం లేదు.
రెండు నాలుకల ధోరణితో బీజేపీ:
కర్నూలుకు హైకోర్టు కావాలని ఆరోజు పిలుపునిచ్చిన బీజేపీ ఈరోజు అమరావతిలోనే మొత్తం ఉండాలని ఎందుకు కోరుతోంది?. అమరావతి పేరిట అక్కడ జరిగిన భూకుంభకోణాలను ఎవరైనా సమర్థించగలరా? అనేది మా మూడో ప్రశ్న. రాజధాని పేరిట వేల కోట్ల భూకుంభకోణం జరిగింది. దర్యాప్తులో ఏమేం బయట పడ్డాయనేది అందరికీ తెలిసిందే. వేల ఎకరాలను బినామీ కంపెనీలకు ఎలా ధారదత్తం చేశారనేది కూడా తేటతెల్లమైంది. ఇప్పుడు అమరావతి ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్నా, వికేంద్రీకరణను ఎందుకు వ్యతిరేకిస్తున్నారనే దానికి సమాధానమివ్వాలి.
అమరావతి రైతుల్లో ఆనందం:
విపక్షాలు ప్రచారం చేస్తున్నట్లు.. అక్కడ రైతులకు మోసం జరగలేదు. భూములిచ్చిన రైతులకు ప్లాట్లు కేటాయించడం జరిగింది. ఆయా ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది. రైతులకు ఇచ్చే కౌలు కూడా పెంచాం. చెల్లింపు ఏళ్లను పెంచాం. దీంతో అక్కడి రైతులంతా సంతోషంగా ఉన్నారు.
పెట్టుబడిదార్లకే నష్టం:
ఇక్కడ నష్టం ఎవరికి జరిగిందంటే కేవలం ఇక్కడ పెట్టుబడులు పెట్టి, భారీ లాభాలు ఆశించిన వారికే. గుంటూరు, విజయవాడ ప్రాంతాల్లో భూములు రేట్లు బాగా పెరిగి అందరూ సంతోషంగానే ఉన్నారు. ప్రభుత్వ నిర్ణయం వలన ఇప్పటివరకు ఎవరూ నష్టపోయిన దాఖలాల్లేవు. రాజధాని ప్రాంతంలో రైతులకు ప్రభుత్వం వాగ్దానం చేసిన హామీలన్నీ నెరవేరతాయి కనుక అక్కడెవరూ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అక్కడ లెజిస్లేటివ్ క్యాపిటల్ వస్తుందని మా ప్రభుత్వం ఇప్పటికే చెప్పింది.
మార్గదర్శి అక్రమాల పుట్ట పగులుతుంది:
ఈరోజు మార్గదర్శి సంస్థ చిట్‌ఫండ్ మోసాలుకు సంబంధించి పోలీసులు, ఐటీ అధికారుల విచారణలో పుట్ట పగులుతుంది. రామోజీ ఫిల్మ్ సిటీ పేరిట వేల ఎకరాల భూకబ్జాల భాగోతాలు కూడా బయటకు రాబోతున్నాయి. ఈనాడు అనే సంస్థను పెట్టి మీడియా రౌడీయిజం అంటూ సాగుతున్న పెద్దమనిషి రామోజీరావు భాగోతం ఈరోజు బయటపడింది.
నాడు అగ్రిగోల్డ్, సహారా సంస్థల్లాంటి మోసాల్లాగానే ఇప్పుడు రామోజీరావు మార్గదర్శి మోసాలు వరుసగా బయటపడుతున్నాయి. ఈయన అందరి మీద అవినీతి, మోసాలు అంటూ కథనాలు రాస్తారు. ప్రజల సొమ్ముతో ఏ బాధ్యత, ఏ పూచీ లేకుండా వ్యాపారం జరుగుతున్న సంస్థగా మార్గదర్శి ఉన్నప్పుడు పోలీసులు ఎందుకు దర్యాప్తు చేయొద్దు? సంస్థకు అసలు బాధ్యులెవరో తెలియకుండానే జనం దగ్గర వందల కోట్ల డిపాజిట్లు వసూలు చేస్తున్నారు. ఇది ఖచ్చితంగా నమ్మకద్రోహం. డబ్బులు వసూలు చేస్తూ.. వాటిని ఎక్కడికో తరలిస్తున్నారు.
మీడియా రౌడీయిజమ్:
చంద్రబాబు అధికార పత్రికగా ఈనాడు నడుస్తుంది. మా ప్రభుత్వంపై బురద జల్లేందుకు రోజుకో కథనం అల్లుతూ ప్రజల్ని భ్రమింపజేయాలని రామోజీరావు ప్రయత్నిస్తున్నాడు. ఆయన నమ్మకం నెరవేరదు. కేవలం, మీడియా చేతిలో ఉందని రామోజీరావు రాజకీయం నడిపిస్తున్నాడు. మార్గదర్శి కుంభకోణంకు తెలుగుదేశం మద్ధతిస్తే ప్రజలకు ద్రోహం చేసినట్లే.. రామోజీరావు రాజకీయం చేస్తున్నాడు. ఆయన రాజ్యాంగం వేరుగా ఉంటుందా..? ఉండదు కదా..? పోలీసులు, ఐటీ అధికారులు విచారణకు వచ్చినప్పుడు వారికి సహకరించాల్సింది పోయి ఇష్టానుసారంగా ప్రభుత్వం మీద కథనాలు రాస్తూ మీడియా రౌడీయిజానికి పాల్పడుతున్నాడు.