– ఉదయం సోషల్ మీడియాలో ఆశీస్సులు.. సాయంత్రానికి హస్తినలో కేక్ కటింగ్
– ఆత్మీయ ఆశీస్సులు అందించిన చంద్రబాబు నాయుడు.
– విమానాశ్రయంలోనే చంద్రబాబు నాయుడు, సహచర ఎంపీలు, కీలక నేతల మధ్య కేక్ కట్ చేసిన రామ్మోహన్ నాయుడు.
ఢిల్లీ: హస్తినలో రెండు రోజుల పర్యటన నిమిత్తం రాష్ట్రాభివృద్ధికి సంబంధించి పలువురు కేంద్ర మంత్రులను కలిసేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం నాడు ఢిల్లీకి చేరుకున్నారు. ఢిల్లీ విమానాశ్రయంలో ఆయనకు ఘన స్వాగతం లభించింది. టీడీపీ ఎంపీలు ముఖ్యమంత్రిని ఆహ్వానించి సన్మానించారు. చంద్రబాబు నాయుడుకు ‘బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు లభించిన సందర్భంలో కూటమి ఎంపీలు ఆయన్ను బొబ్బిలి వీణతో సత్కరించారు. ఈ సందర్భంగా ఎంపీలు ఆయన నాయకత్వాన్ని కొనియాడారు..
అదే సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కు మరోసారి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. తన సోషల్ మీడియా వేదికల్లో ప్రత్యేకంగా శుభాకాంక్షలను అందిస్తూ పోస్ట్ చెయ్యగా.. సాయంకాలానికి డిల్లీ చేరుకున్న చంద్రబాబు నాయుడు.. విమానాశ్రయంలోనే కేక్ కట్ చేయించి ఆయన పుట్టినరోజుకు మరింత ఉత్సాహాన్ని జోడించారు. మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలంటూ.. చంద్రబాబు నాయుడు నుండి మరోసారి ఆత్మీయ ఆశీస్సులు అందుకున్నారు. ఈ సందర్భంగా అనేక సరదా సంభాషణలు అక్కడ చోటు చేసుకున్నాయి
కాగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేపు ఢిల్లీలో పలువురు కేంద్రమంత్రులను మర్యాదపూర్వకంగా కలవనున్నారు. ఈ భేటీల్లో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై చర్చలు జరగనున్నాయి.