– ఐఏఎస్,ఐపిఎస్‌ల బదిలీలపై ఈసారి సీరియస్‌గా వడపోత
– గతానుభవాలు, విమర్శల నేపథ్యంలో ఆచితూచి అడుగులు
– అందుకే బదిలీలు ఆలస్యమవుతున్నాయంటున్న పార్టీ వర్గాలు
– విజయానంద్, మద్దాడతో కలసి కసరత్తు
– సీఎంఓలో మిగిలిన వారిని దూరం పెట్టిన బాబు?
– ఐపిఎస్ పోస్టింగులపైనే సీరియస్ దృష్టి
– సందేహం వచ్చిన వారిపై అప్పటికప్పుడే ఆరా
– శుక్రవారం నాటికి జాబితా ఖరారవుతుందంటున్న అధికార వర్గాలు
( మార్తి సుబ్రహ్మణ్యం)
ఏడాదిలో జరిగిన నియామకాల ఎంపిక లోపాలు.. వాటిపై సొంత పార్టీ వర్గాలు, పార్టీ సోషల్‌మీడియాలో వచ్చిన విమర్శలు-ఆరోపణల అనుభవాలను పరిగణనలోకి తీసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు.. తాజా నియామకాలపై ఆచితూచి వ్యవహరిస్తున్నారు. అందుకే ఎప్పుడో పూర్తి కావల్సిన ఐఏఎస్-ఐపిఎస్ నియామకాలు ఆలస్యమవుతున్నట్లు పార్టీ-అధికార వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ప్రస్తుత వడపోత పరిణామాలు చూస్తే, శుక్రవారానికి గానీ ఇది ఖరారు కాకపోవచ్చంటున్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈసారి బదిలీలలో ఐపిఎస్లపైనే సీరియస్‌గా దృష్టి సారిస్తున్నట్లు సమాచారం. గత ఏడాదిలో చేసిన నియామకాలపై ఎప్పుడూ లేనంత విమర్శలు వెల్లువెత్తాయి. సొంత పార్టీ నాయకులు, పార్టీ సోషల్‌మీడియా సైనికులే ఆ నియామకాలపై విరుచుకుపడ్డాయి. వివిధ విమర్శలున్న వారిని, గత వైసీపీ హయాంలో విశిష్టసేవలందించిన అధికారులకు మంచి పోస్టింగులివ్వడమే దానికి కారణం. ప్రధానంగా.. వైసీపీ హయాంలో వైసీపీఎస్ అధికారులుగా ముద్రపడ్డవారిని కొద్దికాలం వెయిటింగ్లో ఉంచి, మళ్లీ పోస్టింగులివ్వడం టీడీపీ సోషల్‌మీడియా, పార్టీ వర్గాలకు అసలు రుచించలేదు.
ముఖ్యంగా.. ఎన్నికల చివరి సమయంలో పార్టీ నాయకులు-కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టడంతోపాటు.. చివరకు చంద్రబాబును అరెస్టు చేసిన అప్పటి డీజీపీ రాజేంద్రనాధ్‌రెడ్డిని పక్కనపెట్టకుండా…ఇంకా కొనసాగించటంపై పార్టీ వర్గాల్లో ఆగ్రహం వ్యక్తమయింది.
కాగా.. ఎన్నికల ముందు నాటి పోలీసు కీలక అధికారి, ప్రభుత్వం నుంచి 7 కోట్ల రూపాయల ఎస్ఆర్ అమౌంట్ డ్రా చేసుకున్న వ్యవహారంపై అటు ప్రభుత్వం గానీ, ఇటు డీజీపీ గానీ విచారణ జరిపించకపోవ డంపై పోలీసు వర్గాల్లో విస్మయం వ్యక్తమవుతోంది. గతంలో చాలామంది ఉన్నతాధికారులు, తాము వెళ్లిపోయేముందు తమ వద్ద ఉన్న ఎస్ఆర్ అమౌంట్‌ను జిల్లా ఎస్పీల ఖాతాలకు వేసేవారు. కానీ ఓ కీలక పోలీసు అధకారి మాత్రం వాటిని పంచలేదని, మరోసారి ప్రభుత్వం నుంచి తెప్పించుకున్న 2 కోట్ల రూపాయలను మాత్రమే పంచారన్న విమర్శలు వినిపించాయి. అయినా ఇప్పటిదాకా దానిపై ఏ స్థాయిలోనూ విచారణ జరగకపోవడంపై విస్మయం వ్యక్తమవుతోంది.
ఇదిలాఉండగా.. ఏడాది ్రి తం జరిపిన నియామకాలన్నీ ఒక మాజీ డీజీపీ, మరో మాజీ ఐజి ఆధ్వర్యంలో చేసిన ఎంపికలేనన్న విమర్శలు వెల్లువెత్తాయి. దాని ఫలితమే ఇప్పటి వైఫల్యాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కూడా గుర్తించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నిజానికి వారిద్దరిలో మాజీ డీజీపీ నాలుగున్నరేళ్లు యూనిఫారం డ్యూటీలో లేరని, మరోక మాజీ ఐజి అసల ఈ రాష్ట్రంలో లేరని, అలాంటి వారి చేతికి పోస్టింగుల పెత్తనం ఇస్తే ఏం న్యాయం జరుగుతుందని పార్టీ నేతలు అప్పుడే విమర్శల వర్షం కురిపించారు. అయినా ఎస్పీలు, ఐజీల పోస్టింగు పెత్తనం వారికే ఇచ్చినందున, ప్రస్తుత పరిస్థితి గందరగోళంగా ఉందంటున్నారు.
కాగా సదరు మాజీ డీజీపీ.. ప్రస్తుతం పోలీసుశాఖలో ఓ కీలక అధికారికి, చివరి నిమిషంలో చంద్రబాబు వద్ద చక్రం తిప్పి ఆ పదవి దక్కేలా చేశారన్న ప్రచారం పార్టీ వర్గాల్లో లే పోలేదు. వీటిని పరిగణనలోకి తీసుకున్న చంద్రబాబునాయుడు.. ఐపిఎస్ పోస్టింగులలో తానే సొంతగా ఎక్సర్సైజ్ చేస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో తనకు అనుమానం ఉన్న వారి సమాచారం తెప్పించుకుంటున్నట్లు తెలుస్తోంది.
అయితే.. ఈ కసరత్తు ప్రక్రియలో సీఎంఓ ప్రత్యేక కార్యదర్శి మద్దాడ రవిచంద్ర, సీఎస్ విజయానంద్ మాత్రమే భాగస్వాములుగా ఉన్నారని, మిగిలిన ముగ్గురు అధికారులను దూరం పెట్టారని సచివాలయ వర్గాలు చెబుతున్నాయి. కాగా సీఎంఓలో వివాదాస్పద అధికారిగా పేరున్న ఓ అధికారి.. పలువురు ఐఏఎస్‌లకు ఫోన్లు చేసి, వారికి జిల్లా కలెక్టర్లుగా పోస్టింగు ఇప్పిస్తానని చెబుతున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. నిజానికి అసలు సదరు అధికారినే, సీఎంఓ నుంచి పంపిస్తారన్న ప్రచారం చాలాకాలం నుంచి ఉంది. దీనితో సీఎం చంద్రబాబునాయుడు అసలుసీఎంఓ కార్యదర్శులెవరూ లేకుండానే ఎంపిక కసరత్తు చేస్తున్నట్లు చెబుతున్నారు.
వారికి కలెక్టర్ల అవకాశం ఎప్పుడు?
ఐఏఎస్ అయిన ప్రతి అధికారికి కలెక్టర్ కావాలన్నది ఓ కల. సీఎస్‌గా పదవీ విరమణ చేయాలన్నది ఓ కోరిక. కానీ అవే మీ తీరకుండానే చాలామంది ఐఏఎస్‌లు రిటైరయిపోతున్నారు. వారికి మున్సిపల్ కమిషనర్లు, సీఈఓలు, డైరక్టర్లు, ప్రభుత్వ శాఖల కార్యదర్శులు, స్పెషల్ సీఎస్ వరకూ అవకాశం వచ్చి.. కలెక్టరు, సీఎస్ కాకుండానే రిటైరైపోతున్నారు. కాగా ప్రస్తుతం కలెక్టర్లు కాకుండా.. ఫోకల్ పోస్టులకు దూరంగా ఉన్న ఐఏఎస్‌లకు చంద్రబాబునాయుడు అవకాశం కల్పిస్తారో లేదో చూడాలి. అలాంటి వారికి కనీసం కీలక శాఖలకు ముఖ్య కార్యదర్శులుగా అవకాశం ఇస్తే బాగుంటుందని మాజీ ఐఏఎస్‌లు సూచిస్తున్నారు. ‘నిజానికి ప్రభుత్వంలో కొందరు అధికారులకే అనేక శాఖలు అప్పగిస్తున్నారు. దానివల్ల పనిభారం పెరిగి, ఏ శాఖకూ న్యాయం చేయలేపోతున్నారు. దానిబదులు అసలు ఇప్పటివరకూ కలెక్టర్లుగా అవశాలు రాని వారికి కీలక శాఖలు అప్పగిస్తే మంచిది’’ అని ఓ మాజీ ఐఎఎస్ అధికారి వ్యాఖ్యానించారు. దేవదాయ శాఖకు ఐఏఎస్‌ను కమిషనర్‌ను నియమించాలని, కానీ ఇప్పుడు దానికి నాన్ ఐఏఎస్ కమిషనర్‌గా ఉన్నారని గుర్తు చేశారు. ఆయనపై అన్ని విమర్శలు-ఆరోపణలు వచ్చినా ఆయనను కమిషర్‌గా కొనసాగించడం ప్రభుత్వ ప్రతిష్ఠకు మంచిదికాదని వ్యాఖ్యానించారు.